దాహం తీరుస్తున్న 'సాసర్ పిట్స్': వన్యప్రాణుల కోసం అటవీ శాఖ భగీరథ ప్రయత్నం!

by Naga Rani Yarlagadda |

వేసవిలో అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

దాహం తీరుస్తున్న సాసర్ పిట్స్: వన్యప్రాణుల కోసం అటవీ శాఖ భగీరథ ప్రయత్నం!
X

దిశ, కమ్మర్‌పల్లి : వేసవిలో అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల దాహర్తిని తీర్చేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వన్యప్రాణి సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటితొట్టెలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో వేసవిలో నీటి కోసం పలు రకాల వన్యప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో పలు వన్యప్రాణులు కుక్కల బారిన లేదా వాహనాల కింద పడి మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటితొట్టెలు ఏర్పాటు చేసి వాటి దాహర్తి తీర్చేలా కృషి చేస్తున్నారు. రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెడుతున్నారని, వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

కమ్మర్ పల్లి రేంజ్ పరిధి పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణులకు వేసవిలో దాహర్తిని తీర్చేవిధంగా సుమారు 51 నీటి తొట్టెలను ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. సహజ నీటి వనరులు, విద్యుత్ సౌకర్యం లేని అటవీ ప్రాంతాల్లో సోలార్ శక్తితో పని చేసే బోరు బావులు కోనాపూర్ 2, భీంగల్ 2, భీమ్ నగర్ 1 ఏర్పాటు చేసి నిరంతరం నీటి కుంటలు నిండేలా అటవీ శాఖ చూస్తోంది. కొత్తగా మూడు కుంటలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అడవుల్లో సహజ నీటి వనరులు ఎండిపోయిన చోట కృత్రిమ నీటి సౌకర్యం కల్పించనున్నారు. వీటితోపాటు అటవీ ప్రాంతంలోని కాల్వల్లో చెలమలను తీసి, వన్యప్రాణులకు నీటి సౌకర్యం లభించేలా చర్యలు తీసుకున్నారు. అవి కాకుండా చెక్ డ్యామ్స్ ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నీటితొట్టెల్లో వేసవికాలంలో నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా బేస్ క్యాంప్ సిబ్బంది, బీట్ అధికారులు నీటిని తీసుకొచ్చి నింపుతున్నారు. వాహనాల్లో వెళ్ళలేని నీటి తొట్టెల వద్దకు బేస్క్యాంప్ సిబ్బంది వెళ్లి నింపుతారు.

జంతువుల సంచారం

కమ్మర్ పల్లి రేంజ్ పరిధి 35,840 హెక్టార్లలో విస్తరించి ఉంది. సాధారణంగా చలికాలం, వర్షాకాలంలో అడవుల్లో నీటి వనరులు పుష్కలంగా ఉంటాయి. వేసవి కాలంలోనే నీటి ఎద్దడి నెలకొంటుంది. దీంతో వన్యప్రాణులు దాహం తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతుంటాయి. ఈ క్రమంలో నీటి కోసం జనావాసాల్లోకి వచ్చి మృత్యువాత పడుతుంటాయి. పరిధిలో ఉన్న భీంగల్, మోర్తాడ్, కమ్మర్ పల్లి, ఏర్గట్ల మండలాల్లోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. వాటి సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, ముళ్ల పందులు, దున్నలు వంటి అనేక జంతువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

నీరు నింపడానికి నిధుల్లేక..

ప్రభుత్వం తాగునీటి కోసం ఏటా అటవీ శాఖాధికారులు సాసర్ పిట్స్, కుంటలు, చెక్ డ్యాంలు నిర్మించి నీటితో నింపేవారు. దీనికి ప్రభుత్వం ప్రత్యేక నిధులిచ్చేది. కానీ మూడు సంవత్సరాల నుంచి ఆ నిధులు జాడేలేదు. నిధుల్లేక వన్యప్రాణులకు నీటి సౌకర్యం కల్పించేందుకు అధికారులు ఇబ్బందికి గురవుతున్నారు. నీటి తొట్టెలలో అటవీశాఖ సిబ్బంది మూడు రోజుల కొకసారి నీరు నింపాల్సిఉంది. నీరుపోయడానికి అటవీ శాఖాధికారులు స్థానిక సర్పంచులను బతిమిలాడుతున్నారు. పంచాయతీ ట్రాక్టర్లలో నీరు తీసుకెళ్లి పోస్తున్నారు. ప్రభుత్వం నీటి తొట్టెలలో నీరు నింపేందుకు నిధులు మంజూరు చేసి వన్య ప్రాణులను సంరక్షించాలి.

పోడుపేరుతో అడవిని ఖతం

గతంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న చోట్ల చెట్లు లేవు. ఈ అటవీ ప్రాంతాలలో పోడు హక్కు పత్రాలు వచ్చి ఉన్నాయి. గతంలో ప్రభుత్వం 3,470 ఎకరాల పోడు పట్టాల జారీ చేసి ఇచ్చింది. పోడుదారులు, అటవీ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం రేంజ్ పరిధిలో నిరంతరం రాజుకుంటూనే ఉంటుంది. కొంతమంది అడవులను నరికేస్తూ భూమి చదును చేస్తున్నారు. వారికి కూడా ప్రభుత్వం ఎప్పటికైనా పోడు పట్టాల జారీ చేస్తదని నమ్మకంతో అడవిని ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వం వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ క్షేత్రస్థాయి అధికారులు కోరుతున్నారు.

సిబ్బంది కొరత వల్లే..

కమ్మర్ పల్లి రేంజ్ పరిధిలో 35,840వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అటవీ భూములు దురాక్రమణ కాకుండా కాపాడటం, మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడం అటవీశాఖ ప్రధాన లక్ష్యం. అలాంటి అటవీ శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది కొరత వేధిస్తోంది. రేంజ్ పరిధిలో 18 మంది బీట్ ఆఫీసర్లు ఉండాల్సింది కానీ 7 గురు బీట్ ఆఫీసర్లు ఉన్నారు. భర్తీ ప్రక్రియ చేపట్టకపోవడంతో ఉన్న కొద్ది మందిపై అధిక పని భారం పడుతోంది. దీనివల్ల పర్యవేక్షణ ఇబ్బందికరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

రవీందర్, అటవీ శాఖ రేంజ్ అధికారి, కమ్మర్ పల్లి

రేజ్ పరిధిలోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 51నీటి తొట్టెలు వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. వేసవిలో నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని పోసి తొట్టెలు నింపుతున్నాం. జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం.

Next Story