- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపాలిటీలో సమస్యల రాజ్యం కొత్తపాలనపై కోటి ఆశలు
మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిపోయి కొత్తగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకార ఘట్టాలు ముగిసిపోయాయి. ఆర్మూర్ మున్సిపాలిటీ ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించడం లేదంటూ గతం నుంచి తీవ్రమైన ఆరోపణలు ప్రధానంగా ఉంది.

దిశ, ఆర్మూర్ : మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిపోయి కొత్తగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకార ఘట్టాలు ముగిసిపోయాయి. ఆర్మూర్ మున్సిపాలిటీ ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించడం లేదంటూ గతం నుంచి తీవ్రమైన ఆరోపణలు ప్రధానంగా ఉంది. ఎక్కడ చూసినా చెత్తా చెదారం, కంపు కొడుతున్న మోరీలు, గల్లీలో సరైన రోడ్ల వ్యవస్థ లేక ఇక్కడ ప్రజలు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తూనే ఉంది. గత పాలకులు చేసిన అభివృద్ధిని పక్కన పెడితే, అప్పుడు జరిగిన అభివృద్ధి కంటే ప్రస్తుతం సమస్యలే అధికంగా ఉన్నాయని ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు. అయితే ప్రతి వార్డుల్లో ప్రధానంగా మురికి కాలువలు, అంతర్గత రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి సమస్యలే ఎక్కువగా ఉన్నాయని ఆయా కాలనీల ప్రజలు చెబుతున్న అంశాలు. కొత్తగా చేపట్టిన నూతన పాలకవర్గం ఈ సమస్యలను ఎలా అధిగమిస్తుందో అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో మొదలైంది. గత పాలవర్గానికి ముందు మున్సిపల్ లో వీలీనమైన పెర్కిట్ కొటార్ మోర్ మామిడిపల్లి గ్రామాల్లో సమస్యలు నూతన మున్సిపల్ పాలకవర్గానికి స్వాగతం పలుకుతున్నాయి. గత మున్సిపల్ లోని ప్రజాప్రతినిధుల, నాయకులు, అధికారుల మాదిరి ఈ సారి ఏమైనా మార్పు జరగబోతుందా అనే అంశంపై మున్సిపల్ నూతన పాలకవర్గ పనితీరుపై ప్రజలు ఎదురు చూస్తున్నారు.
గత పాత మున్సిపల్ పాలకవర్గం అవినీతికి మాయని మచ్చగా మారిందని ఆర్మూర్ ప్రాంతంలోని ప్రజలు పేర్కొంటున్నారు. త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోయే నూతన మున్సిపల్ పాలకవర్గంలోనైనా ఆర్మూర్ మున్సిపల్ అవినీతిని మరిచిపోయేలా అభివృద్ధి వైపు పరుగులు పెట్టేలా ఉండాలని ఆర్మూర్ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. గత మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన రాజు ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం , ప్రస్తుతం ఉన్న అధికారులకు పట్టణ సమస్యలతో పాటు కార్యాలయంలో పేరుకు పోయిన అవినీతి విలయ తాండవం చేస్తూ రానున్న నూతన మున్సిపల్ పాలకవర్గానికి సవాల్ గా మారనుంది. గత మున్సిపల్ కమిషనర్ ఇష్టానుసారంగా ఇంటి నెంబర్లు కేటాయించా రని ఆర్మూర్లో ఆరోపణలు ఆ సమయంలో గుప్పు మన్నాయి.ఒకవైపు ఇరిగేషన్ మరోవైపు, మరోవైపు అసైన్డ్ స్థలాల్లో ఏదేచ్ఛగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వ నిబంధనలకు నీళ్లు వదులుతూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతూ పాలకవర్గం అధికారులు దండిగా ధనార్జనే ధ్యేయంగా పనిచేశారని చేసుకున్నారని ఆరోపణలు వినబడ్డాయి. వీటితోపాటు ఆర్మూర్ మున్సిపల్ లో ప్రధాన రహదారులతో పాటు మురికి కాలువలు సిసి రోడ్లు సరైన పద్ధతిలో లేకపోవడంతో ఆర్మూర్ పట్టణ ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతుంది. ఈ విధంగా ఆర్మూర్ మున్సిపల్ లో సమస్యలు అవినీతి ఆరోపణలతో కొట్టుమిట్టా డుతున్న ఆర్మూర్ మున్సిపాలిటీ నూతన మున్సిపల్ పాలకవర్గం, నూతన చైర్పర్సన్ గోనే లహరి రఘు, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి లు అధికారులతో కలిసి ఆర్మూర్ మున్సిపల్ లో పాలన ఎలా గాడిన పెడతారో , పట్టణ అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో నని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ ,విపక్ష నాయకుల ఒత్తిడి సైతం ఆర్మూర్ మున్సిపల్ అధికారులకు తలనొప్పిగా మారబోతుంది.మున్సిపల్ పరిధిలోని అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలు ,పారిశుద్ధం, రోడ్లు, ఓపెన్ జిమ్ లు , చెత్తను తరలించే ఆటో ట్రాలీలు సైతం సరిగా లేకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కోతులు, దోమలు, కుక్కలు, పందులు...
మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాలైన పెర్కిట్ , మామిడిపల్లి లతో పాటు పట్టణంలోని పలు వార్డులలో కోతులు, దోమల బెడద చాలా తీవ్రంగా ఉంది. వీటికి తోడు కుక్కలు, పందులతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి వార్డులలోను 30 నుండి 40 కుక్కలు ఉంటున్నవి. కుక్కల బెడదతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడు తున్నారు. చిన్నారులు ఆడుకోవాలన్న పాఠశాలలకు వెళ్లాలన్న ఎక్కడ కుక్కలు, కోతులు దాడి చేస్తాయోనని బిక్కు బిక్కు మంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఆర్మూర్ మున్సిపల్ లో దాపురించింది. మున్సిపల్ ఎన్నికలకు ముందు పల్లెపోరులో పలు గ్రామాల్లో కోతుల బెడదకు సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడ్డ వారు హామీలు ఇచ్చి నెరవేరుస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ లో కౌన్సిలర్లు ఈ కోతుల ,కుక్కల, పందులు, దోమల బెడదలపై ఎలాంటి హామీలు ఇచ్చినట్టు మున్సిపల్ ఎన్నికల్లో కనబడలేదు. కానీ ఆర్మూర్ మున్సిపల్ ప్రాంతంలోని ప్రజలు ప్రధానంగా వీటితో తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నారు.
అటకెక్కిన ఓపెన్ జిమ్‌లు...
పట్టణ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్లు పలుచోట్ల నిరుపయోగంగా మారి వాటి పనితీరు అటకెక్కింది. వాటి నిర్వహణ సరిగా ఉండడం లేదు. ఓపెన్ జిమ్ లలో పరికరాలు తుప్పు పట్టడం, విరిగిపోవడం, నిర్వహణ సరిగా లేకపోవడంతో స్థానిక జిమ్లకు పట్టణ ప్రజలు వెళ్లడం లేదు. పట్టణంలోని ఓపెన్ జిమ్లను మున్సిపల్ సంబంధించి వివిధ అభివృద్ధి నిధుల ద్వారా ఏర్పాటు చేశారు. ఒక్కో దానికి సుమారుగా 10 లక్షల వరకు ఖర్చు చేసినారు. పర్యవేక్షణ సరిగా లేక పోవడంతో వాటి పరిస్థితి అద్వాన్నంగా మారింది. ఈ ఓపెన్ జిమ్లలో 8 రకాల వ్యాయామానికి సంబంధించిన పరికరాలను ఏర్పాటు చేశారు. నాణ్యత లేక సామాగ్రి ఏర్పాటు చేయడంతో పాటు నిర్వహణ గాలికి వదిలేయడంతో పలుచోట్ల పరికరాలు విరిగిపోయాయి. ఈ పట్టణంలో ఓపెన్ జిమ్ లను అప్పటి మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ నిధులతో ఏర్పాటు చేయించారు. కానీ అటు తర్వాత అధికారులు పట్టించుకోవడం, ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఓడిపోవడం వల్ల పార్కులలో ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్లను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. అధికారులు ,నూతన పాలకవర్గం స్పందించి చెడిపోయిన ఓపెన్ జిమ్ లకు మరమ్మత్తులు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుచున్నారు.
రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులు...
గత పది సంవత్సరాల క్రితం మున్సిపల్ పరిధిలోని కోటార్ మూర్ ప్రాంతంలో మున్సిపల్ ఏడవ వార్డులో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు. కాగా ఈ రైల్వే స్టేషన్ పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో , మామిడిపల్లి జాతీయ రహదారి నుండి ఒకటిన్నర కిలోమీటర్లు , పెర్కిట్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ యొక్క స్టేషన్ నుంచి ప్రయాణికులు ఆయా స్థానాలకు చేరుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. గతంలో కురిసిన వర్షాల, వరదల కారణంగా ఆ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ రైల్వే స్టేషన్ నుండి కాచిగూడ నుంచి పెద్దపల్లి, నిజామాబాద్ నుంచి కరీంనగర్ కు ప్రతినిత్యం రైళ్ల రాకపోకలు ఉంటాయి. రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన సమీపంలో గుట్టలు చెరువులు సమీపంలో ఉండడంతో రోడ్డు మార్గం సక్రమంగా లేదు. వర్షాకాలంలో రోడ్డు మార్గం తెగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చదువులు సాగేదేట్ల..
ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని పలు పాఠశాలలు అసౌకర్యాలతో శిథిలావస్థకు చేరుకున్నాయి. పట్టణంలోని జిరాయిత్ నగర్ ప్రాథమిక పాఠశాల(చిప్ప స్కూల్) లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్ట ణంలోని పలు అంగన్వాడి కేంద్రాలు అద్దె భవనాలలో కొనసాగుతుండగా, మరికొన్ని అంగన్వాడీలు నిర్వహణ సరిగా లేక, అధికారుల, ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ కరువై అస్తవ్యస్తంగా తయార య్యాయి. గత కొన్ని సంవత్సరాల నుండి అంగన్వాడి కేంద్రాలలో టీచర్ల,ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నవి..
వారసంతలో ఇబ్బందులు...
ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంగడి బజార్ వద్ద అనాదికాలం నుంచి ప్రతి బుధవారం వార సంత జరగడం ఆనవాయితీగా వస్తుంది. అదే తీరుగా ప్రతి బుధవారం అంగడి అక్కడ జరుగుతుంది. ఇక్కడకు వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు, రైతులు సుమారుగా 600కు మందికి పైగా వస్తుంటారు. నిత్య వసరాలు , బట్టలు, నిత్యవసర సరుకులు విక్రయిస్తుంటారు. ప్రతివారం అంగడిలో లక్షల్లో వ్యాపారం జరుగుతుండగా రద్దీగా ఉండడంతో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. చైన్ స్నాచింగ్ లతో పాటు మొబైల్ ఫోన్ లను అంగడికి వచ్చే ఆర్మూర్ ప్రాంతంలోని ప్రజలు పోగొట్టుకుంటూ తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మహిళలు వృద్ధులను లక్ష్యంగా చేసుకొని చోరీలు చేస్తున్నారు. వీటితో పాటు పట్టణంలోని పలు వైకుంఠ దామాల్లో తగిన సౌకర్యాలు లేక మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు అనేక సమస్యలు విలయతాండవం చేస్తున్నవి..
అక్రమ కట్టడాలకు ఇంటి నెంబర్ల కేటాయింపులు...
పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్ కట్ట దాదాపు 70, 80 శాతం వరకు కబ్జాకు గురైంది. అయితే కబ్జా చేసిన ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణం, వ్యాపారం కోసం మడిగెలు నిర్మాణం చేసుకుంటున్నారు. నిజంసాగర్ కెనాల్ లో పిచ్చి మొక్కలు పెరిగి కబ్జాదారుల ఇంటి డ్రైనేజీ నీరు నిజాంసాగర్ కెనాల్ లోకి రావడంతో నీరు కలుషితం అవుతుంది. గత పాలనలో కొందరు నాయకులు అధికారులను నచ్చజెప్పి, వినకుంటే బెదిరించి అసైన్డు ప్రభుత్వ భూములకు ఇంటి నెంబర్లను కేటాయించు కున్నారని ,దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించారని మున్సిపల్ కు రావలసిన ఆదాయానికి గండి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. రాబోయే పాలకవర్గం లో నైనా ఆర్మూర్ నూతన మున్సిపల్ చైర్ పర్సన్ గోనే లహరి రఘు, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకట్ రెడ్డి లు ప్రత్యేకంగా దృష్టి సారించి అవినీతి,అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.






