కేసీఆర్ వస్తుంటే ప్రతిపక్షాల్లో వణుకు పుట్టింది : కేటీఆర్

by Disha Web Desk 13 |
కేసీఆర్ వస్తుంటే ప్రతిపక్షాల్లో వణుకు పుట్టింది : కేటీఆర్
X

దిశ, కామారెడ్డి: కేసీఆర్‌కు కామారెడ్డిలో దమ్ము చూపి.. దుమ్మురేపే రీతిలో భారీ మెజారిటీ ఇవ్వాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు. కామారెడ్డి రూరల్, పట్టణ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కామారెడ్డి వస్తుంటే ప్రతిపక్షాలకు వణుకు పుట్టిందన్నారు. అందుకే షబ్బీర్ అలీ పారిపోయాడని, రేవంత్ రెడ్డి కామారెడ్డికి వస్తాడట అని విమర్శించారు. కామారెడ్డి ఉద్యమ వేడి ఎలా ఉంటుందో రేవంత్ రెడ్డికి చూపించాలన్నారు. తెలంగాణ ఉద్యమం ద్రోహి రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేస్తాడట అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఒక్కసారి కామారెడ్డికి వస్తే ఇక్కడి రూపురేఖలు మారిపోతాయన్నారు. చుట్టుపక్కల ఇంచు భూమి ఉన్నా అమ్ముకోవద్దని రైతులకు సూచించానని, కేసీఆర్ వస్తే భూముల విలువ పెరిగిపోతుందని చెప్పానన్నారు. కామారెడ్డితో పాటు చుట్టుపక్కల 50-60 కిలోమీటర్ల మేర భూముల విలువలు పెరిగి రైతులకు లాభం చేకూరుతుందన్నారు.

కామారెడ్డికి కేసీఆర్ వస్తే పక్కన ఉన్న సిరిసిల్ల, ఎల్లారెడ్డి, మెదక్ తో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలకు లాభం అవుతుందని తెలిపారు. కొనాపూర్‌లో అప్పర్ మానేరు డ్యాంలో కేసీఆర్ పూర్వీకుల భూములు మునిగిపోతే భూములను అమ్ముకుని తట్టబుట్ట సర్దుకుని వెళ్లిపోయిన కేసీఆర్ కు ఇక్కడికి వచ్చి భూములు అమ్ముకోవాల్సిన ఖర్మ లేదన్నారు. కేసీఆర్ తో ఏ పని ఉన్న చేయించే బాధ్యత తనతో పాటు గంప గోవర్ధన్ బాధ్యత ఉంటుందన్నారు. 22 వ ప్యాకేజి పనులు పూర్తి చేసి గోదావరి జలాలతో కామారెడ్డి ప్రజల కాళ్ళు కడుగుతామని పేర్కొన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ కు ఇచ్చే తీర్పు దేశ చరిత్రలో నిలిచిపోవాలన్నారు. వచ్చే నెల 9 వ తేదీన కామారెడ్డిలో నామినేషన్ వేయడానికి కేసీఆర్ వస్తున్నారని, అదే రోజు ఏర్పాటు చేసే బహిరంగ సభకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు వచ్చి కేసీఆర్ ను ఆశీర్వదించాలని కోరారు.

క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు..

పార్టీలో ఉన్నప్పుడు క్రమశిక్షణ పాటించాలని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు. రెండు రోజుల క్రితం మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త సీనియర్ నాయకుడు తిర్మల్ రెడ్డిపై దాడి చేస్తే తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. ఇకపై ఇలాంటి తప్పులు ఎవరు చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు. ఇకపై క్రమశిక్షణపై తానే మానిటరింగ్ చేస్తానన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి తోపాటు పలువురు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed