దంచి కొట్టిన వడగళ్ల వాన..!

by Ratna Kumari |

ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన సుమారు అరగంట పాటు దంచి కొట్టింది.

దంచి కొట్టిన వడగళ్ల వాన..!
X

దిశ‌, భిక్క‌నూరు : ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన సుమారు అరగంట పాటు దంచి కొట్టింది. ఆదివారం సాయంత్రం భిక్కనూరు మండల కేంద్రంతో పాటు రామేశ్వర్ పల్లి, పెద్ద మల్లారెడ్డి, కంచర్ల, కాచాపూర్, లక్ష్మీ దేవునిపల్లి, బస్వాపూర్, గుర్జ కుంట, ర్యా గట్ల గ్రామాలలో పెద్ద ఎత్తున వడగళ్ల వాన కురవడంతో మామిడి నేల రాలడంతో పాటు, వరి పంట వందల ఎకరాల్లో పూర్తిగా దెబ్బతింది. ఈదురుగాలితో కురిసిన వర్షానికి పెద్ద మల్లారెడ్డి వెళ్లే దారిలో ఎం ఎస్ ఎన్ ఫార్మా కంపెనీ నుంచి కిలోమీటర్ల మేర పెద్ద మల్లారెడ్డి వరకు గలదారిలో పెద్ద ఎత్తున చెట్లు అడ్డంగా పడిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే గ్రామ సర్పంచ్ కోడూరి సాయగౌడ్ జెసిబి ని తెప్పించి అడ్డంగా పడిపోయిన చెట్లను పక్కకు తప్పించి రోడ్డును క్లియర్ చేయించడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.


ట్రాన్స్ కో అధికారులు స్పందించి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను కొన్నిచోట్ల పునరుద్ధరించగా, ఇంకొన్ని చోట్ల మరమ్మతులు చేపట్టారు. రోడ్లపై ఎండబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్ద కాగా, కొన్నిచోట్ల రోడ్లపై పోసిన వడ్లు వర్షపు దారలలో కొట్టుకుపోయాయి. అరగంట పాటు మాత్రమే ఈదురుగా లు ల తో కూడిన వడగళ్ల వాన పడడం ధాన్యం రైతులను ముప్పు తిప్పలు పెట్టించింది. సుమారు నెల రోజుల క్రితం వడగండ్ల వాన పెద్ద మొత్తంలో కురిసి మండలంలోని పెద్ద మల్లారెడ్డి కంచర్ల గ్రామాలలో పూర్తిగా సాగు చేసిన పంటలు దెబ్బతిని భారీ గా నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో కురుస్తున్న వర్షానికి పెద్ద మల్లారెడ్డి వెళ్లే దారిలో చెట్లు కొమ్మలు అడ్డంగా పడిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ సత్యం భిక్కనూరులో పని ముగించుకొని స్వగ్రామానికి వెళ్తుండగా ఆకస్మాత్తుగా వడగండ్ల వాన కురిసి ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తన ద్విచక్ర వాహనాన్ని పక్కకు ఆపి పడిపోయిన చెట్లను పక్కకు తొలగిస్తూ దారి తయారు చేసుకుంటూ.. ఎవరి సహాయం లేకుండా ఒకే ఒక్కడుగా నిలిచి, అదే దారిలో వెనకాలే ఉన్న వాహనదారుల నుంచి ప్రశంసలు పొందాడు.

Next Story