- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భాష రాదు.. బాధ చెప్పుకోలేరు
వందల మైళ్ల దూరం నుంచి, కన్నవారిని వదిలి, కేవలం పొట్ట చేతపట్టుకొని వలస వచ్చిన ఆ కూలీలకు తెలుగు భాష రాదు.

దిశ, తాడ్వాయి : వందల మైళ్ల దూరం నుంచి, కన్నవారిని వదిలి, కేవలం పొట్ట చేతపట్టుకొని వలస వచ్చిన ఆ కూలీలకు తెలుగు భాష రాదు. తాము రోజంతా మోసే బస్తాల బరువు తెలుసు కానీ, ఆ బరువు వెనుక తమను ఎంతగా మోసం చేస్తున్నారో గ్రహించే తెలివి లేదు. ఈ నిస్సహాయతనే పెట్టుబడిగా మార్చుకున్న కొందరు అక్రమార్కులు, ఆ శ్రమజీవుల కన్నీటి కష్టాన్ని కమిషన్ల రూపంలో జుర్రుకుంటున్నారు. తాడ్వాయి మక్కల కొనుగోలు కేంద్రంలో వెలుగుచూసిన ఈ ఒక్క ఘటనతో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు మక్కల, వడ్ల కేంద్రాలు ఏర్పాటు చేసిన వాటి పై కూడా రైతులకు అనుమానాలు రేకెత్తిస్తున్న వ్యవహారం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఒక్కో కేంద్రం.. ఒక్కో మాయాజాలం
హమాలీలు చేసే పని ఏ సెంటర్‌లో అయినా ఒకటే.. ఎండలో బస్తాలు మోయడం, తూకం వేయడం. కానీ జిల్లావ్యాప్తంగా ఒక్కో కొనుగోలు కేంద్రంలో ఒక్కో రకమైన ధరలు వసూలు చేస్తుండటం గమనార్హం. కొన్ని చోట్ల క్వింటాల్‌కు ఒక రేటు నిర్ణయిస్తే, మరికొన్ని చోట్ల బస్తాకు ఒక రేటు నిర్ణయించి అటు రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. సెంటర్లో ఆరబోసిన ధాన్యాన్ని లోడ్ చేయాలని ఆత్రుతతో గత్యంతరం లేక హమాలీ డబ్బులు సెంటర్ నిర్వాహకులు, కొందరు నాయకులు, కలిసి నిర్ణయించిన రేటుకు రైతులు డబ్బులు ఇస్తున్నారు. అసలు ఈ ధరల వ్యత్యాసం వెనుక ఆంతర్యం ఏమిటి ? రైతుల నుంచి వసూలు చేస్తున్న ఈ సొమ్ములో అసలు కూలీలకు దక్కేది ఎంత ? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
చెమట చుక్కలో తలా పిడికెడు వాటా..
తమకు రావలసిన కూలీలో సెంటర్ ఇంచార్జీలు, కొంతమంది చోటా మోటా నాయకులు కలిసి కమిషన్ల పేరుతో తలా పిడికెడు చొప్పున కోతలు విధిస్తున్నారు. అన్యాయం జరుగుతుందని తెలిసినా.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, భాష రాక, ఇచ్చిన కాడికే తీసుకొని వారు కన్నీటిని దిగమింగుకుంటు సొంతగూటికి పైన నవ్వుతున్నారు. ఈ దోపిడీ పర్వం పై సాక్షాత్తు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు వెంకట్రాంరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి గళమెత్తడం విశేషం. జిల్లాలోని మిగిలిన కేంద్రాల్లో అంతా సజావుగా సాగుతోందని అధికారులు భావిస్తున్నప్పటికీ, అన్ని సెంటర్లు లోతుగా పరిశీలిస్తే హమాలీల పొట్ట కొడుతున్న అక్రమాలు మరెన్నో బయటపడే అవకాశం ఉంది.
బయటపడ్డది ఒక్కటే.. అంతటా ఇదే తంతేనా ?
తాడ్వాయిలో బయటపడింది కేవలం ఒక కేంద్రం అక్రమాలే కావచ్చు, కానీ జిల్లాలోని ప్రతి గింజ వెనుక ఒక హమాలీ కష్టం, ఒక కన్నీటి బొట్టు ఉంది. కేవలం తూకాలను చూసి వెళ్లే అధికారులు, ఆ కూలీల చేతికి ఎంత అందుతుందో ఒక్కసారి ఆరా తీయాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు మన అతిథులు.. వారి శ్రమను దోచుకోవడం మానవత్వానికే మచ్చ. ఇకనైనా జిల్లా యంత్రాంగం స్పందించి, అన్ని కేంద్రాల్లో ఒకే రకమైన హమాలీ చార్జీలు ఉండేలా చూడాలని, దళారుల ప్రమేయం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు, రైతులు కోరుతున్నారు.






