భారీగా పెరిగిన కాంప్లెక్స్ ధరలు...

by Kodari Anjali |

వర్షాబావ పరిస్థితులతో సాగుపై ఆందోళనతో ఉన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అన్నదాతకు పెరుగుతున్న ఎరువుల ధరలు మరింత కృంగదీస్తున్నాయి.

భారీగా పెరిగిన కాంప్లెక్స్ ధరలు...
X

దిశ, నందిపేట: వర్షాబావ పరిస్థితులతో సాగుపై ఆందోళనతో ఉన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అన్నదాతకు పెరుగుతున్న ఎరువుల ధరలు మరింత కృంగదీస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోని రెండుసార్లు ధరలు పెరగడం కర్షకులను ఆవేదనకు గురిచేస్తుంది. కాంప్లెక్స్ ధరలు ఏకంగా 50 కిలోల బస్తాకు రూ.300 నుంచి 550 వరకు పెరగడం కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. యూరియా, డిఎపి ధరలు స్థిరంగానే ఉన్నప్పటికీ మిశ్రమ ఎరువుల ధరలు ఆకాశాన్నంటడం ములిగే నక్కపై తాటికాయ పడ్డ.. అన్న చందంగా తయారైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో సుమారుగా 8.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుతున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకు సంబంధించి ఎరువుల పంపిణీకి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సీజన్ ప్రారంభమై పక్షం రోజులవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఇంకా పూర్తిస్థాయిలో వర్షాలు పడలేదు. అయినప్పటికీ ముందస్తుగా ఎరువులు, విత్తనాలు సమకూర్చుకునే పనిలో రైతన్నలు బిజీగా ఉన్నారు.

దుకాణాల్లోకి కొత్తగా వచ్చే సరుకు..

అయితే మునుపెన్నడూ లేనంతగా ఈ ఏడాది నెలన్నర వ్యవధిలోనే రెండుసార్లు ఎరువుల ధరలు భారీగా పెరగడం అన్నదాతను ఆందోళనకు గురిచేస్తుంది. జిల్లాలో అత్యధికంగా వినియోగించే 20:20:0:13 కాంప్లెక్స్ ఎరువు గత నెల రోజుల కిందట 50 కిలోల బస్తాకు గరిష్ట ధర రూ. 1450 ఉండేది. ఒకసారిగా సీజన్ ప్రారంభంలోనే రూ.350 పెరిగింది. అంటే బస్తా ధర రూ. 1800 లకు కొన్నారు. రైతులు ఇంకా సేద్యం మొదలుపెట్టకముందే మరో రూ. 350 పెంచారు. దుకాణాల్లోకి కొత్తగా వచ్చే సరుకు ఇప్పుడు బస్తా ధర రూ. 2150 కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే నెలన్నర రోజుల వ్యవధిలోని రూ. 600 పెరగడం కర్షకునికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంప్లెక్స్ ఎరువులు వాడే రైతులకు పెరిగిన ధరలు నడ్డి విరుస్తున్నాయి. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాలో కాంప్లెక్స్ ఎరువులు 45,122 మెట్రిక్ టన్నులు, మ్యూరేట్ రేట్ ఆఫ్ పొటాష్ 13,201 మెట్రిక్ టన్నులు వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెరిగిన ధరలతో ఒక్క నిజామాబాద్ జిల్లాలోని రూ. రెండు కోట్లు అదనపు వారం పడనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక సీజన్‌కు సుమారు రూ. ఐదు కోట్ల మేర రైతులు అదనంగా మిశ్రమ ఎరువులకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

* జిల్లాలో అత్యధికంగా వినియోగించే పెరిగిన ఎరువుల ధరలు ఇలా ఉన్నాయి.. (రూ.లలో)

* ఎరువు-ప్రస్తుత ధర- పెరిగినధర-- వ్యత్యాసం

20:20:0:13 1800 2150 350

12:32:16 1900 2450 550

15:15:15 1650 1950 300

10:26:26 1950 2450 500

SSP 615 1000 385

MOP 1850 1975 125

Next Story