- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పులి సంచారం.. రైతుల్లో టెన్షన్
దిశ, భిక్కనూరు : వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేందుకు రైతులు భయంతో వణికి పోతున్నారు. ముఖ్యంగా

దిశ, భిక్కనూరు : వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేందుకు రైతులు భయంతో వణికి పోతున్నారు. ముఖ్యంగా ఒంటరిగా వెళ్లేందుకు సాహసం చేయలేకపోతున్నారు. గత నాలుగైదు రోజులుగా కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, తాజాగా రాజంపేట మండలాల్లో పులి సంచరిస్తుందన్న సమాచారం గ్రామస్తులను కంటికి కునుకు లేకుండా చేస్తోంది. పులి సంచరిస్తుందన్న విషయాన్ని అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించడం పలు సలహాలు, సూచనలు చేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో దోమకొండ మండలం అంబర్ పేట మైసమ్మ ఆలయం వద్ద పులి సంచరిస్తుందన్న వీడియోను గత రాత్రి నుంచి వాట్సాప్ గ్రూపుల్లో అప్ లోడ్ చేయడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. లేగదూడలు, మేకలు, ఆవులపై దాడి చేసి కొరికి చంపేసిన నేపథ్యంలో వ్యవసాయ బావుల వద్ద రైతులు ఒంటరిగా తిరగలేకపోతున్నారు. భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఆకుతోట రామచంద్రం వ్యవసాయ క్షేత్రంలో ఆవు పై దాడి చేసి చంపిన పులి ఎటువైపు తిరుగుతుందన్నది కరెక్ట్ సమాచారం దొరకక ఇక్కడ రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారు. నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెళ్లారు.
అత్యవసర ప్రజా హెచ్చరిక :
మాచారెడ్డి,రామారెడ్డి, దోమకొండ, బీబీపేట, పాల్వంచ మండలాల ప్రజలకు అత్యవసర ప్రజా హెచ్చరిక ను అటవీ శాఖ అధికారులు జారీ చేశారు. మాచారెడ్డి అటవీ క్షేత్ర పరిధిలోని అటవీ ప్రాంతం తో పాటు, పరిసర వ్యవసాయ క్షేత్రాలలో పెద్దపులి సంచారం నిర్ధారణ జరిగినందున ఆయా గ్రామాల పరిధిలోని ప్రజలు అత్యంత ప్రమాదంగా ఉండాలని అలెర్ట్ చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు వ్యవసాయ పొలాల్లో సంచరించవద్దని, రాత్రి వేళల్లో పశువులను వ్యవసాయ క్షేత్రాలలో వదలకూడదని, పగటిపూట కూడా వ్యవసాయ బావుల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని పేర్కొన్నారు. పులి సంచరించినట్లు ఆనవాళ్లు కనబడితే అటవీ శాఖ అధికారులకు గాని, స్థానిక పోలీసులకు గాని సమాచారం అందించాలని ప్రజా హెచ్చరికలో సూచనలు చేశారు.
హాని కలిగించొద్దు :
పులి సంచరిస్తుందన్న భయంతో, వ్యవసాయ భూముల్లో హాని కలిగించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేశారు. పులికి హాని కలిగించే విద్యుత్ కంచెలు, ఉచ్చులు, విష ప్రయోగం వంటివి చేస్తే అటవీ చట్టం కింద కఠినమైన శిక్షకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.






