వారికి నిజామాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్.. బాధ్యతలు చేపట్టిన తొలిరోజే..

by Naveena |   (  Updated:2025-03-11 07:44:25  IST  )

జిల్లాలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తామని, శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సీపీ పోతరాజు సాయి చైతన్య అన్నారు.

వారికి నిజామాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్.. బాధ్యతలు చేపట్టిన తొలిరోజే..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నిజామాబాద్ సీపీ పోతరాజు సాయి చైతన్య అన్నారు. సోమవారం సీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమాండ్ కంట్రోల్ కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా గురించి తనకు కొద్దిగా అవగాహన ఉందన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు సీరియస్ గా వర్క్ చేస్తామన్నారు. గతంలో పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలకే పరిమితమైన సైబర్ మోసాలు.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లోకి కూడా విస్తరించాయని సీపీ సాయి చైతన్య అన్నారు. మహిళలను వేధించినా, వారికి ముప్పు వాటిల్లే రకంగా వ్యవహరించిన వారి పట్ల తాము కఠినంగా వ్యవహరిస్తామని సీపీ హెచ్చరించారు.

డయల్ 100 కు కాల్ చేస్తే సత్వరమే స్పందించి పోలీస్ సేవలు అందిస్తామన్నారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కూడా కృషి చేస్తానని సీపీ అన్నారు. గంజాయి, మత్తు మాదకద్రవ్యాల వంటివి యువతను నిర్వీర్యం చేస్తున్నాయని, వీటిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణలో పోలీసు శాఖ ప్రజల సహకారం తీసుకుంటుందన్నారు. ప్రజలతో మమేకమై, వారితో సమన్వయం చేసుకుంటూ నేరాల నియంత్రణ కోసం పోలీసు శాఖ కృషి చేస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. యువత డ్రగ్స్ కు, ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు.

మహారాష్ట్ర నుంచి నిషేధిత మత్తు మాదకద్రవ్యాలు, గుట్కా వంటి పదార్థాలు జిల్లాకు సరఫరా అవుతున్నాయని మీడియా ప్రతినిధులు దృష్టికి తీసుకురాగా, వాటిని కంట్రోల్ చేయడానికి తన వద్ద నిర్దిష్టమైన ప్రణాళికలు ఉన్నాయన్నారు. తాను ఇంతకుముందు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో లో చేసిన అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించి వాటి నియంత్రణలో ముందుకెళ్తానన్నారు. ఇందుకోసం సరిహద్దు జిల్లాల్లో ఉన్న ఎస్పీలతో సమన్వయం చేసుకుంటానని సీపీ వెల్లడించారు. సరిహద్దు జిల్లాల్లో ఉన్న ఎస్పీలు తన బ్యాచ్ కు చెందిన వారిని, వారితో తనకున్న సాన్నిహిత్యాన్ని మాదకద్రవ్యాల నియంత్రణకు ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. అవసరమైన తరుణంలో వారితో సమన్వయం చేస్తూ ముందుకెళతామని పేర్కొన్నారు.

శాఖల మధ్య సమన్వయం కోసం పోలీస్ శాఖ తరపున ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వాడకమే కాకుండా, అత్యధికంగా ఆల్ఫ్రాజోలం అమ్మకాలు రవాణా కూడా జరుగుతోందని తనకు సమాచారం ఉందన్నారు. వీటిపై తాను చాలా సీరియస్ గా స్పందిస్తానని, ఎట్టి పరిస్థితుల్లోను వీటిని ఉపేక్షించేది లేదన్నారు. ఆయా దందాలపై అక్రమంగా సంపాదించిన ఇల్లీగల్ ఆస్తులను జప్తు చేస్తామని, పద్ధతి మార్చుకోవాలని సూటిగా హెచ్చరించారు.

సైబర్ క్రైమ్ ను నియంత్రిచడమే కాదు.. పూర్తిగా నివారించాల్సి ఉందని, దానికోసం పోలీస్ యంత్రాంగం పని చేస్తుందన్నారు. జిల్లాలో భూ కబ్జాల వ్యవహారం కూడా ఎక్కువగా ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందని, ఈ సమస్య కూడా శాంతి భద్రతల సమస్యకు దారితీస్తుందని అన్నారు. భూ కబ్జాల వ్యవహారంపై పోలీసు శాఖ సీరియస్ గా ఆలోచిస్తుందని, వాటిపై ప్రత్యేక దృష్టిని సారిస్తామన్నారు. నగరంలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్య ఉందో ఆయా ప్రాంతాలను గుర్తించి త్వరలోనే ట్రాఫిక్ సమస్య లేకుండా చూస్తానని అన్నారు. వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్ ను వచ్చే ప్రజలతో పోలీసు అధికారులు, సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, ప్రజల సమస్యలను శాంతంగా విని పరిష్కరించాలని పోలీసులకు సూచించారు. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ బస్వా రెడ్డి పాల్గొన్నారు.

Next Story