సర్పంచ్ భర్త పెత్తనంపై వార్డు సభ్యుల తిరుగుబాటు

by Kodari Anjali |

మహిళల రాజకీయ సాధికారత కోసం రాజ్యాంగం గ్రామపంచాయతీల్లో కల్పించిన రిజర్వేషన్లు అభాసు పాలవుతున్నాయి.

సర్పంచ్ భర్త పెత్తనంపై వార్డు సభ్యుల తిరుగుబాటు
X

దిశ, మాచారెడ్డి: మహిళల రాజకీయ సాధికారత కోసం రాజ్యాంగం గ్రామపంచాయతీల్లో కల్పించిన రిజర్వేషన్లు అభాసు పాలవుతున్నాయి. గ్రామ పరిపాలనలో మహిళలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా చట్టాలు రూపొందించినా అధికారులు తూట్లు పొడిచారు. అందుకే ఆ లక్ష్యానికి విరుద్ధంగా కొన్నిచోట్ల మహిళా సర్పంచ్ స్థానంలో ఆమె భర్తలే అధికారం చెలాయిస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండా గ్రామ సర్పంచ్ భర్త జోక్యం అధికమైందని ఆరోపిస్తూ వార్డు సభ్యులు మండల, జిల్లా స్థాయి అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.

వార్డు సభ్యుల ఆరోపణలు

ఫిర్యాదు పత్రం ప్రకారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక ఛాంబర్ ను ఏర్పాటు చేసుకుని సర్పంచ్‌కు బదులుగా ఆమె భర్త కూర్చొని పరిపాలన నిర్వహిస్తున్నారు. భర్తతో పాటు ఆమె ఇద్దరు కుమారులు కూడా అజమాయిషీ చేస్తున్నారు. గ్రామంలోని పనులు, నిర్ణయాలు, బిల్లులు, అధికారులతో సమావేశాలు అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. గ్రామపంచాయతీ సమావేశాల్లో కూడా సర్పంచ్ భర్తే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన సొంత నిధులతో తాగు నీటి కోసం బోరు వేయించినట్టు పత్రికా ప్రకటనలు ఇచ్చి ప్రస్తుతం పంచాయతీ నిధులు తీసుకోవడానికి ఎం బి చేయిస్తున్నారు. వార్డు సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని, తమకు పరిపాలనా విషయాలేమీ తెలియడం లేదని ఫిర్యాదులో వివరించారు.

చట్టం ఏమంటోంది?

భారత రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామపంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. దీని ఉద్దేశం మహిళలను స్వయంగా ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దడం. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 ప్రకారం ఎన్నికైన సర్పంచ్ మాత్రమే గ్రామపంచాయతీ పరిపాలన, సమావేశాల నిర్వహణ, అధికారిక నిర్ణయాలకు బాధ్యత వహించాలి. ఎన్నిక కాని వ్యక్తి అధికారికంగా పంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి చట్టపరమైన అధికారం లేదు. మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలు లేదా కుటుంబ సభ్యులు అధికారాలు చెలాయించడాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలుమార్లు తప్పుబట్టాయి. ఇటువంటి జోక్యాన్ని నిరోధించాలని ప్రభుత్వాలు జిల్లా అధికారులకు మార్గదర్శకాలు కూడా జారీ చేశాయి. కానీ స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారుల బాధ్యతారాహిత్యం వల్లనే మహిళా సాధికారత కు విఘాతం కలుగుతుందని ఆరోపణలున్నాయి. అధికారిక కార్యక్రమాలకు సమాచారం ఇవ్వడానికి ఉపయోగపడే ఫోన్ నెంబర్లు భర్తలకు సంబంధించిన వి ఉండడం, అధికారులు భర్తలనే సర్పంచ్ సాబ్ అని పిలవడం వల్లే సతుల స్థానం లో పతుల రాజ్యం పాతుకుపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ అధికార పార్టీ పెద్దల నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తారేమోనని భావించడం వల్ల ఈ విషయం లో అధికారులు పిల్లులై పోయారనే విమర్శలు మూటగట్టుకున్నారు.

ఆనాడే వెలుగులోకి తెచ్చిన 'దిశ '

సర్పంచ్ ఎన్నికల అనంతరం ప్రభుత్వ శిక్షణాతరగతుల కు మహిళా సర్పంచ్ ల కు బదులు గా వారి భర్తలు హాజరయ్యారు. ఇదే విషయాన్ని "సతుల స్థానం లో పతులు" అనే శీర్షికతో 'దిశ ' ఆదిలోనే వెలుగులోకి తెచ్చింది. అందులో గజ్యానాయక్ నాయక్ తండా గ్రామ సర్పంచ్ భర్త ఉండడం, అతని పై వార్డు సభ్యులు నేడు ఫిర్యాదు చేయడం విశేషం. దిశ చెప్పిన రోజు నుంచి అధికారులు చర్యలు చేపడితే ఇలాంటి అసమానతల పై ఫిర్యాదులు వచ్చేవి కాదు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం లో మార్పులు వస్తాయో లేదో వేచి చూడాలి.‌

Next Story