- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెలవెలబోతున్న పల్లె ముంగిళ్లు..
దిశ, తాడ్వాయి : కాలం పరుగు తీస్తోంది. అభివృద్ధి బాటలో పల్లెలు పక్కా ఇళ్లుగా మారుతున్నాయి. కానీ ఆ

దిశ, తాడ్వాయి : కాలం పరుగు తీస్తోంది. అభివృద్ధి బాటలో పల్లెలు పక్కా ఇళ్లుగా మారుతున్నాయి. కానీ ఆ ఇళ్ల ముందు ఉండే రచ్చబండలు ఆ బండలపై కూర్చుని లోకాభిరామాయణం చెప్పే అనుభవాల నిధులు ఒక్కొక్కరుగా కనుమరుగవుతున్నారు. నాటి కాలానికి, నేటి కాలానికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చగలిగే ఆ తరం అంతర్థానమవుతుండటం పల్లె ఉనికికే ఒక తీరని లోటుగా మారుతోంది.
అనుభవం ఒక నిఘంటువు..
ఒకప్పుడు పల్లెలో ప్రతి వృద్ధుడూ ఒక నడిచే నిఘంటువు.ఆకాశంలోని మేఘాలను చూసి వర్షం ఎప్పుడు పడుతుందో చెప్పే నేర్పు,చేలో ఏ పురుగు ఆశిస్తే ఏ ఆకు పసరు వాడాలో తెలిసిన ఓర్పు వారి సొంతం. నేడు గూగుల్‌లో వెతికినా దొరకని ఎన్నో జీవన సూత్రాలను వారు మాటల మధ్యలో సామెతలుగా,కథలుగా చెప్పేవారు. ఆ అనుభవాల పాఠశాలలు నేడు మూతపడుతున్నాయి.
నాటి ఆత్మీయత.. నేటి యాంత్రికత
ఇంటి అరుగు మీద కూర్చుని వెళ్లే ప్రతి ఒక్కరినీ పలకరించడం ఒక ఆచారం. ఊరంతా ఒకే కుటుంబంలా ఉండేది. ఒకరి ఇంట్లో కష్టం వస్తే ఊరంతా కదిలి వచ్చేది.కానీ ఇప్పుడు అరుగులు లేవు, పలకరింపులు లేవు.పక్క ఇంట్లో ఏం జరుగుతుందో తెలియని నిశ్శబ్దం. స్మార్ట్‌ఫోన్ల మాయలో పడి మనుషులు పక్కన ఉన్న మనిషిని మరచిపోతున్నారు.గెలుపు గుర్రాలు పరుగెడుతున్న ఈ కాలంలో, ఓదార్పునిచ్చే పాత తరం మాటలు కరువయ్యాయి.
కనుమరుగవుతున్న ఆత్మీయ బంధాలు
పల్లెల్లో తాతా,అవ్వ,చిన్నాన్న అనే వరుసలు కేవలం పిలుపులు కావు, అవి ఆత్మీయ అనుబంధాలు. నేడు ఆ వరుసలు కనుమరుగై అంకుల్,ఆంటీ అనే యాంత్రిక పిలుపులు వచ్చి చేరాయి. పండుగ వస్తే ఊరంతా కలిసి చేసుకునే కోలాహలం పోయి,టీవీలకు,మొబైళ్లకు పరిమితమైన ఏకాంతం మిగిలింది.
మన మూలాలను మరవద్దు
అభివృద్ధి అంటే కేవలం సిమెంటు రోడ్లు,ఆకాశంలో ఎగిరే విమానాల ప్రయాణం,వైఫై కనెక్షన్లు కాదు.మన మూలాలను,మనకు సంస్కృతిని నేర్పిన పెద్దలను గౌరవించుకోవడం.మారుతున్న కాలంతో పాటు మనం మారాలి, కానీ మనలోని మనిషితనాన్ని, మంచితనాన్ని చంపుకోకూడదు.ఆ తరం పెద్దలు మనకు అందించిన మానవ విలువలను, అనుభవాలను తర్వాతి తరానికి వారసత్వంగా అందించడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి.






