- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుర పోరు.. సందడి షురూ
కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది.

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది. మున్సిపాలిటీలోని ఏ గల్లీకి చూసినా ఆశావహ లీడర్ల లొల్లి కనిపిస్తుంది. ఆలు లేదు... చూలు లేదు.. అల్లుడి పేరు సోమలింగం... అన్నట్లు తయారైంది గల్లీల్లో ఆశావహుల తీరు. ఇంకా ముసాయిదా ఓటరు జాబితా మాత్రమే రావడంతో అందులో చాలావరకు తప్పులతడకగా ఉందని ఇప్పటికే ఫిర్యాదు చేసిన లీడర్లు, ఎలక్షన్ కమిషన్ నుంచి ఎన్నికల పై ఇంకా ఎలాంటి స్పందన రాకముందే గల్లీలో హడావిడి మాత్రం మొదలైంది. రాజకీయం రంజుగా మారింది.. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఆశావహులలు వార్డులు, గల్లీల్లో సందడి చేస్తున్నారు. టికెట్ తనకే వస్తుందని, తనకు మద్దతివ్వాలని ఓటర్లను కలిసి కోరుతున్నారు.
మున్సిపల్ పాలక మండలి గడువు ముగిసి ఏడాది కావస్తోంది. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అంతా అనుకున్నా.. ప్రభుత్వం అనూహ్యంగా మునిసిపల్ ఎన్నికలపై దృష్టి సారించడం, వార్డుల ఓటర్లు, పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఆశావహులంతా ఓటర్ల జాబితా చేత పట్టుకుని ఓటర్లను ప్రసన్నం. చేసుకునే పనిలో పడ్డారు. ఈ నెల 10తుది ఓటరు జాబితాను ప్రచురించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా, మంగళవారం కలెక్టర్ రాజకీయ పార్జీల నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఆశావహులు మాత్రం తప్పొప్పులను సవరించాలని అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. ఫిర్యాదులు చేసేవారంతా పోటీ చేద్దామనుకున్న ఆయా పార్టీలకు చెందిన నాయకులే కావడం విశేషం.
తుది జాబితా రాగానే రిజర్వేషన్ ప్రక్రియ..
అధికారులు ఈనెల 10న ఓటరు తుది జాబితా విడుదల చేయనున్నారు. దీంతో సంక్రాంతి లోపు, లేదంటే సంక్రాంతి తరువాత రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి నెలఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసే అవ కాశాలున్నాయని తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు ఉంటాయని ప్రచారం సాగుతోంది.
రిజర్వేషన్ల బెంగ...
ఇప్పటికే గల్లీలో ప్రచారం చేసుకుంటున్న కొంతమంది ఆశావాహులు రిజర్వేషన్లు ఎలా వస్తాయని భయపడుతున్నారు. అంతా రెడీ చేసుకున్నాక రిజర్వేషన్ తారుమారైతే తమ పరిస్థితి ఏమిటోనన్న ఆలోచనలో పడ్డారు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలు ఉండగా దాదాపు అన్ని మున్సిపాలిటీలలో ఇదే పరిస్థితి నెలకొంది.
గెలుపు గుర్రాలకే పార్టీల టిక్కెట్లు..
టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా దాదాపు అన్ని పార్టీల్లోనూ ఉండటంతో వారిపై సర్వే చేసి ఆ ప్రకారమే టికెట్లు ఇస్తామని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా ప్రకటిస్తున్నాయి.
ఓటర్ల మద్దతు కోసం ప్రయత్నాలు..
అన్ని మున్సిపాలిటీల్లోనూ పోటీ తీవ్రంగా ఉండడంతో బీఆర్ఎస్, బీజేపీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే అన్ని వార్డులలో అభ్యర్థులను రంగంలోకి దించేందుకు పార్టీలు గెలిచే అభ్యర్థుల నుఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఎంఐఎం కూడా కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోటీచేయనుంది. గత ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పోటీ చేసింది. ఆశావహులు మాత్రం రిజర్వేషన్ల సంగతి ఎలా ఉన్నా ముందు ఓటర్ల మద్దతు కూడగట్టాలని గల్లీలో తిరుగుతూ, హామీలు ఇస్తున్నారు.
ఇప్పటికే ప్రారంభమైన దావతులు..
ఇప్పటికే కొన్ని వార్డుల్లో ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు దావతులు ఇస్తున్నారు. డిసెంబరు 31న కామారెడ్డి పట్టణంలోని కొన్ని వార్డుల్లో మద్యం కూడా పంపిణీ చేశారు. సంక్రాంతి నాటికి రాజకీయం మరింత రంజుగా మారిన ఉండటంతో పండగ కు ఆశావహుల చేతి చమురు బాగానే వదలనుంది. పండుగకు కూడా ఓ విడత మద్యం పంపిణీ చేసినా ఆశ్చర్యం లేదని పిస్తోంది.






