ఏం చేద్దాం..? ఖజానాలు ఖాళీ.. సర్పంచుల సతమతం

by velandi.Saikiran |

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచి బాధ్యతలు చేపట్టిన సర్పంచులకు నిధుల కరువు పెద్ద సవాలుగా మారింది. పదవిలోకి వచ్చి నెల రోజులు దాటుతున్నా, ఖజానా ఖాళీగా ఉండటంతో ఓటర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు.

ఏం చేద్దాం..? ఖజానాలు ఖాళీ.. సర్పంచుల సతమతం
X

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచి బాధ్యతలు చేపట్టిన సర్పంచులకు నిధుల కరువు పెద్ద సవాలుగా మారింది. పదవిలోకి వచ్చి నెల రోజులు దాటుతున్నా, ఖజానా ఖాళీగా ఉండటంతో ఓటర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని 532 పంచాయతీల్లో పారిశుద్ధ్యం, నీటి సరఫరా వంటి కనీస పనులకే నిధులు సరిపోవడం లేదు. ముఖ్యంగా కోతుల బెడద నివారణ వంటి హామీలు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వాటిని అమలు చేయడం భారంగా మారింది. కొందరు సొంత డబ్బులతో కార్యాలయాలకు రంగులు వేయించినా, ట్రాక్టర్లకు డీజిల్ పోయించడానికి కూడా పైసలు లేక ఇబ్బంది పడుతున్నారు. గత సర్పంచుల పాత బకాయిలే ఇప్పటికీ విడుదల కాకపోవడంతో, ఇప్పుడు అప్పులు తెచ్చి ఖర్చు చేస్తే తిరిగి వస్తాయన్న నమ్మకం లేదని ఆందోళన చెందుతున్నారు. మంత్రులు సీతక్క, షబ్బీర్ అలీలకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో, ప్రభుత్వ గ్రాంట్లు వస్తే తప్ప గ్రామాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు.

దిశ, భిక్కనూరు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచి బాధ్యతలు చేపట్టిన సర్పంచులకు నిధుల కరువు పెద్ద సవాలుగా మారింది. పదవిలోకి వచ్చి సరిగ్గా నెల రోజులు దాటుతున్నా, ఖజానా ఖాళీగా ఉండడంతో ఓటర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం కాలువల శుభ్రత, పిచ్చి మొక్కల తొలగింపు, బోర్ల మరమ్మతులు వంటి కనీస పనులకే నిధులు సరిపోవడం లేదు. కామారెడ్డి జిల్లాలోని 532 పంచాయతీలలో మెజర్ గ్రామపంచాయతీలు మినహా మిగిలిన చోట్ల కనీసం స్ట్రీట్ లైట్లు వేయించడానికి కూడా నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు.

అమలుకు నోచని కోతుల బెడద హామీ...

ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా హామీ ఇచ్చిన కోతుల బెడద నివారణ ఇప్పుడు సర్పంచులకు భారంగా మారింది. ఈ పనులు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో అప్పు తెచ్చి చేసే సాహసం ఎవరూ చేయడం లేదు. నయా పైసా గ్రాంట్ రాకపోవడంతో ఆపసోపాలు పడుతున్నారు. కొందరు సర్పంచులు సొంత నిధులతో పంచాయతీ భవనాలకు రంగులు వేయించి బాధ్యతలు చేపట్టినప్పటికీ, గ్రామాల్లో చెత్త సేకరణ ట్రాక్టర్లకు డీజిల్ పోయించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రశ్నిస్తున్న ప్రజలు.. బిక్కమొహాలు వేస్తున్న సర్పంచులు

పదవి చేపట్టిన వెంటనే మురుగు కాలువలు, కుక్కల బెడద, యువతకు ఉపాధి వంటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన సర్పంచులను ఇప్పుడు గ్రామ ప్రజలు నిలదీస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నల వర్షం కురిపిస్తుండడంతో సర్పంచులు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి గెలిచినప్పటికీ, మళ్లీ సొంత డబ్బుతో అభివృద్ధి చేయాల్సి రావడం, ఆ నిధులు ఎప్పుడు తిరిగి వస్తాయో తెలియకపోవడం వారిని ప్రధానంగా వేధిస్తోంది. గతంలో అధికారులు రిలీఫ్ పొందగా, ఆ తలనొప్పులన్నీ ఇప్పుడు సర్పంచులపై పడ్డాయి.

పాత బకాయిల విడుదలలో జాప్యం...

గతంలో సొంతంగా ఖర్చు పెట్టిన సర్పంచులకే ప్రభుత్వం పాత బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. పాత నిధులలో చాలా వరకు క్లియర్ చేశామని, త్వరలోనే మిగిలినవి ఇస్తామని మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఫలితం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో కొత్తగా అప్పులు చేసి అభివృద్ధి చేస్తే బకాయిలు ఎప్పుడు వస్తాయన్న నమ్మకం లేకపోవడంతో సర్పంచులు ‘ఏం చేద్దాం?’ అనే ఆందోళనతో గడుపుతున్నారు.

Next Story