త్రివేణి సంగమ క్షేత్రంలో సంఘ్ స్ఫూర్తి కేంద్రం

by Ratna Kumari |

గోదావరి, మంజీరా, హరిద్ర నదుల త్రివేణి సంగమం మరియు గోదావరి మన రాష్ట్రంలో ప్రవేశించే పౌరాణిక నేపథ్యం గల కందకుర్తిలో దేశ విదేశాలలో గల కోట్లాదిమంది స్వయం సేవకులకు స్ఫూర్తినిచ్చేలా కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ కేశవ స్ఫూర్తి కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుంది.

త్రివేణి సంగమ క్షేత్రంలో సంఘ్ స్ఫూర్తి కేంద్రం
X

దిశ, బోధన్ : గోదావరి, మంజీరా, హరిద్ర నదుల త్రివేణి సంగమం మరియు గోదావరి మన రాష్ట్రంలో ప్రవేశించే పౌరాణిక నేపథ్యం గల కందకుర్తిలో దేశ విదేశాలలో గల కోట్లాదిమంది స్వయం సేవకులకు స్ఫూర్తినిచ్చేలా కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో కేశవ స్ఫూర్తి కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది వేడుకలలో భాగంగా ఆర్ఎస్ఎస్ స్థాపకులు డాక్టర్ కేశవ బలిరాం పంత్ హెగ్డేవార్ పూర్వీకుల గ్రామం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన కేశవ స్ఫూర్తి మందిరంను ఆర్ఎస్ఎస్ సర్ సంఘ చాలక్ మోహన్ జీ భగవత్ శనివారం ప్రారంభించనున్నారు.

దేశ నిర్మాణం హిందూ సమాజ ఐక్యత కొరకు 1925 సంవత్సరం విజయదశమి ఆర్ఎస్ఎస్ ను స్థాపించిన డాక్టర్ కేశవ బలిరాం పంత్ హెగ్డేవార్ పూర్వీకుల గ్రామం కందకుర్తి. నాటి నిజాం రాజుల దౌర్జన్యాలను భరించలేక డాక్టర్ జీ కుటుంబం కందకుర్తి నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ కు వలస వెళ్లింది. స్వయం సేవకులు కందకుర్తి గ్రామాన్ని తీర్థ క్షేత్రంగా భావిస్తారు. కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో గతంలో కేశవ మందిరంను నిర్మించారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేశవ స్ఫూర్తి కేంద్రంను నిర్మించారు. వీటితోపాటు స్కూల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లను నిర్మిస్తున్నారు. స్వయం సేవకులకు స్ఫూర్తినిచ్చేలా స్ఫూర్తి కేంద్రం ను రెండు అంతస్తులలో నిర్మాణం చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో హెగ్డేవార్ యొక్క విగ్రహం మరియు సంఘ్ ప్రాముఖ్యతను తెలిపే ఛాయ చిత్రాలు పొందుపరిచారు. మొదటి అంతస్తులో భరతమాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. వీటితోపాటు ఆర్ఎస్ఎస్ స్థాపకులు డాక్టర్ జీ యొక్క జీవిత విశేషాలను తెలియజేసే ఫోటో గ్యాలరీలను అమరిచారు. రెండవ అంతస్తులు భరతమాత విగ్రహంతో పాటు డాక్టర్ జీ జీవిత విశేషాలను ఆర్ఎస్ఎస్ శాఖ ప్రాముఖ్యతను తెలిపే వీడియో ప్రదర్శన గది తో పాటు డాక్టర్ జీ ఉపయోగించిన వస్తువులు, లేఖలు, ముఖ్యమైన పుస్తకాలను ప్రదర్శనశాలలో ఏర్పాటు చేస్తున్నారు.

నాటి స్కందపురి.. నేటి కందకుర్తి

దేవతల సైన్యాధిపతి అయిన సుబ్రహ్మణ్యస్వామిని ఇక్కడ స్కందునిలా కొలిచే వారు. అందుకే ఈ గ్రామానికి స్కందపురి అని పిలిచేవారు. రాను రాను స్కంద పూరి కంద పూర్తిగా మారిందని చరిత్రకారులు చెబుతారు. జీర్ణమైన స్కంద దేవాలయం లో కొత్త దేవాలయం సహితం నిర్మించారు. వనవాసంలో శ్రీరాముడు ఈ స్కందపురిని దర్శించుకుని గోదావరి తీరంలో గల శివాలయంలో పూజలు చేశారని చెబుతుంటారు. ఇంతటి పురాణ నేపథ్యం గల కందకుర్తి లో ఆర్ఎస్ఎస్ స్ఫూర్తి కేంద్ర నిర్మాణం పూర్తి కావడంతో మరోసారి కందకుర్తి స్వయం సేవకులకు స్పూర్తినిస్తుంది.

Next Story