- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేపర్ లీక్ ఇంటి దొంగల పనేనా?
నిజామాబాద్ జిల్లాలో బుధవారం ఆలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ లో పదోతరగతి పరీక్ష పేపర్ ను ఫొటో తీసి బయటకు లీక్ చేసిన సంఘటన ఇన్విజిలేషన్ వ్యవస్థలో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది.

పేపర్ లీక్ ఇంటి దొంగల పనేనా?
కాసుల కక్కుర్తి కోసం ప్రైవేట్ స్కూళ్లకు సాయం
నీతి పాఠాలు స్టూడెంట్స్ కేనా? గురువులు పాటించరా?
విద్యాశాఖ పరువు తీస్తుండ్రు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పకడ్బందీగా జరగాల్సిన పరీక్షలు పరిహాసంగా మారిపోతున్నాయి. నిజాయితీగా ఉండాల్సిన గురువులే నీతి తప్పుతున్నారు. తప్పు చేయడాన్ని గుర్తించి నిరోధించాల్సిన వారే తప్పులు చేస్తున్నారు. పకడ్బందీగా జరిపించాల్సిన పరీక్షలను కాసుల కక్కుర్తితో పట్టు తప్పేలా చేస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు పరీక్షల నిర్వహణ బాధ్యత వహించే సిబ్బందితో కుమ్మక్కై వారికి భారీగా ముట్టజెప్పే కాసుల కక్కుర్తి కోసం గుట్టుగా సాగాల్సిన పరీక్షలను పేపర్ లీక్ చేసి రట్టు చేస్తున్నారు. విద్యాశాఖ పరువుతీస్తున్నారు. కష్టపడి పగలూ, రాత్రి కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. రూ.లక్షలు పోసి తమ పిల్లలను చదివిస్తున్న పేరెంట్స్ ను ఆందోళనలోకి నెట్టేస్తున్నారు. కొందరు ఇంటిదొంగలు అడ్డదారిలో వచ్చే డబ్బులకు ఆశపడి పరీక్ష పేపర్ ను బయటకు లీక్ చేసి విద్యావ్యవస్థపైనే నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో బుధవారం ఆలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ లో పదోతరగతి పరీక్ష పేపర్ ను ఫొటో తీసి బయటకు లీక్ చేసిన సంఘటన ఇన్విజిలేషన్ వ్యవస్థలో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది.
ర్యాంకుల వేటలో పరుగెడతున్న పలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు వారి విద్యాబోధనపైన నమ్మకం లేకనో, తమ పోటీ సంస్థల విద్యార్థుల టాలెంట్ కు ఎక్కడ తగ్గుతామోననే భయంతోనో అడ్డదారిలో అడ్డగోలుగా మార్కులు సంపాదించి ర్యాంకుల వేటలో ముందు వరసలో ఉండేందుకు ఆరాట పడుతున్నాయి. ఇందుకోసం పరీక్షల షెడ్యూల్ వెలువడినప్పటి నుండే పక్కా ప్రణాళికతో పావులు కదుపుతూ పరీక్ష కేంద్రాల్లో తమకు అనుకూలమైన టీచర్లను ఇన్విజిలేటర్లుగా విధుల్లో ఉండేలా మేనేజ్ చేసుకుంటున్నాయి. తమ స్కూల్ కు చెందిన విద్యార్థులు ఏ పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాస్తున్నా ఆ కేంద్రానికి సంబంధించిన సీఎస్, డీఓ, ఇన్విజిలేటర్లతో పాటు ఆ సెంటర్ నిర్వాహకులు, యాజమాన్యంతో ముందస్తు ఒప్పందాలు చేసుకుని పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్ కు పక్కాగా స్కెచ్ వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న తతంగమే అయినా, ఎక్కడా బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తగా నేర్పుగా ఈ తతంగం ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్ పరీక్ష రాసే కేంద్రాల్లో కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. పరీక్ష కేంద్రంలో డ్యూటీలో ఉన్న వారు పరీక్ష ప్రశ్‌నాపత్రాల బెండల్ విప్పగానే గుట్టు చప్పుడు కాకుండా ప్రశ్‌నపత్రం ఫోటోను తీసి కాన్ఫిడెన్షియల్ గా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం సంబంధించిన ఓ నమ్మకమైన సిబ్బందికి ఆ ఫోటోను పంపేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ఆ ఫోటో పంపిన వ్యక్తికి, రిసీవ్ చేసుకున్న వ్యక్తికి తప్ప మరెవరికీ తెలియకుండా ఉండేలా, ఆ ఫోటో మూడో వ్యక్తికి చేరకుండా జాగ్రత్త పడుతూ పేపర్ లీక్ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రైవేట్ స్కూల్ లో పనిచేసే కొందరు చెపుతున్నారు. ఇదంతా విద్యాశాఖలోని చాలా మందికి తెలిసే జరుగుతున్న తతంగమని, ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఆలూరులో ఘటనతో హడావిడి..
ఆలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ లో పేపర్ లీక్ ఘటన బహిర్గతం కావడంతో బాహ్య ప్రపంచానికి తెలిసిందే తప్ప.. గుట్టు చప్పుడు కాకుండా ఇదెప్పటి నుంచో జరుగుతోందని విద్యాశాఖలోని వారే చెపుతుండటం గమనార్హం. బయటపడితేనే సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నట్లు హడావిడి చేస్తారే తప్ప, బయట పడకుండా గుట్టుగా జరిగినన్ని రోజులూ అంతా సాఫీగా, ప్రశాంతంగా జరుగుతోందని ప్రచారం చేసుకుంటారనే విమర్శలు కూడా ఉన్నాయి.
అవినీతి కూపంగా మారిన విద్యాశాఖ..
నిజామాబాద్ జిల్లాలోని విద్యాశాఖ పూర్తిగా అవినీతి కూపమైందనే ఆరోపణలు పలు సందర్‌భాల్లో ఉపాధ్యాయ సంఘాల నాయకులు గతంలో ఆధారాలతో సహా ఆరోపణలు చే సిన విషయం తెలిసిందే. విద్యాశాఖలోని కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు ప్రైవేటు పాఠశాలకు పరోక్ష సహకారాలందిస్తూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్ నిర్లక్ష్యం కారణంగా, యాజమాన్యాల వేధింపుల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాల్లో విద్యాశాఖ వారికి వెన్నుదన్నుగా నిలబడిందే తప్ప బాధితుల పక్షాన నిలబడలేదని, విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గతంలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే తెలుస్తోంది. వీటన్నింటిని పరిశీలిస్తే విద్యాశాఖ కు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యంతో ఎంతటి అవినాభావ సంబంధాలున్నాయో, వారి ద్వారా ఎంత పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలున్నాయోననే సందేహాలు తలెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి విద్యాశాఖ ప్రక్షాళన పై ఫోకస్ పెట్టాలని పలువురు కోరుతున్నారు.
తొమ్మిది మందిని సస్పెండ్ చేసి.. ఇద్దరిపై సస్పెన్షన్ ఎత్తి వేసి..
ఆలూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో బుధవారం జరిగిన హిందీ రెండో పరీక్ష, తెలుగు కి సంబంధించిన ప్రశ్నపత్రాలు ఆలూరు, మెండోర జడ్పీహెచ్ఎస్ ల నుండి, ఇంకా బోధన్ లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లోని పరీక్ష కేంద్రాల నుండి పేపల్ లీకై సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కారణమయ్యారని 9 మందిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విధుల నుండి తొలగించారు. గురువారం ఇద్దరిపై సస్పెన్షన్ ను ఎత్తివేసి విధుల్లోకి తీసుకున్నారు. బోధన్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్ ప్రశ్నపత్రం లీకైనట్లు వైరల్ అయిన ఘటనకు సంబంధించి అధికారులు జరిపిన విచారణలో బోధన్ లో పేపర్ లీకైనట్లు వచ్చిన వార్తలో నిజం లేదని తేలడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం చీఫ్ సూపరింటెండెంట్ కే.వేణు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఏ .శివానందరావ్ లను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.
బయట పడితేనే దొంగలు.. లోలోపల జరిగితే ఆల్ ఈజ్ వెల్..
జిల్లాలో పదోతరగతి పరీక్షల నిర్వహణలో అవకతవకలు బయటపడితేనే దొంగలని, లోలోపల గుట్టుచప్పుడు కాకుండా జరిగితే ఆల్ ఈజ్ వెల్ అనే చందంగా కొనసాగుతున్న తంతుపై జిల్లా కలెక్టర్ రహస్యంగా విచారణ జరిపిస్తే పరీక్షా కేంద్రాల్లో ఏం జరుగుతుందో ఎంత మంది ఇంటి దొంగలున్నారో బయట పడే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ పూర్తిగా ఇన్విజిలేటర్ల సహకారంతోనే జవాబులు చెప్పిస్తున్నారనే విషయాలు పరీక్షలు రాసే విద్యార్ధులే తల్లిదండ్రులకు చెపుతున్నారని తెలుస్తోంది. ఈ రకమైన మాస్ కాపీయింగ్ తో పరోక్ష సహకారం అందిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది. పరీక్షలంటే ఓ జోక్ గా మార్చేస్తున్న విద్యాశాఖలోని వ్యక్తులపై నిఘా ఉంచాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






