ఏం జరుగుతోంది..? వారు ఎందుకు సైలెంట్ అయ్యారు..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-26 09:41:15  IST  )

కాలుష్యాన్ని వెదజల్లే మరో ఫార్మా పరిశ్రమ ఏర్పాటు కాబోతుందనే విషయం తెలిసిన వెంటనే వ్యతిరేకంగా స్వరం పెంచి, పోరు మొదలుపెట్టిన వారు గ్రామాల వారీగా బంద్ కు కాల్ ఫర్ చేశారు.

ఏం జరుగుతోంది..?  వారు ఎందుకు సైలెంట్ అయ్యారు..!
X

దిశ, భిక్కనూరు : కాలుష్యాన్ని వెదజల్లే మరో ఫార్మా పరిశ్రమ ఏర్పాటు కాబోతుందనే విషయం తెలిసిన వెంటనే వ్యతిరేకంగా స్వరం పెంచి, పోరు మొదలుపెట్టిన వారు గ్రామాల వారీగా బంద్ కు కాల్ ఫర్ చేశారు. దీనికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ అనుకున్నట్టుగానే బంద్ విజయవంతం కావడం, పబ్లిక్ హియరింగ్ కార్యక్రమం కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. మాట్లాడిన ప్రతి ఒక్కరూ కామారెడ్డి జిల్లా భిక్కనూరు పట్టణ శివారులో ఫ్యూజన్ హెల్త్ కేర్ ఫార్మా కంపెనీ విస్తరణ కు అనుమతులు ఇవ్వొద్దని ముక్తకంఠంతో వ్యతిరేకించిన విషయం విధితమే. ఆనాడు స్టేజ్ పై మాట్లాడిన వారితో పాటు, కార్యక్రమానికి పెద్ద మొత్తంలో హాజరైన వారు వారం రోజుల తర్వాత కొందరు సైడయ్యారన్న ప్రచారం జరిగింది. మొదట్లో పట్టణ స్థాయి జేఏసీ ఆ తరువాత మండల స్థాయి జేఏసీని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలని అఖిలపక్షం నాయకులు నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం అడుగులు వేస్తున్న క్రమంలో జేఏసీ చైర్మన్ పదవి పై కన్నేసిన కొందరు, అంతర్గతంగా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీలకతీతంగా అందరికీ అందుబాటులో ఉండి ఫుల్ టైం సమయం కేటాయించే సమర్ధుడు ఎవరున్నారన్న కోణంలో కూడా ఆలోచన చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలోనే కొందరు నేనంటే నేను జేఏసీ చైర్మన్ రేసులో ఉండడం, ఒకరి పేరు ప్రస్తావిస్తే, మరొకరికి కోపాలు రావడం వలన, ఇదంతా మాకెందుకు అన్న భావనతో సైడ్ అయ్యారన్న ప్రచారం జరిగింది.

మ‌ల్ల‌గుల్లాలు అందుకేనా...?

పార్టీలకతీతంగా జేఏసీ ఏర్పాటుచేసి, ప్రస్తుతం ఉన్న ఫార్మా కంపెనీలతోపాటు, కొత్తగా రాబోతున్న కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని ముందుకు వచ్చినవారు, ఆదిశగా అడుగులు వేయకపోగా సైలెంట్ ఎందుకయ్యారన్నది అంతుచిక్కని ప్రశ్న. ప్రజల పక్షాన నిలబడి ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా పోరుబాట పట్టిన కొందరి పై ఒత్తిడి పెంచి సైడ్ అయ్యేలా చేశారా..? లేక వారికి పబ్లిక్ లో పేరు వస్తే, మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్న భయంతోనే, జేఏసీ ఏర్పాటు కాకుండా మోకాల డ్డుతున్నారా అన్న మరో ప్రచారం కూడా జరుగుతోంది. ప్రాణాలైనా అర్పించి ఫార్మా కంపెనీలు ఏర్పాటు కాకుండా అడ్డుకుంటామని స్టేజ్ పై స్పీచ్ దంచిన వారిలో కొంతమంది వెనక్కి తగ్గడం వెనక కారణమేంటన్నది అందరిలో తొ లుస్తున్న ప్రధాన సమస్య.

కాళ్లలో కట్టెలు పెట్టడమేనా..?

పబ్లిక్ హియరింగ్ జరిగి పక్షం రోజులు దాటినా, ఏ ఒక్కరూ ఒక్క చోటికి చేరుకొని సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించకపోవడంతో, చేసేదేమీ లేక మండలానికి చెందిన పలువురు భిక్కనూరు సిద్దరామేశ్వరాలయం సమీపంలో ఉన్న వీరభద్రుని ఆలయం వద్ద నిన్న సమావేశమయ్యారు. ఆశించిన స్థాయిలో నేతలు సమావేశానికి రాలేకపోయారు. ఎక్కువమంది రాకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయని కూడా డిస్కస్ చేశారు. ప్రజల పక్షాన నిలబడి ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ముందుకు వచ్చే వారిపై లేనిపోని ఆరోపణలు చేయించి కాళ్ళలో కట్టెలు పెట్టే అన్న చందంగా చేస్తే, వారు ముందుకు వెళ్లకుండా వెనక్కి తగ్గితే, అప్పుడు మన ఆధిపత్యం చెలాయించుకోవచ్చనే చీఫ్ ట్రిక్స్ ను ఉపయోగించి కొందరు ఇదంతా చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇకనైనా బేషజాలను పక్కనపెట్టి, గ్రామాల వారిగా నేతలను కలుపుకుపోయి జేఏసీ ఏర్పాటు చేసే విధంగా అడుగులు వేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.

Next Story