- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలను ట్రోల్ చేస్తే సహించేది లేదు
తనతో పాటు మహిళలపై అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ ఎస్పీ రాజేష్ చంద్రను కలిసి ఫిర్యాదు చేశారు.

దిశ, కామారెడ్డి : తనతో పాటు మహిళలపై అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ ఎస్పీ రాజేష్ చంద్రను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఉదయం నుంచి నాపై షబ్బీర్ అలీ అన్న కొడుకు షేరు అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారన్నారు. మాటల్లో చెప్పలేని పదాలతో ట్రోల్ చేయడం దారుణమన్నారు. షబ్బీర్ అలీ.. ఇంకెన్ని రోజులు మీ అరాచకాలు సాగిస్తారు.
షబ్బీర్ అలీ.. ఇంకెన్ని రోజులు మీ అరాచకాలు సాగిస్తారు
"మీకు పని చేయడం చేతకాదు.. చేసే వారికి చేయనివ్వడం లేదు. పని చేస్తూ యాక్టివ్ గా ఉన్నవాళ్లను టార్గెట్ చేస్తారా అని నిలదీశారు. ఓ వైపు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి యువత సేవాభావంతో ముందుకు రావాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని మోటివేట్ చేస్తుంటే మీరు మాత్రం కించపరుస్తూ నీచ రాజకీయాలు చేయడం శోచనీయం" అన్నారు.
చేస్తున్న సేవలు ప్రజలందరికీ తెలుసు
"నేను కామారెడ్డి మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ గా, ఛైర్పర్సన్ గా, ప్రస్తుతం యువ నాయకురాలిగా ప్రజలకు ఎలాంటి సేవ చేస్తున్నానో అందరికి తెలుసన్నారు. వృద్ధ మహిళలకు చేయూతనిస్తున్నా.. ఎవరైనా చనిపోతే జీసీఆర్ ట్రస్ట్ ద్వారా అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాం, పేదింటి ఆడబిడ్డలకు పుస్తెమట్టెలు అందిస్తున్నాం, ఇటీవల జాబ్ మేళాతో యువత కు ఉద్యోగాలు కల్పించాం, ఇందిరమ్మ లబ్ధిదారులకు వంట సామగ్రి తదితర సాయం చేస్తున్నామన్నారు.
మీకు చేతనైన సాయం చేయండి..
మీరు రాజకీయాలు చేసుకోండి.. చేతనైన సహాయం చేయండి.. మీరు చేయరు.. చేసే వాళ్ళను టార్గెట్ చేస్తారా అని ఇందూ ప్రియా ప్రశ్నించారు. సీనియర్ నాయకుడిగా చెప్పుకునే మీరు ఇలాగేనా చేసేది అని నిలదీశారు.
కత్తుల దాడికి కారకులతో సంబంధాలు..
కామారెడ్డిలో కత్తుల దాడికి కారణమైన వారిని షబ్బీర్ అలీ వెంటేసుకుని తిరుగుతున్నారని ఇందూప్రియా విమర్శలు చేశారు. గత పన్నెండేళ్ళుగా కత్తుల దాడి కి కారణమైన వ్యక్తి కనిపించలేదని, ప్రస్తుతం ఆ వ్యక్తి వచ్చినప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయని ఆరోపణలు చేశారు. ఒక హిందూ మహిళగా తనను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. షబ్బీర్ అలీ అన్న కొడుకు షేరు, ఆయన కొడుకు ఇలియాస్, షేక్ ముక్తార్ అనే వ్యక్తుల ద్వారానే ఈ ట్రోలింగ్ జరుగుతోందని ఆరోపణలు చేశారు.
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది షబ్బీర్ అలీనే
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిన ఏకైక వ్యక్తి షబ్బీర్ అలీ నే అని ఇందూప్రియా ఆరోపించారు. ఇటీవల వైరల్ అయిన ఆడియోలో పీసీసీ చీఫ్, పార్టీ పట్ల, మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేది ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉండి మీరు (షబ్బీర్ అలీ) ఎలాంటి సలహాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ట్రోల్ చేయండి.. అడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు చేయాలని సలహాలు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో షబ్బీర్ అలీ అన్ ఫిట్ అని, ఆయన ప్రభుత్వ సలహాదారుగా కొనసాగే అర్హత లేదన్నారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పార్టీలో ఉంటే పార్టీకి నష్టమేనన్నారు. నన్ను మీరెంత ఇబ్బంది పెట్టినా ఇంకా ముందుకు సాగుతా.. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా అని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఖబడ్దార్ షబ్బీర్ అలీ అని హెచ్చరించారు. తమ ఫిర్యాదుపై సరైన న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామని, లేకపోతే రాష్ట్ర మహిళ కమిషన్, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఆమె వెంట మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.






