నిషేధిత మత్తు పదార్థాలతో తయారవుతున్న కల్లు..?

by velandi.Saikiran |   (  Updated:2026-05-02 19:45:38  IST  )

కామారెడ్డిలో కల్తీ కల్లు ఏరులైపారుతున్నది.కొందరు ముఠాగా ఏర్పడి కల్తీ కల్లును తయారుచేస్తూ పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు.

నిషేధిత మత్తు పదార్థాలతో తయారవుతున్న కల్లు..?
X

కల్తీ కల్లు జోరు

నిషేధిత మత్తు పదార్థాలతో తయారవుతున్న కల్లు..?

పెరిగిపోతున్న కల్తీ కల్లు బాధితులు

పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

దిశ, కామారెడ్డి : జిల్లాలో కల్తీ కల్లు ఏరులైపారుతున్నది. కొందరు ముఠాగా ఏర్పడి కల్తీ కల్లును తయారుచేస్తూ పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. నిషేధిత ఉత్ప్రేరకాల నుంచి తయారుచేసిన కల్లును విక్రయిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో చెట్టు కల్లుకు కాలం చెల్లిందా..? నిషేధిత మత్తు పదార్థాలతో కల్లు తయారు చేస్తున్నారా..? జిల్లా కేంద్రంలోనే ఎక్సైజ్ శాఖకు చెందిన ఎస్ఐ, సీఐ, సూపరింటెండెంట్ స్థాయి వరకు అధికారులు ఉన్నా చూసి చూడనట్టు వదిలేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. కామారెడ్డి పట్టణం కేంద్రంగా సాగుతున్న కల్తీ కల్లు దందాను కట్టడి చేయాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటు పడి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా ప్రజలు దీని బారిన పడి అల్లాడుతున్నారు.

పట్టణంలో విచ్చలవిడిగా కల్లు దుకాణాలు

జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో విచ్చలవిడిగా కల్లు దుకాణాలు నడుస్తున్నాయి. ప్రధాన రోడ్లను ఆనుకొని దుకాణాలను ఏర్పాటు చేయడంతో పాటు పబ్లిక్ స్థలాల్లో ఇష్టానుసారంగా కల్లు దుకాణాలను ఏర్పాటు చేయడంతో దారిన పోయే పాదచారులతో పాటు వాహనదారులు కల్లు ప్రియుల వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది కల్తీ కల్లు తాగి రోడ్లపై ఊగుతూ నడుస్తుండడంతో వాహనదారులతో పాటు మహిళలు అసౌకర్యానికి గురవుతున్నారు. కలెక్టరేట్ కు వెళ్లే ప్రధాన దారి అశోక్ నగర్ రోడ్డు పక్కనే కల్లు దుకాణం ఉండగా దీనికి అనుకొని ఆసుపత్రి సైతం ఉంది. అలాగే కలెక్టరేట్ కు వెళ్లే మరో దారి అయిన పాత బస్టాండ్ నుంచి వెళ్లే రోడ్డుకు ఆనుకొని పంచముఖి హనుమాన్ ఆలయం వెనకాల మరోకల్లు దుకాణం ఉంది. నిజాంసాగర్ చౌరస్తా సమీపంలో రోడ్డుపక్కనే కల్లు దుకాణం ఉంది. ఇలా ప్రధాన రోడ్ల పక్కనే కల్లు దుకాణాలు ఉండటంతో నిత్యం రాకపోకల తో పాటు బస్సుల కోసం వేచి చూసే మహిళలు పోకిరీల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా ఇవేవీ ఇబ్బందులు ఎక్సైజ్ శాఖకు కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

నిషేధిత మత్తు పదార్థాలతో కల్లు తయారీ

ఈత లేదా తాటి చెట్ల నుంచి తీసిన నాణ్యమైన కల్లును విక్రయించాల్సి ఉండగా అవేమీ పట్టించుకోకుండా నిషేధిత మత్తుపదార్థాలతో కృత్రిమ కల్లును తయారుచేసి సీసాల్లో నింపి యదేచ్చగా విక్రయిస్తున్నా ఎక్సైజ్ శాఖ అధికారులకు కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మత్తు పదార్థాలైన అల్పాజోలం, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్ లతోపాటు నిద్ర మాత్రలు, యూరియా, వైట్నర్, ఈస్ట్ లాంటి తదితర పేస్టులను కలిపి కృత్రిమ, కల్తీ కల్లును తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కల్లును సేవించిన ప్రజలు పలు రకాల అనారోగ్యాలకు గురవుతున్నప్పటికీ వీరి ఆరోగ్యం పై స్పందించే నాధుడే కరువయ్యాడు.

పెరుగుతున్న కల్తీ కల్లు బాధితులు

వివిధ రకాల నిషేధిత పదార్థాలు, మిశ్రమాలతో తయారుచేసిన కల్తీ, కృత్రిమ కల్లును తాగిన ప్రజలు పలు రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. అనారోగ్యాలకు గురవుతున్న వీరి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నప్పటికీ వీరి ఆరోగ్యాలపై ఏ అధికారికి పట్టింపు లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పొద్దంతా కాయ కష్టం చేసుకుని సాయంత్రం కాగానే కాస్త ఉపశమనం కోసం మద్యం కొనుక్కుని తాగే ఆర్థిక స్తోమత లేని పేద ప్రజలే కల్లును సేవిస్తుండడంతో వీరి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకున్న కల్లు వ్యాపారులు ఇష్టానుసారంగా నిషేధిత మత్తుపదార్థాలతో వారిని అనారోగ్యాలకు గురి చేస్తున్నారు.

అధికారులు మత్తు వీడరా...

జిల్లా కేంద్రంలో యదేచ్చగా నిషేధిత మత్తు పదార్థాలతో తయారుచేసిన కృత్రిమ కల్తీకల్లును విక్రయిస్తున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులకు కనిపించకపోవడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే ఎక్సైజ్ ఎస్సై, సీఐ, సూపరిండెంట్ స్థాయి అధికారులు ఉన్నారు. కల్తీ కల్లు దందా జోరుగా జరుగుతున్నా వీరి దృష్టికి రాకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానిక కల్లు వ్యాపారులతో కుమ్మక్కు కావడం వల్లనే ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి

Next Story