పాపాల భైరవుడు కేసీఆర్ కు కాలం చెల్లింది..

by Disha Web Desk 20 |
పాపాల భైరవుడు కేసీఆర్ కు కాలం చెల్లింది..
X

దిశ, కామారెడ్డి రూరల్ : 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో 9 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా పాపాలు చేసి చేసి యమధర్మరాజు కూడా లెక్కలు రాయలేనన్ని మోయలేనన్ని పాపాలు సీఎం కేసీఆర్ చేసారని, పాపాల భైరవుడు కేసీఆర్ కు కాలం చెల్లిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర ముగించుకుని శుక్రవారం రాత్రి కామరెడ్డికి చేరుకున్న రేవంత్ రెడ్డి కామారెడ్డి మండలం సరంపల్లి చౌరస్తా నుంచి పాదయాత్రను ప్రారంభించారు. పీసీసీ చీఫ్ హోదాలో మొట్టమొదటి సారి కామారెడ్డికి వచ్చిన రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి షబ్బిర్ అలీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

సరంపల్లి, చిన్నమల్లారెడ్డి గ్రామాల మీదుగా పాదయాత్ర రాజంపేట మండల కేంద్రం వరకు 5.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామగ్రామాన రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఓ మహిళకు సంబందించిన ఇంటిని రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇల్లు శిథిలావస్థకు చేరడంతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని బీడీ కార్మికులతో మాట్లాడారు. వారితో కలిసి కాసేపు బీడీలు చుట్టారు. రాజంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 6న మేడారం స్మమక్క సారలక్క ఆశీర్వాదంతో పాదయాత్ర ప్రారంభించామన్నారు. మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో పాదయాత్ర ముగిసిందని తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారని రెండుసార్లు తెలంగాణ ప్రజలు ఆయన్ను సీఎంను చేస్తే గద్దెనెక్కిన కేసీఆర్ ప్రజల గుండెల పై తంతున్నారన్నారు. 1200 మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ సాధించుకున్నామన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమం 1969లో మలిదశ ఉద్యమం 2003 లో మొదలైందన్నారు.

తెలంగాణ సాధనలో కేసీఆర్ పార్టీ విఫలమైతే నాడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి వద్దకు వచ్చి కాళ్ళుమొక్కి, కడుపులో తల పెడితే ముఖ్య నాయకులతో జానారెడ్డి చర్చించి జేఏసీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 'జేఏసీ పెడితే జెండాలు కట్టినం. దొరగారు వస్తే దండాలు పెట్టినం.. రాష్ట్రం ఆలస్యం అయితే ప్రాణాలు ఇచ్చినం.. తెలంగాణ ఉద్యమంలో బందూకులై దూకినం.. ఫిరంగులై పేలినం.. అందుకే ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం' అన్నారు. తెలంగాణ పబ్లిక్ కమీషన్ నిరుద్యోగులను దరఖాస్తు చేసుకొమ్మంటే తమకు ఉద్యోగాలు వస్తాయని 30లక్షల మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్నారని తెలిపారు. 30లక్షల మంది నమోదు చేసుకున్నారని తెలంగాణ నిరుద్యోగంతో తల్లడిల్లుతుందని, ఉద్యోగం, ఉపాధి లేక వేలాది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిసినా కేసీఆర్ ఏ రోజు కూడా సమస్య పై సమీక్ష చేయలేదని, సమస్య పరిష్కారానికి కృషి చేయలేదన్నారు.

విద్యార్థి నిరుద్యోగ గర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ గర్జించిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్తే భయపడిన కేసీఆర్ అసెంబ్లీలో 80వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయన్నారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గుండాలకు ప్రశ్నాపత్రాలు ముందే ఎలా చేరుతున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లీకైన ప్రశ్నాపత్రాలు లక్షలాది రూపాయలకు అమ్ముకుని వారికి కావాల్సిన వారు పరీక్షలో పాసై ఉద్యోగాలు ఇప్పించుకుంటున్నారని ఆరోపించారు. గతవారం రోజులుగా టీఎస్పీఎస్సీలో ఏఈ, గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి అందులో పనిచేసే ఒక ఉద్యోగి ఫోన్లో ప్రశ్నాపత్రాలు ముందే వచ్చాయంటే ఇంతవరకు సీఎం సమీక్ష చేయలేదన్నారు. చిన్న చేపలను బలిచ్చి పెద్ద పులులను తప్పిస్తున్నారన్నారు.

చిన్న ఉద్యోగులను అరెస్ట్ చేసి జైలుకు పంపి టీఎస్పీఎస్సీ చైర్మన్, బోర్డు మెంబర్లు, ఐటీ మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఐటీలో ప్రశ్నాపత్రాలు ముందే లీకైతే ఐటి మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత కేసీఆర్ పై లేదా అని ప్రశ్నించారు. లంచం తీసుకున్నారని నెపం వేసి మంత్రి రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసినవ్ కదా.. నేడు నీ కొడుకు ప్రశ్నాపత్రాలు లీక్ కావడానికి కారణమైతే ఎందుకు బర్తరఫ్ చేయలేదు. టీఎస్పీఎస్సీని ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు. నీ బిడ్డ కవితకు ఈడీ నోటీసులు ఇస్తే నీ చెంచగాళ్ళు, బంట్రోతులు, మంత్రులందరిని ఢిల్లీకి పంపిస్తావా అని ప్రశ్నించారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు సమస్య వస్తే మంత్రులు, సీఎస్, అధికారులు, డీజీపీలతో సమీక్ష చేయడంలేదంటే నువ్వెంత దుర్మార్గుడివో, ఎంత కఠినాత్మునివో అర్థం అవుతుందన్నారు.

ప్రశ్నాపత్రాల లికేజీకి నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల సాక్షిగా సీఎం కేసీఆర్, ఐటి మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలు తగులబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రశ్నాపత్రాలు లికేజీకి కారణమైన తిమింగలాలను పట్టుకుని వారిని నడిరోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21 న తనతో సహా కాంగ్రెస్ నాయకులంతా గవర్నర్ వద్దకు వెళ్తామని, కేటీఆర్ ను ఎందుకు బర్తరఫ్ చేయలేదో అడుగుతామన్నారు. ఉద్యోగులు, విద్యాశాఖ, యూనివర్సిటీలు గవర్నర్ పర్యవేక్షిస్తారని తెలిపారు.

బీజేపీ, బీఆర్ఎస్ యుద్ధం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా.. సీఎస్, డీజీపీలను పిలిచి ఎందుకు సమీక్ష చేయలేదని గవర్నర్ ను అడుగుతామని, గవర్నర్ తో అమీతుమీ తేల్చుకోబోతున్నామన్నారు. దొంగలు దొరికినప్పుడు బీజేపీ వాళ్ళు ఇంట్లో పడుకుంటారని, అంతా అయిపోయాక బయటకు వచ్చి రోడ్లపై పోరాడుతున్నామని చెప్తారన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి బాద్యున్ని చేస్తూ మంత్రి కేటీఆర్ ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, తక్షణమే టీఎస్పీఎస్సీని రద్దు చేసి చైర్మన్, సభ్యులపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. సీబీఐపై నమ్మకం లేకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed