'నో స్టాక్' బోర్డుల రచ్చ..జాతీయ రహదారుల వెంబడి వాహనదారుల అవస్థలు

by velandi.Saikiran |   (  Updated:2026-03-25 21:30:20  IST  )

జిల్లాలోని ప్రధాన జాతీయ రహదారులైన 44, 161 వెంబడి ఉన్న బంకులతో పాటు కామారెడ్డి పట్టణంలోని దాదాపు అన్ని చోట్లా 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి.

నో స్టాక్ బోర్డుల రచ్చ..జాతీయ రహదారుల వెంబడి వాహనదారుల అవస్థలు
X

ఇంధన సెగ.. బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డుల రచ్చ!

- జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదంటున్న అధికారులు.. క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితి

- జాతీయ రహదారుల వెంబడి వాహనదారుల అవస్థలు.. కృత్రిమ కొరతపై అనుమానాలు

- వదంతులు నమ్మవద్దన్న పోలీసులు.. క్యూ కట్టిన జనం

దిశ, కామారెడ్డి/ఆలూర్ : కామారెడ్డి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. జిల్లాలోని ప్రధాన జాతీయ రహదారులైన 44, 161 వెంబడి ఉన్న బంకులతో పాటు కామారెడ్డి పట్టణంలోని దాదాపు అన్ని చోట్లా 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంధనం కోసం బంకులకు వెళ్తున్న వాహనదారులకు నిరాశే ఎదురవుతోంది. నిర్వాహకులు నిల్వలు లేవని చెబుతూ వెనక్కి పంపిస్తుండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సదాశివనగర్ దగ్గి ఎక్స్ రోడ్డు నుండి భిక్కనూరు బస్వాపూర్ వరకు అనేక బంకుల్లో వాహనాలు రాకుండా తాళ్లు, పైపులు అడ్డంగా కట్టారు. జిల్లావ్యాప్తంగా 80 శాతానికి పైగా బంకుల్లో ఒకేసారి స్టాక్ అయిపోవడంపై వాహనదారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమైన కొరతా లేక కృత్రిమంగా సృష్టించిందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

వదంతులతో పెరిగిన రద్దీ..

మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ఇంధన సరఫరా నిలిచిపోతుందనే ఊహాగానాలు ఆలూర్, ఆర్మూర్, మాక్లూర్, నందిపేట్ ప్రాంతాల్లో కలకలం రేపాయి. కొరత ఏర్పడుతుందనే భయంతో బుధవారం వాహనదారులు బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. కొందరు ముందస్తు జాగ్రత్తగా డబ్బాలు, కేన్లలో ఇంధనాన్ని నింపుకోవడంతో రద్దీ రెట్టింపు అయ్యింది. అయితే, ఆయిల్ కంపెనీలు డీలర్లకు ఇచ్చే క్రెడిట్ సదుపాయాన్ని నిలిపివేసి, నగదు చెల్లిస్తేనే సరఫరా చేయడమే ఈ తాత్కాలిక ఇబ్బందికి కారణమని బంకుల యజమానులు చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వదంతులు నమ్మొద్దు : పోలీసులు

జిల్లాలో ఇంధన కొరత లేదని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మరియు ఆలూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ విడివిడిగా ప్రకటనలు జారీ చేశారు. ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని, తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బంకుల్లో తగినంత నిల్వలు ఉన్నాయని, వాహనదారులు ఒకేసారి వచ్చి రద్దీ సృష్టించవద్దని కోరారు. అయితే, అధికారుల ప్రకటనలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో బంకుల వద్ద బోర్డులు దర్శనమిస్తుండడం గమనార్హం.

Next Story