రౌడి యిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : ఎస్పీ రాజేష్ చంద్ర

by Ratna Kumari |

జిల్లాలో రౌడీయిజానికి పూర్తిగా ముగింపు పలుకుతామని, భయపెట్టి దందాలు చేయడం, బెదిరింపులు, గొడవలు సృష్టించడం వంటి అసాంఘిక చర్యలకు ఏమాత్రం స్టావరం ఉండదని ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టం చేశారు.

రౌడి యిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం :  ఎస్పీ రాజేష్ చంద్ర
X

దిశ‌, కామారెడ్డి : జిల్లాలో రౌడీయిజానికి పూర్తిగా ముగింపు పలుకుతామని, భయపెట్టి దందాలు చేయడం, బెదిరింపులు, గొడవలు సృష్టించడం వంటి అసాంఘిక చర్యలకు ఏమాత్రం స్టావరం ఉండదని ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. అదే సమయంలో తమ ప్రవర్తన మార్చుకుని సాధారణ జీవితం గడుపుతున్న వారికి పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. సత్ప్రవర్తన కనబరిచిన 13 మంది రౌడీషీటర్ల షీట్ల తొలగింపునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం, మార్పు చూపిన ప్రతి ఒక్కరికీ కొత్త జీవితానికి మార్గం కల్పించాలన్న పోలీసుల సంకల్పానికి నిదర్శనమని తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీట్లు కలిగిన వ్యక్తులతో ప్రత్యేకంగా “రౌడీ మేళా” నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రౌడీషీటర్లతో ప్రత్యక్షంగా మాట్లాడి, చట్టవ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా మానుకుని కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితం గడపాలని సూచించారు. ప్రజలను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, గంజాయి విక్రయం, హత్యలు, హత్యాయత్నాలు, గొడవలు వంటి నేరాలకు పాల్పడితే కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయడానికీ వెనుకాడబోమన్నారు.


పోలీసు రికార్డులు, స్థానిక పోలీస్ అధికారుల నివేదికలు, జిల్లా స్థాయి రౌడీ షీట్స్ రివ్యూ కమిటీ పరిశీలన ఆధారంగా.. సత్ప్రవర్తన కనబరిచిన 13 మంది రౌడీషీటర్ల షీట్ల తొలగింపునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీరంతా భవిష్యత్తులో కూడా ఎలాంటి నేరాలకు పాల్పడకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని ఆకాంక్షించారు. వరుసగా ప‌దేళ్ల పాటు ఎలాంటి నేరాల్లో ప్రమేయం లేకుండా మంచి ప్రవర్తన కనబరిచిన వారికి నిష్పక్షపాత విచారణ అనంతరం జిల్లా అధికారుల కమిటీ సిఫారసు మేరకు రౌడీ షీట్లు తొలగించే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే మార్పు చూపకుండా తిరిగి నేరాలకు పాల్పడుతున్న వారి రౌడీ షీట్లు యథావిధిగా కొనసాగుతాయని, వారి కేసులను స్వయంగా పర్యవేక్షిస్తూ కోర్టుల్లో శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కత్తులు, ఆయుధాలతో ఫోటోలు పోస్టు చేయడం, ప్రజల్లో భయాందోళనలు కలిగించే విధంగా ప్రవర్తించడం వంటి చర్యలను కూడా తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. నేరరహిత సమాజ నిర్మాణం కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తోందని, రౌడీషీటర్లలో సానుకూల మార్పు తీసుకురావడం ద్వారానే సమాజంలో శాంతి, భద్రతలు మరింత బలోపేతం అవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కే.నరసింహారెడ్డి, డీఎస్పీలు మధుసూదన్, విఠల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, డీసీఆర్‌బీ సీఐ మురళి, సీఐలు, ఎస్‌ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story