సిలిండర్ పై రూ.50 నుంచి రూ.70లు వసూల్

by velandi.Saikiran |   (  Updated:2026-03-10 23:15:24  IST  )

డెలివరీ బాయ్స్‌ ద్వారా ఒక్కో సిలిండర్ పై బిల్లుకంటే రూ. 50 నుంచి రూ.70 వరకూ అదనంగా బాదేస్తున్నారు.

సిలిండర్ పై రూ.50 నుంచి రూ.70లు వసూల్
X

బండపై బాదుడు

గ్యాస్ ఏజెన్సీల అదనపు బాదులు

డెలివరీపై ఎక్స్ ట్రా చార్జీలంటూ దోపిడీ

సిలిండర్ పై రూ.50 నుంచి రూ.70ల వసూల్

చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వినియోగదారులపై భారం మోపుతున్నారు. డెలివరీ బాయ్స్‌ ద్వారా ఒక్కో బండపై బిల్లుకంటే రూ. 50 నుంచి రూ.70 వరకూ అదనంగా బాదేస్తున్నారు. వంటగ్యాస్‌ సరఫరా ఏమో కానీ దారుణమైన దోపిడీ కొనసాగుతున్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరచూ సిలిండర్‌ రేట్లను పెంచుతూ వాతలు పెడుతున్నది. మరోవైపు గ్యాస్‌ ఏజెన్సీలు సైతం వినియోగదారులను నిలువునా దోచుకుంటున్నాయి. గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులు చేస్తోన్న అక్రమ దోపిడీతో వినియోగదారులపై ఏటా కోట్లాది రూపాయలు అదనపు భారం పడుతున్నది. ఎల్పీజీ సిలిండర్లను వినియోగదారులకు సరఫరా చేయడం ద్వారా సంబంధిత చమురు సంస్థల నుంచి గ్యాస్‌ ఏజెన్సీలకు కమీషన్‌ వస్తుంది. వినియోగదారుడు చెల్లించే మొత్తంలో సిలిండర్‌ సరఫరాకు సంబంధించిన రుసుము కూడా అంతర్లీనంగా ఉంటుంది. ఇంటికే సిలిండర్‌ తెచ్చి ఇవ్వాల్సిన గ్యాస్‌ ఏజెన్సీలు మధ్యలో డెలివరీ బాయ్స్‌ రూపంలో ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నాయి. ఈ విషయంపై ఫిర్యాదులు చేసినా ఎలాంటి పట్టింపు లేకుండా పోతోంది. గ్రామాల్లోనూ గ్యాస్‌ ఏజెన్సీలు విచ్చల విడిగా పెరిగాయి. దోపిడి విషయంలో మాత్రం అంతా సిండికేట్‌గా మారి డెలివరీ బాయ్స్‌ రూపంలో తెగబడుతున్నారు.

దిశ, పిట్లం :

మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో హెచ్‌పి గ్యాస్ వినియోగదారులు అదనపు వసూళ్లతో అల్లాడిపోతున్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే క్రమంలో డెలివరీ బాయ్స్ సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అదనపు మొత్తాన్ని డిమాండ్ చేస్తుండటంతో వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అదనంగా రూ. 50 నుంచి 70 వసూలు.

ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీ వద్ద సిలిండర్ ధర సుమారు రూ. 930 ఉండగా, ఇంటి వద్దకు డెలివరీ చేసే సమయంలో సిబ్బంది అదనంగా రూ. 50 నుంచి రూ. 70 వరకు వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతుంటే, డెలివరీ ఛార్జీల పేరుతో చేస్తున్న ఈ అక్రమ వసూళ్లు పెను భారంగా మారాయని వినియోగదారులు వాపోతున్నారు. డబ్బులు ఇవ్వని పక్షంలో సిలిండర్లు ఇవ్వమని మొండికేస్తున్నారని, గ్రామాల్లో ఇది మరీ ఎక్కువగా ఉందని వారు పేర్కొంటున్నారు.

అధికారుల పర్యవేక్షణ కరువు.

గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం పర్యవేక్షణ లోపం వల్లే డెలివరీ బాయ్స్ ఈ ఆగడాలకు పాల్పడుతున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదంతా జరుగుతున్నా.. సంబంధిత శాఖ అధికారులు గానీ ఈ అక్రమ వసూళ్లపై దృష్టి సారించకపోవడం గమనార్హం.

అధికారులు స్పందించాలి.

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సిలిండర్లను సరఫరా చేసేలా చూడాలని, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story