ఈ జిల్లాలో ఆగని మొరం, ఇసుక దందా

by Naveena |   (  Updated:2025-03-12 06:07:05  IST  )

జిల్లాలో మొరం, ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. కొందరు నాయకులు అక్రమార్కులు కలిసి ధనార్జనే ధ్యేయంగా ప్రకృతి సంపదను కొల్లగొడుతూ.. అక్రమదందా జోరుగా సాగిస్తున్నారు.

ఈ జిల్లాలో ఆగని మొరం, ఇసుక దందా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ :జిల్లాలో మొరం, ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. కొందరు నాయకులు అక్రమార్కులు కలిసి ధనార్జనే ధ్యేయంగా ప్రకృతి సంపదను కొల్లగొడుతూ.. అక్రమదందా జోరుగా సాగిస్తున్నారు. ప్రకృతి పట్ల కనికరం లేదు.. పర్యావరణం పట్ల పట్టింపు లేదు.. చట్టాలు, న్యాయాలు, యంత్రాంగం, ప్రభుత్వం, శిక్షలు ఇవంటే భయమసలే లేదు. తమ వెనకాల అధికారం ఉంది.. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయనే ధీమాతో తెగిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా చట్టాలను చట్టుబండలు మార్చి ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు. అడ్డువచ్చిన అధికారులను, మీడియాను, ఏ వ్యవస్థనైనా పచ్చనోట్లతో నోరు మూయిస్తున్నారు. బహిరంగంగా అన్ని వ్యవస్థలనూ కొనేసి చేయాల్సిన పనులు ఎంచక్కా చేసుకుంటున్నారు. పట్టపగలు ప్రజాస్వామ్యం నవ్వులపాలవుతున్న ప్రజాప్రతినిధులకు పట్టింపు లేదు.. అధికారులకు పట్టింపు లేదు. దీంతో వాగులు, నదుల్లో ఇసుక మాయమవుతోంది. మొరం గుట్టలు రోజుల వ్యవధిలోనే మైదానాలుగా మారుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇష్టారీతిన అక్రమ వ్యాపారాలు చేస్తూ కోట్లాది రూపాలయ ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ ఖజానాలో జమ కావాల్సిన ధనాన్ని దర్జాగా ఖద్దరు నేతలు కాజేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇసుక, మొరం దందాలపై ప్రతినెలా రూ. 300 కోట్ల దాకా సంపాదిస్తున్నారని అనధికారిక అంచనా.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇసుక, మొరం మాఫియా రోజు రోజుకూ రెచ్చిపోతోంది. అధికార పార్టీ నేతల అండదండలతో అడ్డూ అదుపూ లేకుండా ప్రతినెలా రూ. కోట్లలో ఇసుక, మొరం రవాణా చేస్తోంది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో మంజీర నదీ పరివాహక గ్రామాల్లో విచ్చల విడిగా ఇసుకను జేసీబీలు పెట్టి తవ్వుతున్నారు. ఆయా గ్రామాల ప్రజలను, పలుబడి ఉన్న నేతలను, వివిధ రాజకీయపార్టీల నాయకులను ముడుపులతో మేనేజ్ చేసి దర్జాగా వారి అక్రమ ఇసుక దందాను సాగిస్తున్నారు. అధికారులకు, మీడియా ప్రతినిధులకు ప్రతినెలా వేలల్లో ముడుపులు ఇస్తూ ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఎదురవకుండా ఇసుక దందాను మూడు టిప్పర్లు.. ఆరు ట్రాక్టర్ల చందంగా వ్యాపారాన్ని నిరాటకంగా కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని కోటగిరి, బీర్కూర్, పోతంగల్, బాన్సువాడ పరిధిలోని మంజీర నదీపరివాహక ప్రాంతాల్లోని ఇసుక రీచ్ ల నుండి విచ్చల విడిగా నిర్భీతిగా ఇసుకను దొంగిలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్, నవీపేట, సాలూర ప్రాంతాల నుండి కూడా ఎలాంటి అధికారిక అనుమతులు లేకున్నా, నిబంధనలు, నిషేధాలెన్నున్నా ఎవడ్రా మమ్మల్నాపేదంటూ రాత్రీ, పగలు తేడా లేకుండా టిప్పర్లు, 12 టైర్ల వాహనాలు, ట్రాక్టర్ల తో ఇసుకను ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకే కాదు, హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి నగరాలతో పాటు సరిహద్దు జిల్లాలకు కూడా ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక రీచ్ ల నుంచి అడ్డగోలుగా ఇసుకను తవ్వి వివిధ ప్రాంతాల్లో ఆ ఇసుకను గుట్టలుగా డంప్ చేస్తూ రాత్రి వేళల్లో ఇతర ప్‌రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుక లోడ్ ను రూ. 5 వేల నుండి రూ. 8 వేల వరకు అమ్ముతున్నారని, ఇసుక మాఫియా కూడా సిండికేట్ కావడంతో గతంలో రూ. 2 వేలకు దొరికే ఇసుక ప్రస్తుతం రూ. 5 వేలకు పైగానే పెట్టి కొనాల్సి వస్తోందని జనాలు అంటున్నారు.

కాంగ్రెస్ నేత అండతో జోరుగా ఇసుక రవాణా..

బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‍గల్, మోర్తాడ్, కమ్మర్ పల్లి, వేల్పూర్, ఏర్గట్ల, బాల్కొండ మండలాల్లో కూడా ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. భీమ్‍గల్ మండలం కప్పల వాగు, బడాభీమ్‍గల్ వాగు, బెజ్జోర వాగు నుంచి నిరంతరాయంగా ఇసుక రవాణా జోరుగా జరుగుతోంది. స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులకు క్రమం తప్పకుండా అందుతున్న ముడుపుల కారణంగా ఆ రెండు వ్యవస్థలు కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో దర్జాగా ఇసుకను తరలిస్తున్న మాఫియాను అడ్డుకునే నాధుడే లేకుండా పోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాము పని చేస్తున్నామని చూపించుకోడానికన్నట్లు అప్పుడప్పుడు ఒకటీ అరా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుకుని మీడియాకు వివరాలిస్తు గడిపేస్తున్నారనే విమర్శలున్నాయి. మోర్తాడ్, వేల్పూర్ మండలాల పరిధిలో కూడా ఇసుక రవాణా కు అడ్డూ అదుపు లేదు. పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు, మీడియాలో కథనాలు ప్రసారమైనప్పుడు కొద్ది రోజులు దందాను ఆపి మళ్లీ పట్టాలెక్కించేస్తున్నారు. ఎక్కడ వాగులు, ఒర్రెలు కనిపించినా అక్కడ ఇసుక రవాణా కోసం ట్రాక్టర్లు, టిప్పర్లు క్యూ కడుతున్నాయి.

మొరం దందా కూడా జోరుగానే సాగుతోంది..

కామారెడ్డి జిల్లాలో అక్రమ మొరం దందా కూడా జోరుగా సాగుతోంది. సోమేశ్వరం గుట్ట నుండి ఎలాంటి అనుమతులు లేకుండా యధేచ్ఛగా మొరం ను తరలిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. సోమేశ్వరం గుట్ట, జనిగెల చెరువు నుండి మొరం తరలిస్తున్నా అడ్డుకునేందుకు అధికారులు సాహసం చేయడం లేదు. సారవంతమైన మట్టిన తవ్వి వెంచర్లకు, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. మొరం టిప్పర్లు వీఐపీ కాన్వాయ్ లా ఓవర్ లోడ్ తో ఒకదాని వెంట ఒక టిప్పర్లు వెళుతుంటే జనాలు ఇబ్బందులు పడుతున్నారు. బాన్సువాడలో కూడా అడ్డూ అదుపు లేకుండా మొరం దందా సాగుతోంది. నందిపేట్, నవీపేట్, మాక్లూర్, డిచ్‍పల్లి మండలాల పరిధిలో కూడా మొరం దందా జోరుగా సాగుతోంది. ఇసుక, మొరం వ్యాపారాల్లో అడ్డగోలుగా సంపాదించాలంటే అధికార పార్టీ అండ ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కండువా కప్పుకుని తమ అక్రమ దందాలను ఆపకుండా కొనసాగిస్తున్నారు.

Next Story