- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క మొక్క దక్కలే..అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం!
లింగంపేట మండలంలో అటవీశాఖ నిర్లక్ష్యం వల్ల ‘వీఐపీ ప్లాంటేషన్’ పూర్తిగా ఎండిపోయింది.

ఒక్క మొక్క దక్కలే..
అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం!
సజీవ సాక్ష్యం ‘వీఐపీ ప్లాంటేషన్’
ఎమ్మెల్యే నాటిన మొక్కలన్నీ అగ్నికి ఆహుతి.. ఆపై ఎండకు ఎండిన వైనం
అటవీ భూముల కబ్జాపై పట్టించుకోని యంత్రాంగం.. గ్రామస్తుల ఆగ్రహం
లింగంపేట మండలంలో అటవీశాఖ నిర్లక్ష్యం వల్ల ‘వీఐపీ ప్లాంటేషన్’ పూర్తిగా ఎండిపోయింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నాటిన మొక్కలను సంరక్షించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. సరైన సమయంలో నీరు అందించకపోవడంతో సగం మొక్కలు వేసవి తాపానికి ఎండిపోయాయి. అడవిలో చెలరేగిన మంటల వల్ల మిగిలిన మొక్కలు కూడా కాలి బూడిదయ్యాయి. మెయింటెనెన్స్ నిధుల కొరత వల్లే మొక్కలు చనిపోయాయని అధికారులు సాకులు చెబుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అటవీ భూముల కబ్జా కోసం అక్రమార్కులు చెట్లను తగులబెడుతున్నా నిఘా కరువైంది. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
దిశ, లింగంపేట : పర్యావరణ పరిరక్షణ పేరిట ప్రభుత్వం ఖర్చు చేస్తున్న లక్షలాది రూపాయల నిధులు అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో బూడిదలో పోసిన పన్నీరులా మారుతున్నాయి. ఎల్లారెడ్డి అటవీ రేంజ్ పరిధిలోని శెట్పల్లి ఫారెస్ట్ బీట్‌లో గత ఏడాది జూలై 18న ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ‘వీఐపీ ప్లాంటేషన్’ నేడు శ్మశాన వాటికను తలపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేతుల మీదుగా నాటించిన ఈ మొక్కల సంరక్షణను అధికారులు గాలికొదిలేయడంతో ప్లాంటేషన్‌లో నేడు ఒక్క మొక్క కూడా బతికి లేదు.
అగ్నికి ఆహుతి.. అధికారుల అశ్రద్ధ..
ప్లాంటేషన్ ఏర్పాటు చేసిన కొత్తలో నీరు అందించకపోవడంతో సగం మొక్కలు ఎండిపోయాయి. మిగిలిన వాటిని కాపాడాల్సిన అధికారులు అడవిలో మంటలు చెలరేగకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఇటీవల అడవిలో వ్యాపించిన మంటలకు ఉన్న కొద్దిపాటి మొక్కలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. లక్షలు వెచ్చించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు నాటిన మొక్కలకే దిక్కులేకపోతే, ఇక సామాన్యులు నాటిన మొక్కల పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కబ్జాల పర్వం.. పల్చబడుతున్న అడవి
మరోవైపు అటవీ భూములను కబ్జా చేసేందుకు అక్రమార్కులు చెట్లను కాల్చివేస్తున్నా అటవీశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. చెట్లను కాల్చి సాగు భూములుగా మారుస్తున్నా నిఘా పెట్టడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్ల మండలంలో అడవులు పల్చబడిపోతున్నాయని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అటవీ భూములను కాపాడడంతోపాటు, ప్లాంటేషన్ల సంరక్షణపై దృష్టి పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నిధులు లేవు.. నీరు పోయలేం!
మొక్కలు ఎండిపోవడంపై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విక్కీ మార్టిన్ వింత వివరణ ఇచ్చారు. మొక్కల సంరక్షణకు సంబంధించి రావాల్సిన మెయింటెనెన్స్ నిధులు అందకపోవడం వల్లనే నీరు అందించలేకపోయామని, అందుకే అవి ఎండిపోయాయని తెలిపారు. నిధుల కొరత సాకుతో ప్రభుత్వ లక్ష్యాన్ని అధికారులు దెబ్బతీస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. వచ్చే వర్షాకాలంలో మళ్లీ మొక్కలు నాటుతామని అధికారులు చెబుతున్నా, పాత వాటినే కాపాడలేని వారు కొత్త వాటిని ఎలా సంరక్షిస్తారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






