ఇద్ద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగుల ఇళ్ల‌లో ప‌ట్ట‌ప‌గ‌లు చోరీ

by Ratna Kumari |

ఇద్ద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగుల ఇంట్లో క‌లిపి 5 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు కొంత నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు.

ఇద్ద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగుల ఇళ్ల‌లో ప‌ట్ట‌ప‌గ‌లు చోరీ
X

దిశ‌, కామారెడ్డి : ఇళ్లకు తాళాలు వేసి ఉద్యోగాలకు వెళ్లిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లల్లో పట్టపగలే చోరీ జ‌రిగింది. ఈ చోరీలో 5 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు కొంత నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధిత కుటుంబాలు, పోలీసుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉంటూ వైద్యశాఖలో పని చేసే బాలునాయక్, గర్గుల్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న శోభ కుటుంబాలు ఉంటున్నాయి. రోజు మాదిరిగా ఇళ్లకు తాళాలు వేసి ఉదయమే ఇద్దరు విధులకు బయలుదేరారు. మధ్యాహ్నం శోభ ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి డోర్లు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లగా చోరీకి పాల్పడుతున్న దుండగులు శోభను చూసి వెనక డోర్ గుండా పారిపోయారు. వెంటనే భయంతో శోభ తన భర్తకు ఫోన్ చేసింది. ఇంటికి వచ్చాక పోలీసులకు సమాచారం అందించారు. అదే కాలనీలో నిజామాబాద్ లో విద్యుత్ శాఖలో పని చేస్తున్న వెన్నెల ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ రెండు చోరీలలో పంచాయతీ సెక్రెటరీ ఇంట్లో 5 తులాల బంగారం తో పాటు దేవుని వద్ద గల హుండీ పగలగొట్టి అందులోనే డబ్బులు, వెన్నెల ఇంట్లో 30 తులాల వెండి, రూ.50 వేల నగదు దుండగులు దోచుకెళ్లినట్టుగా బాధితులు తెలిపారు. పోలీసులు క్లూస్ టీంతో వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story