- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేకాటపై సీక్రెట్‌గా వేట మొదలు
పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా సీక్రెట్‌గా పేకాట స్థావరాల అడ్రస్ తెలుసుకుని స్థానిక పోలీసులే కాకుండా పోలీస్ శాఖకు చెందిన కొత్తముఖాలతో దాడులు చేయిస్తూ పేకాటరాయుళ్లలో వణుకు పుట్టిస్తున్నారు.

దిశ, భిక్కనూరు: పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా సీక్రెట్‌గా పేకాట స్థావరాల అడ్రస్ తెలుసుకుని స్థానిక పోలీసులే కాకుండా పోలీస్ శాఖకు చెందిన కొత్తముఖాలతో దాడులు చేయిస్తూ పేకాటరాయుళ్లలో వణుకు పుట్టిస్తున్నారు. నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్యను ఆదర్శంగా తీసుకొని జిల్లా బాస్ రాజేష్‌చంద్ర ఈ సీక్రెట్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. రాజకీయ అండదండలతో ఇన్నాళ్లు మూడు ముక్కలాడిన కొందరు నేతలు, పేకాట స్థావరాలపై జరుగుతున్న వరుస దాడులు నేపథ్యంలో తట్టబుట్ట సర్దుకొని పోలీసులకు చిక్కకుండా అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మరికొందరు నేతలు మాత్రం తమకున్న పలుకుబడిని ఉపయోగించి దర్జాగా పేకాట ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి నేతల సమాచారాన్ని ముందే తెలుసుకొని పక్కా వ్యూహంతో దాడులు చేస్తున్నారు. వారిని పట్టుకొని పట్టుబడిన నగదు, బైక్‌లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని పూర్తి వివరాలను సమీపంలో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ల ఎస్ఐలకు అందించి వెళ్తున్నారు. అంతేకాకుండా ఇదే సమాచారాన్ని జిల్లా ఎస్పీకి సైతం అందజేస్తున్నారు. అయితే అటువంటి వారి సమాచారం ఏమాత్రం బయటకు లీకు కాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఎవరిని వదలడం లేదు
ఎటువంటి స్థాయిలో, ఏ హోదాలో ఉన్నా వదిలిపెట్టకుండా కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫామ్ హౌస్‌లపై దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. పేకాట రాయుళ్లను పట్టుకోగానే ముందుగా వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వారి వద్ద ఉన్న క్యాష్, ద్విచక్ర వాహనాలు, టేబుల్‌పై దొరికిన క్యాష్‌ను సీజ్ చేస్తున్నారు. నేను ఫలానా పలుకుబడి కలిగిన వ్యక్తినని, అవసరమైతే ఎంతో కొంత తీసుకొని వదిలిపెట్టాలని కొంతమంది దాడులకు వచ్చిన పోలీసులను మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ విషయంలో ఏమాత్రం లొంగకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలోని భిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, రాజంపేట, బీబీపేట ప్రాంతాల్లో వారం రోజులుగా పోలీస్ శాఖకు చెందిన అన్ని విభాగాలు పేకాట స్థావరాలపై దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ దాడుల్లో ఎంతమంది పట్టుబడ్డారు, ఇంత నగదు దొరికింది అన్న విషయాన్ని మాత్రం పోలీసులు బయటకు చెప్పలేకపోతున్నారు. తాజాగా భిక్కనూరు మండలంలోని ఒక ప్రముఖుడికి చెందిన ఫామ్ హౌస్‌పై దాడి చేసి ఐదుగురు పేకాటరాయుళ్లను పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆన్‌లైన్ పేమెంట్‌తోనే ఆట
పేకాట రాయుళ్లు పోలీసుల దాడుల్లో పట్టుబడితే పెద్ద మొత్తంలో డబ్బు దొరకకుండా ఉండేందుకు ఆన్ లైన్ పేమెంట్‌తో పత్తలాట ఆడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు చాలా స్థావరాలపై దాడులు నిర్వహించినా పెద్ద మొత్తంలో పైసలు పట్టుబడిన దాఖలాలు మాత్రం లేవు. అయితే వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ల ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లైన గూగుల్ పే, ఫోన్ పేలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన పేకాట రాయుళ్ల ద్వారా వివరాలు తెలుసుకొని కేసులు నమోదు చేస్తున్నారు.






