ప‌చ్చ‌ని అడ‌వి త‌ల్లి అగ్నికి ఆహుతి..!

by Nallavelli.Anjaneyulu |

నిజామాబాద్ జిల్లా అడవుల్లో వేసవి ప్రారంభం కావడంతోనే కార్చిచ్చు మంటలు చెలరేగుతున్నాయి. దీంతో పచ్చని అడవులు అగ్నికి ఆహుతవుతూ వృక్ష సంపద కాలి బూడిదవుతోంది.

ప‌చ్చ‌ని అడ‌వి త‌ల్లి అగ్నికి ఆహుతి..!
X

దిశ, ఆలూర్ : నిజామాబాద్ జిల్లా అడవుల్లో వేసవి ప్రారంభం కావడంతోనే కార్చిచ్చు మంటలు చెలరేగుతున్నాయి. దీంతో పచ్చని అడవులు అగ్నికి ఆహుతవుతూ వృక్ష సంపద కాలి బూడిదవుతోంది. వన్యప్రాణులకు, జీవ వైవిధ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతోంది. జిల్లాలోని అటవీ ప్రాంతాలను అటవీ శాఖ ఏడుకు ఫారెస్ట్ రేంజ్‌లుగా విభజించింది. నిజామాబాద్ నార్త్, సౌత్, ఇందల్వాయి, వర్ని, సిరికొండ, కమ్మర్‌పల్లి, ఆర్మూర్ రేంజ్‌ల పరిధిలో సుమారు 86 వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అయితే గత వారం రోజులుగా పలు ప్రాంతాల్లో కార్చిచ్చు మంటలు చెలరేగి అడవులను దహనం చేస్తున్నాయి.

వేసవి ప్రారంభం కావడంతో చెట్ల ఆకులు ఎండిపడి నేల పై పడిపోవడం వల్ల చిన్న అగ్గి పడినా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. అడవులకు వెళ్లే బాటసారులు, పశువుల కాపరులు చుట్టలు, బీడీలు కాల్చి పడేయడం, సమీప గ్రామాల రైతులు పొలాల్లోని చెత్తను కాల్చడం వంటి కారణాలతో అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. అంతేకాక తునికాకు సేకరణ కోసం కొత్త చిగుర్లు రావాలనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మంటలు పెడుతున్నట్టు తెలుస్తోంది. దట్టమైన అడవులు ఉన్న మండలాల్లో విలువైన పచ్చని మొక్కలు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చెట్లు మంటలకు ఆహుతవుతున్నాయి. గాలుల ప్రభావంతో మంటలు వేగంగా వ్యాపించి సమీప గ్రామాల వైపు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో నివసించే జంతువులు తినే పండ్ల చెట్లు కూడా కాలిపోవడంతో వన్యప్రాణుల జీవనం సంక్షోభంలో పడుతోంది. అడవుల్లో చెలరేగే మంటల వల్ల పొగ భారీగా వ్యాపించి ప్రధాన రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో అడవులు కాలుతున్న దృశ్యాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

మానవ మనుగడకే ముప్పు

అడవుల్లో మంటలు చెలరేగడం వల్ల పచ్చని అడవులు, ఔషధ మొక్కలు, క్రిమికీటకాలు, చిన్న మొక్కలు నాశనం అవుతున్నాయి. జీవ వైవిధ్యం దెబ్బతిని భవిష్యత్తులో మానవ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మంటలు గ్రామాల వరకు వ్యాపించి ఇళ్లు, ఆస్తులు కూడా ప్రమాదంలో పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పొగతో ఉక్కిరి బిక్కిరి అడవి అంటుకుని చెలరేగే మంటలకు దారిగుంట వెళ్ళే బాటసారులు మంట వేడికి, కమ్ముకుంటున్నయి పొగతో ఉక్కిరి బిక్కిరి అయ్యి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తునికాకు కోసం అడవులు కాల్చివేత

వేసవి సీజన్ ప్రారంభంలో తునికాకు సేకరణ ప్రారంభమవుతుంది. కాంట్రాక్టర్లు తమకు కేటాయించిన యూనిట్లలో ఆకు చిగుర్లు బాగా రావడానికి కూలీలతో ప్రూనింగ్ (కొమ్మలు కొట్టడం) చేయించాలి. అయితే ఖర్చు తగ్గించుకునే ఉద్దేశంతో కొందరు కాంట్రాక్టర్లు ప్రూనింగ్ చేయించకుండా అడవులకు నిప్పంటించి కాల్చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అటవీ శాఖ చర్యలు

ప్రతి సంవత్సరం వేసవి కాలంలో అటవీ శాఖ అధికారులు కార్చిచ్చు మంటలను అదుపు చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక సిబ్బంది బృందాలు, ఆధునిక పరికరాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అడవుల్లో మంటలు పూర్తిగా అదుపులోకి రావడం లేదు. మరింత సిబ్బంది, అధునాతన పరికరాలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని స్థానికులు, వన్యప్రేమికులు సూచిస్తున్నారు.

గట్టి నిఘా పెట్టాం - అటవీ శాఖ అధికారి సుశీల్ కుమార్

అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టామని అటవీ శాఖ అధికారి సుశీల్ కుమార్ తెలిపారు. అడవులకు నిప్పు పెట్టిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. అడవుల రక్షణ అందరి బాధ్యత అని, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మంటలు పెడుతున్నట్టు సమాచారం ఉంటే వెంటనే అటవీ శాఖకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

Next Story