రేవంత్ రెడ్డి ముక్కు నేల‌కు రాసి రైతుల‌కు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాలి

by Ratna Kumari |

కాళేశ్వరం ప్రాజెక్టుపై గత రెండున్నరేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు హైకోర్టు తీర్పు చెంప పెట్టు లాంటిదని, ఆయన వెంటనే ముక్కు నేలకు రాసి రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి ముక్కు నేల‌కు రాసి రైతుల‌కు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాలి
X

దిశ, కామారెడ్డి : కాళేశ్వరం ప్రాజెక్టుపై గత రెండున్నరేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు హైకోర్టు తీర్పు చెంప పెట్టు లాంటిదని, ఆయన వెంటనే ముక్కు నేలకు రాసి రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రూ.96వేల కోట్లు ఖర్చయిన ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. పీసీ జస్టిస్ ఘోష్ కమిషన్ కాదది పీసీసీ ఏర్పాటు చేసిన కమిషన్ అని ఎద్దేవా చేశారు. రెండేళ్ల క్రితం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపడితే రైతాంగం ఎంతో సంతోషపడే వారని అన్నారు. రాజకీయ కక్షతోనే కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేశారని హైకోర్టు తీర్పు స్పష్టం చేసిందన్నారు.

కేసీఆర్ ని బ‌ద్ నాం చేస్తేనే రాజకీయంగా నిల‌దొక్కుకోవచ్చు అనే కక్షతోని పీసీ ఘోష్ కమిషన్ వేసి కేసిఆర్, హరీశ్‌ రావు తో పాటు అధికారులను బద్ నాం చేశారని ఆరోపించారు. ఈ కమిషన్ విచారణ జరిపిన నివేదికను అప్పగించకుండా కక్షతోనే లీకులు చేయడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. దీంతో రేవంత్ కు కోలుకోని దెబ్బ తగిలింది అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అనేది ఒక బ్యారేజీ మాత్రమే అన్నారు. మేడిగడ్డ వద్ద 85 పిల్లర్స్ ఉండగా.. అందులో కేవలం రెండు పిల్లర్స్ మాత్రమే కుంగాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కల్పితమే.. ఇటీవల 8,000 కోట్ల రూపాయలతో మల్లన్న సాగర్ వద్ద నుంచి హైదరాబాద్ పట్టణానికి తాగునీళ్లు తీసుకువెళ్లడానికి పైప్ లైన్ నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద కుంగిన రెండు పిల్లర్లు ఎలా కుంగాయో భవిష్యత్తులో తేలుతుందనీ, దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

రాహుల్, ప్రియాంక గాంధీలతో ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇప్పించారని, వాటిని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద కూడా సమాధానం లేకపోవడం హాస్యాస్పదమన్నారు. మీరు పెట్టిన మేనిఫెస్టోకే విలువ లేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల ఇళ్లకు వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేస్తారన్నారు. భవిష్యత్తులో ఇతను బీజేపీలో చేరడం ఖాయమన్నారు. ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల గుర్తిస్తామని హామీ ఇచ్చారని ఇప్పుడు అడిగితే పట్టించుకోవడం లేదన్నారు. ఇచ్చిన హామీపై ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చేస్తే ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తుందన్నారు. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహుతి చేసుకోవడం బాధాకరమన్నారు.

Next Story