- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ కార్యక్రమాలలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం సిరికొండలోని ఎ.జీ.దాస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మండల సభలో కలెక్టర్ పాల్గొన్నారు. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గేయంతో సభకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల వివరాలను ఒక్కో పథకం వారీగా అధికారులు వెల్లడించడం ద్వారా పథకాల అమలులో పారదర్శకతను చాటారు. రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహ జ్యోతి, చేయూత పథకం, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ తదితర వాటి ద్వారా లబ్ది పొందిన వారి వివరాలు చదివి వినిపించారు. పలువురు లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల చేకూరిన ప్రయోజనాల గురించి సభలో తమ అభిప్రాయాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మునుముందు అమలు చేయనున్న పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రగతి, సంక్షేమంలో వారిని భాగస్వామ్యం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వం రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్), కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్, చేయూత పథకం కింద పెన్షన్ లు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయడం జరుగుతోందని అన్నారు. ఇంకనూ అర్హులైన వారు మిగిలి ఉంటే, ఆయా పథకాల ద్వారా లబ్ది చేకూర్చడం జరుగుతుందని భరోసా కల్పించారు. తొలివిడత ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు తుది దశకు చేరాయని, త్వరలోనే ప్రభుత్వం రెండవ విడత కింద లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయనుందని అన్నారు. గుడిసెలు లేని తెలంగాణగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా గుడిసెలలో నివసిస్తున్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరీలో మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేయనుందని అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న యంత్రలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ పథకం కింద కల్టివేటర్లు, రోటవేటర్లు వంటి వ్యవసాయ యంత్ర పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై సమకూరుస్తోందని అన్నారు. రైతులకు లాభదాయకంగా ఉండేలా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్.పీ.ఓ)లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మహారాష్ట్రలోని బారామతి ప్రాంత రైతులు ఎఫ్.పీ.ఓలను ఏర్పాటు చేసుకుని, నూతన విధానాలలో పంటలను సాగు చేయడం ద్వారా ఆర్థికంగా ఎంతో వృద్ధి సాధించారని అన్నారు. జిల్లా రైతాంగం కూడా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ సేద్యపు రంగంలో ప్రగతి సాధించాలని, ఈ దిశగా ప్రభుత్వం రైతు వేదికల ద్వారా అమలు చేస్తున్న రైతు నేస్తం కార్యక్రమాలలో పాల్గొని పంటల సాగు విషయమై సలహాలు, సూచనలు పొందాలని కలెక్టర్ సూచించారు.
పసుపు రైతులకు మేలు చేకూర్చడమే ధ్యేయం
పసుపు రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, వారికి మేలు చేకూర్చడమే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు భరోసా కల్పించారు. రైతులకు గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశ్యంతో స్థానిక మార్కెట్ యార్డులో పసుపు అమ్మకాలలో బహిరంగ వేలం విధానాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. పసుపు పంట క్వింటాకు సగటున రూ. 16 వేలు ధర లభిస్తోందని తెలిపారు. రైతులు ఎలాంటి అపోహలకు గురి కాకూడదని, వారి ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూస్తామని కలెక్టర్ భరోసానిచ్చారు. సభలో పాల్గొన్న రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మండలంలో నెలకొని ఉన్న పలు సమస్యలను ప్రస్తావించగా, వాటి పరిష్కారం విషయమై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ సభలో మండల ప్రత్యేక అధికారి నాగూరావు, ఎంపీడీఓ మనోహర్, తహసీల్దార్ రవీందర్ రావు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.






