తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరుగున పడిన విద్యార్థి నేత శ్రీకుమార్

by Kodari Anjali |

ఉద్యోగ అవకాశాలను పక్కనబెట్టి ఉద్యమ బాట పట్టిన విద్యార్థి నేత నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన చింత శ్రీకుమార్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరుగున పడిన విద్యార్థి నేత శ్రీకుమార్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చదువు, ఉద్యోగ అవకాశాలను పక్కనబెట్టి ఉద్యమ బాట పట్టిన విద్యార్థి నేత నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన చింత శ్రీకుమార్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినప్పటికీ గుర్తింపుకు నోచుకోని ఆయన తీవ్ర గుండెపోటుతో ఐసీయూలో చికిత్స పొందుతుండగా, వైద్య ఖర్చులు భరించే స్థోమత లేక కుటుంబ సభ్యులు ప్రభుత్వ సాయాన్ని వేడుకుంటున్నారు. సార్ మా నాన్న కూడా క్యాన్సర్‌తో చనిపోయాడు 2023 ఏప్రిల్‌లో క్యాన్సర్ తో శ్రీకుమార్ తండ్రి చనిపోయారు. అప్పటి నుండి వీరి కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి.

నాడు విద్యార్థి ఉద్యమంలో కీలకం.. నేడు పరిస్థితి దైన్యం..

ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నాయకుడి ప్రస్తుత పరిస్థితి మరోసారి ఉద్యమకారుల పట్ల ప్రభుత్వాల వైఖరిపై చర్చకు దారితీస్తోంది. బీడి కార్మిక కుటుంబంలో జన్మించిన చింత శ్రీకుమార్, నిజామాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్‌లోని చారిత్రాత్మక నిజాం కళాశాలలో డిగ్రీ చదివేందుకు చేరాడు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య పీ హెచ్ డి పూర్తి చేశారు. 2009 లో తెలంగాణ ఉద్యమం ఉద్ధృతం కావడంతో విద్యార్థి రాజకీయాల్లో శ్రీకుమార్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. నిజాం కళాశాలలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నిజాం కాలేజీ తొలి టీఆర్ఎస్వీ ప్రెసిడెంట్, తరువాత టీఆర్ఎస్వీ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా కొనసాగారు. తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన బస్సు యాత్రలు, రైలు రోకోలు, సాగరహారం, అసెంబ్లీ ముట్టడి, వంటా-వార్పు, ధర్నాలు వంటి అనేక కార్యక్రమాల్లో శ్రీకుమార్ విద్యార్థిలోకాన్ని ముందుండి నడిపించారు.

విద్యార్థి ఉద్యమ నాయకుల కష్టాలపై..

ఉద్యమ సమయంలో పలుమార్లు అరెస్టులు, నిర్బంధాలు ఎదుర్కొన్న ఆయనపై అనేక కేసులు కూడా నమోదయ్యాయి. మిలియన్ మార్చి ఆందోళనలో భాగంగా ట్యాంక్ బండ్ పైన ఆంధ్రా ప్రాంత నేతల విగ్రహాలను ధ్వంసం చేసిన కార్యక్రమంలో కూడా ముందు వరసలో ఉన్నాడు. ఉద్యమ సమయంలో జరిగిన పోలీసు చర్యల్లో తీవ్రంగా గాయపడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని ఆయన సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. విద్యార్థి ఉద్యమ నాయకుల కష్టాలపై జాతీయ స్థాయిలో చర్చలో ఆయన పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అనేక మంది విద్యార్థి నాయకుల మాదిరిగానే శ్రీకుమార్‌కు కూడా తగిన గుర్తింపు, రాజకీయ అవకాశాలు లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమ సమయంలో ఆయన చేసిన త్యాగాలు, ఎదుర్కొన్న ఇబ్బందులకు సరైన గుర్తింపు దక్కలేదని ఆయన సన్నిహితులు, కుటుంబీకులు వాపోతున్నారు.

ఉద్యమ కోసం అవకాశలను వదిలి..

విద్యార్థి దశలో ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యంతో ఉన్న శ్రీకుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేసినప్పటికీ, ఉద్యమ రాజకీయాల కారణంగా తన వ్యక్తిగత జీవితంలో అనేక అవకాశాలను కోల్పోయారు.

ఉద్యమ నాయకుడిపై ఇంతటి నిర్లక్ష్యమేల..?

తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరుగునపడిన విద్యార్థి నాయకుల సేవలను గుర్తించి, వారి త్యాగాలకు తగిన గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉద్యమం కోసం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా మట్టినే ముడుపు గట్టి తీసుకెళ్లారు. అలాంటి జిల్లాకు చెందిన ఉద్యమ కిశోరం చింత శ్రీకుమార్ కు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నిరాదరణే ఎదురవుతోంది. భవిష్యత్ తరాలకు ఉద్యమ చరిత్రను అందించేందుకు ఇటువంటి నాయకుల పోరాటాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు సూచిస్తున్నాయి.

ఆస్పత్రి ఐసీయూ లో శ్రీకుమార్..

శ్రీకుమార్ రెండు రోజుల క్రితం సివియర్ హార్ట్ ఎటాక్ తో నిజామాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్ (హోప్) లో జాయినయ్యారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన శ్రీకుమార్ ది పేద కుటుంబం. ఆస్పత్రిలో వైద్య ఖర్చులు కూడా భరించుకునే ఆర్ధిక స్థోమత లేని శ్రీకుమార్ ను, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని, ఆపన్న హస్తం అందించాలని శ్రీకుమార్ కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది.

Next Story