మళ్లీ ముదిరిన ఈత చెట్ల వివాదం

by Elthuri vijay kumar |

తాళ్లరాంపూర్ గ్రామంలో గ్రామంలో వీడీసీ, గౌడ కులస్తుల మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న వివాదం

మళ్లీ ముదిరిన ఈత చెట్ల వివాదం
X

మళ్లీ ముదిరిన ఈత చెట్ల వివాదం

- తాళ్లరాంపూర్ గ్రామంలో 163 సెక్షన్ అమలు

- గ్రామంలో వీడీసీ, గౌడ కులస్తుల మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న వివాదం

దిశ, ఏర్గట్ల : మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో వీడీసీ, గౌడ కులస్తుల మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈత చెట్ల వివాదం మరోసారి ముదిరింది. కొద్దిరోజుల క్రితం గ్రామంలో చట్టం–శాంతిభద్రతలపై అధికారులు ప్రత్యేకంగా అవగాహన కల్పించగా, అనంతరం వి.డి.సి. రద్దు చేసినట్లు ప్రకటించారు. దీంతో వివాదం సద్దుమణిగినట్లు కనిపించినా, సోమవారం ఒక పట్టాదారు చెట్టును ధ్వంసం చేయడంతో సమస్య కొత్త మలుపు తిరిగి గ్రామంలో ఉద్రిక్తత చెలరేగింది. గ్రామంలో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని ఎస్సై పడాల రాజేశ్వర్ నివేదిక ఆధారంగా తహసిల్దార్ జె. మల్లయ్య ఇదే నెల 15 నుంచి 21 వరకు గ్రామంలో సెక్షన్ 163 అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షల నేపథ్యంలో మంగళవారం వందల సంఖ్యలో పోలీసులు, రాయల్ కంట్రోల్ ఫోర్స్, బెటాలియన్ దళాలు గ్రామంలో గస్తీ ప్రారంభించాయి. కావాతులు నిర్వహిస్తూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితి విషమిస్తే టియర్ గ్యాస్ వినియోగానికి వజ్ర వాహనాన్ని కూడా సిద్ధంగా ఉంచారు.

ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్, మోర్తాడ్ ఎస్సై రాము, కమ్మర్పల్లి ఎస్సై అనిల్ రెడ్డి, భీంగల్ సీఐ సత్యనారాయణ పర్యవేక్షణలో పోలీసులు మోహరించగా, మొత్తం పరిస్థితిని ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సెక్షన్ 163 అమల్లోకి రావడంతో గ్రామం నిర్మానుష్యంగా మారింది. రాత్రింబగళ్లు పోలీసుల నిఘా కొనసాగుతుండటంతో గ్రామస్తులు ఇళ్లకే పరిమితమయ్యారు. ముగ్గురికిపైగా గుమికూడడం, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం, ఆయుధాలతో తిరగడం నిషేధమని అధికారులు స్పష్టం చేశారు. ఆంక్షలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు శాంతి భద్రతలు పాటించి సహకరించాలని కోరారు.

Next Story