ఇసుకే బంగారమాయేనా? దొడ్డిదారిన తరలిస్తున్న మాఫియా

by velandi.Saikiran |

ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన మన ఇసుక వాహనం ప్రయత్నం అమలుకు గండి పడుతోంది.

ఇసుకే బంగారమాయేనా?  దొడ్డిదారిన తరలిస్తున్న మాఫియా
X

ఇసుకే బంగారమాయేనా?

మన ఇసుక వాహనం యాప్ తో ఇబ్బందులు

ఆకాశాన్నంటుతున్న ధరలు

దొడ్డిదారిన తరలిస్తున్న మాఫియా

సామాన్యులకు దొరకని వైనం

సంక్షోభంలో నిర్మాణ రంగం

అధికారులు, ఇసుక వ్యాపారుల దోస్త్ మేరా దోస్త్

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన మన ఇసుక వాహనం ప్రయత్నం అమలుకు గండి పడుతోంది. భీమ్‌‌ గల్ మండలంలో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టిన ఈ ఇసుక రవాణా పద్ధతికి అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ప్రభుత్వ ప్రయత్నాలకు తూట్లు పడుతోంది. మన ఇసుక వాహనం ద్వారా ఇసుక ను పొందడం లో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట్యా జనాలకు ఈ పద్ధతి కొంత ఇబ్బంది కలిగిస్తోందన్న మాట వాస్తవం. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశలో ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలున్నాయి. ఓ పక్క కలెక్టర్ తహసీల్దార్లకు, అధికారులకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంపై రెవెన్యూ అధికారులు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటి దాకా ఇసుక మాఫియా తో కుమ్మక్కైన రెవెన్యూ, పోలీసు యంత్రాంగం, వివిధ పార్టీల నాయకులకు ఆడిందే ఆటగా సాగిన ఇసుక దందాకు ఒక్కసారిగా మన ఇసుక వాహనం చెక్ పెట్టినట్లయ్యింది.

ఇసుక వ్యాపారుల దందా ఆగిపోవడంతో రెవెన్యూ అధికారులకు, పోలీసులకు క్రమం తప్పకుండా పెద్ద మొత్తంలో వచ్చే అక్రమ ఆదాయానికి గండి పడినట్లయ్యింది. దీంతో నీళ్లలోంచి తీసి ఒడ్డున పడేసిన చేప పిల్లల్లా తయారైంది అధికారుల పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్‌‌లకైనా, కొత్త ఇళ్ల నిర్మాణాలకైనా, ఏ ఇతర పనులకైనా ఇసుక కావాలంటే మన ఇసుక వాహనం యాప్ ద్వారానే బుక్ చేసుకుని కొనుగోలు చేయాలని అధికారులు కచ్చితమైన నిబంధలను విధించారు. ఇది ఇసుక వ్యాపారులకు మింగుడు పడటం లేదు. దీంతో మన ఇసుక వాహనం యాప్ ద్వారా కాకుండా మరేదైనా పాత మార్గంలోనే యధేచ్ఛగా ఇసుకను తరలించేందుకు స్థానికంగా అనుమతి నివ్వాలని అధికారులను ఇసుక వ్యాపారులు కోరుతున్నారు. పరిస్థితి మునుపటిలా లేదని, ఇప్పుడు పాత పద్ధతిలో ఏదీ జరిగేలా లేదని అధికారులు సైతం తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నట్లుగా ఇసుక దందా దళారులు చెపుతున్నారు.

ఓ వైపు మీటింగులకు అధికారులు..

జిల్లాలో జరిగే ఇసుక రవాణా పూర్తిగా మన ఇసుక వాహనం యాప్ ద్వారానే నిబంధనలకు అనుగుణంగా జరగాలని, ఎక్కడా ఇసుక అక్రమంగా రవాణా జరగడానికి వీల్లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని రెవెన్యూ అధికారులతో, ఇతర అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు హాజరవుతున్న తహసీల్దార్ లు మీటింగుల్లో కలెక్టర్ చెప్పింది జాగ్రత్తగా వింటూ అన్నీ పాటిస్తామని చెపుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం తేడాగా నడుస్తోందనే విమర్శలున్నాయి. మండలంలో ఎలాంటి వేబిల్లులు లేకున్నా, మన ఇసుక వాహనం యాప్ లో ఎలాంటి బుకింగ్ చేయకున్నా, బడాభీమ్‌‌ గల్ గ్రామంలో ట్రాక్టర్ ల ద్వారా ఇసుక రవాణా జరుగుతోంది. ఎవడుంటే మనకేందిలే అన్న చందంగా దర్జాగా భీమ్‌‌ గల్ రెవెన్యూ పరిధిలోని ఓ గ్రామంలో ఇసుకను నిర్భీతిగా తరలిస్తున్నారు. అధికారులకు అన్నీ తెలిసినా ఏం చేయలేక చేతులు ముడుచుకుని చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

డంప్ ల నుంచి అక్రమ రవాణా..

ఇసుక దందా నిర్వాహకులు ఇప్పటి వరకు అక్రమంగా డంప్ చేసుకున్న ఇసుక డంప్ ల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను దగ్గరి గ్రామాలతో పాటు, ఆర్మూర్ వరకు తరలిస్తున్నారు. ఓ పక్క కలెక్టర్ మన ఇసుక వాహనం గురించి అధికారులకు పాఠాలు చెపుతుంటే, అవన్నీ వింటున్నట్లు నటిస్తూనే భీమ్‌‌ గల్ మండలంలో తెరచాటుగా ఇసుక అక్రమ వ్యాపారానికి కొమ్ము కాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక రవాణా జరుగుతోందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎక్కడా ఇసుక లేనేలేదని వాదించడంతో పాటు, డంప్ ల గురించి సమాచారం ఇవ్వాలని, రైడ్ చేస్తామని అధికారులే అడుగుతుండటం విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. గతంలో ఇసుక డంప్ ల గురించి నేరుగా అధికారులకే సమాచారం ఇస్తే ఇసుక వ్యాపారుల నుండి సమాచారం ఇచ్చిన వ్యక్తులకు బెదిరింపు కాల్స్ వచ్చిన సందర్భాలు కూడా భీమ్‌‌ గల్ మండలంలో ఉన్నట్లు ఎవరినడిగా చెపుతారని స్థానికులంటున్నారు.

అధికారులు, ఇసుక వ్యాపారుల దోస్త్ మేరా దోస్త్..

భీమ్‌‌ గల్ మండలంలో ఇసుక వ్యాపారులు, అక్రమ ఇసుక వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన సంబంధిత అధికారుల బంధం దోస్త్ మేరా దోస్త్ అన్న చందంగా చాలా కాలంగా కొనసాగుతోందన్నది జగమెరిగిన సత్యం. అక్రమ రవాణా గురించి సమాచారం ఇవ్వండని కోరేది అధికారులే, సమాచారం ఇస్తే దాన్ని లీక్ చేసి సమాచారం ఇచ్చిన వ్యక్తిని పరోక్షంగా టార్‌గెట్ చేసేది కూడా అధికారులేనని చాలా మంది అనుభవంతో చెపుతున్న మాట. మన ఇసుక వాహనం యాప్ ద్వారా ఇసుక అమ్మకాలు ఎలా జరపాలో అధికారులకు చెపుతున్న కలెక్టర్ ఇసుక విషయంలో అవినీతి అధికారుల భరతం పట్టే విషయాన్ని కూడా ఆలోచించాలని జనాలు కోరుకుంటున్నారు.

Next Story