- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా కొరత లేకుండా పకడ్బందీ చర్యలు
యూరియా కొరత లేకుండా పంపిణీ పక్కదారి పట్టకుండా చర్యలు.. జిల్లాకు యాసంగి సీజన్ కోసం మొత్తం 39,645 మెట్రిక్ టన్నులు.. ఎరువుల దుకాణాల వద్ద రద్దీని నివారించడానికి ప్రణాళికలు..

దిశ, కామారెడ్డి: గత వానాకాలం సీజన్ మాదిరిగానే ఈ యాసంగిలోనూ యూరియా కొరత ఏర్పడకుండా ఉండేందుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం తో పాటు జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ యూరియాపై నిరంతరం నిఘా ఉంచింది. యూరియాను దుకాణాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. యూరియా విక్రయాల కోసం ప్రభుత్వం గట్టి నిఘాను ఏర్పాటు చేయడానికి గాను మండల స్థాయిలో ప్రత్యేకమైన విజిలెన్స్ టీం, యూరియా రవాణాలను పసిగట్టడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ను ఏర్పాటు చేసింది. ఈ టీం ను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తుంటారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు విక్రయాలు జరపనున్నారు. ఇంకా రైతులకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వారికి సహాయంగా టోల్ ఫ్రీ నెంబర్ 8977746047 ను అందుబాటులో ఉంచారు.
యూరియా కొరత నివారణకు ప్రత్యేక నిఘా
గత వర్షాకాలం సీజన్‌లో యూరియా పంపిణీలు జరిగిన ఇబ్బందులను రైతులకు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ యంత్రాంగం యూరియా పంపిణీకి గట్టి నిఘా ఏర్పాటు చేసింది. యూరియా పంపిణీ కౌంటర్ల తీరును ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించేందుకు గాను మండల స్థాయిలో విజిలెన్స్ టీం ను ఏర్పాటు చేశారు. ఈ టీంలో మండల వ్యవసాయ అధికారి, స్థానిక ఎస్సై, తహసిల్దార్‌లతో టీంను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా యూరియా రవాణాపై కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఏర్పాటు చేశారు. వీరు యూరియా కొరత కలగకుండా చూడడంతో పాటు పక్కదారి పట్టకుండా చూడనున్నారు.
యూరియా కొరతను అధిగమించేనా..
జిల్లాలో ఇప్పటికే యాసంగి సీజన్ కు గాను యూరియా పంపిణీ మొదలైంది. ప్రస్తుతానికి అయితే జిల్లాలో యూరియా నిల్వలు తక్కువగానే ఉన్నాయి. దీంతో రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియాను తెప్పిం చగలుగుతారా? లేదా? అనేది వేచి చూడాలి. జిల్లాలో ఉన్న యూరియా నిల్వలను పరిశీలిస్తే మొత్తం అవసరమైన యూరియా 39,645 మెట్రిక్ టన్నులు ఉండగా ఈ రోజుకు అందిన మొత్తం పరిమాణం 24,812 మెట్రిక్ టన్నులు. అయితే ఇప్పటివరకు పంపిణీ చేసింది 16,745 మెట్రిక్ టన్నులు. ఇంకా 14,833 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. అయితే యాసంగి వరి చేను కోతకు వచ్చే నాటికి మరి కొంత సమయం ఉండటంతో మిగతా యూరియాను తెప్పించాల్సి ఉంటుంది. అయితే వానాకాలం సీజన్ మాదిరిగానే జిల్లాలో మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందేమోననే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతుంది.
రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు
రైతులకు యూరియా పంపిణీ సందర్భంగా ఇలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎరువుల దుకాణాల వద్ద నీడ కోసం షామియానాలతో పాటు తాగునీటి వసతి కల్పిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ఎరువులు విక్రయించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. రైతులు ఒకేసారి అందరూ రాకుండా వీలుని బట్టి వచ్చి యూరియా తీసుకు వెళ్లాలని, రైతులందరికీ సరిపడా యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు.






