తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే .. కారణం ఇదే!

by Naveena |

నగరంలోని అన్ని డివిజన్లలో డ్రైనేజీ సమస్యలపై తక్షణమే స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, రానున్న వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురవుకుండా చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు.

తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే .. కారణం ఇదే!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ ఏప్రిల్ 11: నగరంలోని అన్ని డివిజన్లలో డ్రైనేజీ సమస్యలపై తక్షణమే స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, రానున్న వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురవుకుండా చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే నాగారం తొమ్మిదో డివిజన్ లో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించారు. డ్రైనేజీ పరిస్థితిని క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తోపాటు సంబంధింత అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు.

పూడికలు తీయకపోవడంతో నగరంలో డ్రైనేజీ సమస్య జఠిలంగా మారిందని ఎమ్మెల్యే అన్నారు. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోవడం, నీరు నిల్వ ఉండటం చూసి మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ,డివిజన్లోని అన్ని డ్రైనేజీ కాలువల్లో పూడికలు తీయాలని అధికారులకు సూచించారు. నిత్యం డ్రైనేజీ పూడికలు తీసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.డ్రైనేజీ , కొత్త కాలువలు, అవసరం ఉన్న చోట సీసీ రోడ్లు, బీటీ రోడ్లను నిర్మించాలన్నారు. నగరంలోని రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే కమిషనర్ కు సూచించారు. వేసవి కాలంలో ప్రజలకు మంచినీటి కొరత లేకుండా చూసుకోవాలన్నారు. అవసరం ఉన్న చోట వాటర్ ట్యాంకులు, బోర్లు వేయాలని సూచించారు.

ధన్ పాల్ లక్ష్మిభాయ్ అండ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డివిజన్ ప్రజలకు మంచినీటి సౌకర్యం కోసం తన సొంత నిధులతో తవ్వించిన మంచి నీటి బోరులను మున్సిపల్ అధికారులకు స్వాధీనం చేస్తూ వాటికి మీటర్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూచించారు. డివిజన్ విస్తరిస్తున్న కారణంగా ఎలక్ట్రికల్ స్తంభాలు, వీధి దీపాల కొరత ఏర్పడుతుందన్నారు. దీనికి పరిష్కారంగా స్తంభాలు, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. డివిజన్ వాసులకు ఆహ్లాదకరమైన పార్క్, ఓపెన్ జిమ్ తో కూడిన నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇందూర్ అర్బన్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలో సమస్యలను పరిశీలించడం జరుగుతుందని, త్వరలో సమస్యలను పరిష్కరించేలా అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ధన్ పాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ మురళి మోహన్ రెడ్డి, అడిషనల్ మున్సిపల్ కమీషనర్ జయకుమార్, ఏఈ భూమేష్, బీజేపీ మండల అధ్యక్షులు నాగరాజు, స్థానిక మాజీ కార్పొరేషన్ సాయి వర్ధన్, కిరణ్, సుందర్ రాథోడ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Next Story