- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా బుకింగ్ యాప్ మాయాజాలం.. కనిపించని జిల్లా ఆప్షన్?
రైతుల నిరీక్షణకు వర్షం కురవడంతో పొలం పనులు ఊపందుకుంటుంటే.. మరోవైపు యూరియా కొనుగోలు కోసం రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.

దిశ, తాడ్వాయి: రైతుల నిరీక్షణకు వర్షం కురవడంతో పొలం పనులు ఊపందుకుంటుంటే.. మరోవైపు యూరియా కొనుగోలు కోసం రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ప్రభుత్వం సాంకేతికతను జోడించి రైతులకు సులువుగా ఎరువులు అందించేందుకు రూపొందించిన అధికారిక యాప్, ప్రస్తుతం వారి పాలిట శాపంగా మారింది. ఉమ్మడి తాడ్వాయి మండలంలో యూరియా బుక్ చేసుకుందామంటే యాప్ ఓపెన్ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెల్లవారకముందే తంటాలు..
ఇటీవల కురిసిన వర్షాలతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతాంగం, యూరియా కోసం తెల్లవారుజామున 5 గంటల నుంచే నిద్రలేచి మొబైల్ ఫోన్లతో కుస్తీ పడుతున్నారు. ఎప్పుడు యాప్ ఓపెన్ అవుతుందో, ఎప్పుడు యూరియా బుక్ అవుతుందో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. గంటల తరబడి ప్రయత్నించినా సర్వర్ బిజీ అంటూ దర్శనమిస్తుండటంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తీరొక్క సమస్యలు.. సాంకేతిక లోపాలు..
ఈ యాప్‌లో సమస్యలు ఒకటా రెండా.. అన్నీ లోపాలే అన్నట్లుగా తయారైంది. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఇవే.. ఓపెన్ కానీ యాప్‌తో గంటల తరబడి ప్రయత్నించినా సర్వర్ డౌన్ అంటూ యాప్ ఓపెన్ కావడం లేదు. ఎవరైనా అదృష్టం బాగుండి యాప్‌లోకి లాగిన్ అయినా.. అందులో జిల్లా ఎంచుకునే ఆప్షన్ కనిపించడం లేదు. దీంతో బుకింగ్ ముందుకు సాగడం లేదు. మరికొందరికి యాప్ ఓపెన్ చేయగానే సెక్యూరిటీ అలర్ట్ అంటూ ఎర్రర్ మెసేజ్‌లు వస్తుండటంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.
సజావుగా సాగేది ఎప్పుడు?
సాంకేతికత అనేది రైతుల శ్రమను తగ్గించడానికి ఉపయోగపడాలి కానీ, వారిని మరింత మానసిక క్షోభకు గురి చేసేలా ఉండకూడదని మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఈ యాప్ లోపాలను తక్షణమే సరిచేసి, రైతులు సజావుగా, సులభంగా యూరియా బుక్ చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఉమ్మడి తాడ్వాయి మండల రైతాంగం డిమాండ్ చేస్తోంది.






