ప్ర‌త్యేక గ్రామ‌పంచాయ‌తీ చేస్తేనే ఓట్లు వేస్తాం

by Ratna Kumari |

దిశ, కామారెడ్డి : ప్రత్యేక గ్రామ పంచాయతీగా తమ తండాను ఏర్పాటు చేస్తేనే ఓట్లు వేస్తామని పేర్కొంటూ ఓ తండా వాసులు పంచాయతీ

ప్ర‌త్యేక గ్రామ‌పంచాయ‌తీ చేస్తేనే ఓట్లు వేస్తాం
X

దిశ, కామారెడ్డి : ప్రత్యేక గ్రామ పంచాయతీగా తమ తండాను ఏర్పాటు చేస్తేనే ఓట్లు వేస్తామని పేర్కొంటూ ఓ తండా వాసులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండా పంచాయతీ పరిధిలోని కింది తండాలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కామారెడ్డి ఆర్డీవో వీణ తండాకు వెళ్లి తండావాసులతో మాట్లాడినప్పటికీ వారు కింది తండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తేనే ఓట్లు వేస్తామని భీష్మించుకు కూర్చున్నారు. పంచాయతీ ఎన్నికలు రెండు తండాల మధ్య పంచాయితీని పెట్టాయి. ఓటర్లు ఎక్కువ ఉన్న‌ తండావాసులు తమకు అవకాశం దక్కకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ మరో తండావాసులు ఎన్నికలను బహిష్కరించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో మీది తండా, కింది తండాలున్నాయి. మీది తండా లో 350 ఓట్లు, ఐదు వార్డులు ఉండగా.. కింది తండాలో 250 మంది ఓట్లు, మూడు వార్డులు ఉన్నాయి. 2019లో ఈ గ్రామ పంచాయతీకి మొదటిసారి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో మీది తండావాసులు తమ గ్రామానికి చెందిన వ్యక్తిని సర్పంచ్ గా ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. జనాభా ఎక్కువగా ఉండడంతో ఈసారి కూడా ఆ తండావారే సర్పంచ్ ను వేలం పాట ద్వారా ఎన్నుకోవాలని చూస్తున్నారని కింది తండావాసులు ఆరోపిస్తున్నారు. తమ తండా లో ఓటర్లు తక్కువగా ఉండడంతో పట్టించుకోవడం లేదని, వేలంలో కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా కింది తండా నుంచి వార్డు స్థానాలకు నామినేషన్ వేసిన ముగ్గురు అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాగా సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిన ఇద్దరు మాత్రం బరిలోనే ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థులుగా మీది తండా నుంచి ఒకరు, కింది తండా నుంచి ఇద్దరు పోటీలో ఉన్నారు.

Next Story