రైతు ఉద్యమాలతో వేడెక్కిన రాజకీయాలు..

by Kodari Anjali |   (  Updated:2026-07-06 03:40:00  IST  )

ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు.

రైతు ఉద్యమాలతో వేడెక్కిన రాజకీయాలు..
X

ఎల్లారెడ్డి నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. మొన్నటి వరకు అధికార పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించినా, యూరియా పంపిణీ వివాదం, రైతుల ఆందోళనలు రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలతో ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రజల్లోకి వెళ్తుండగా, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్వరం పెంచుతున్నారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సైతం నియోజకవర్గ రాజకీయాల్లో మళ్లీ చురుకైన పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో ఎల్లారెడ్డి రాజకీయాలు ద్విముఖ పోటీ నుంచి త్రిముఖ పోటీ వైపు మలుపు తిరుగుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.

దిశ, కామారెడ్డి: ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. నిధుల వేటలో నిమగ్నమై రోడ్లు, తాగునీరు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. అభివృద్ధే తన అజెండా అంటూ ముందుకు సాగుతున్నారు.

ప్రశ్నించే గొంతుకగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే సురేందర్

మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలపై గురి పెట్టారు. యూరియా కొరత, రైతు సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో జాప్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రశ్నించే గొంతుకగా గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో జోష్ పెరుగుతోంది.

రైతు ధర్నాతో ఎల్లారెడ్డిలో రాజుకున్న రాజకీయ వేడి

యూరియా కోసం రైతులు చేపట్టిన ధర్నాలు ఎల్లారెడ్డిలో రాజకీయ వేడి రాజేశాయి. యాప్ ద్వారా యూరియా పంపిణీ విఫలమవడంతో రైతులు రోడ్డెక్కారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలచుకుని ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. దీంతో ఇప్పటివరకు ఏకపక్షంగా ఉన్న రాజకీయం ఒక్కసారిగా పోటాపోటీగా మారింది.

ఎంట్రీకి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ప్రయత్నాలు

ఎమ్మెల్యే మదన్ మోహన్, మాజీ ఎమ్మెల్యే సురేందర్ మధ్య పోరు జరుగుతుండగానే మరో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఎంట్రీకి ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం బాన్సువాడ నియోజకవర్గంలో తన మార్క్ చూపించిన ఆయన మళ్లీ ఎల్లారెడ్డి నియోజకవర్గంపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో తన క్యాడర్‌ను క్రియాశీలం చేస్తూ పర్యటనలు ముమ్మరం చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. సామాజిక సమీకరణలతో పాటు అభివృద్ధి నినాదాన్ని అందుకుని ఇద్దరి నేతలకు చెక్ పెట్టే వ్యూహంలో ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

హీటెక్కుతున్న రాజకీయం

మొత్తంగా మొన్నటి వరకు ఏకపక్షంగా కనిపించిన ఎల్లారెడ్డి రాజకీయం ఇప్పుడు త్రిముఖ పోటీ దిశగా సాగుతోంది. దాంతో ఎల్లారెడ్డిలో రాజకీయం హీటెక్కుతోంది. గత పదేళ్ల క్రితం నాటి రోజులు మళ్లీ వస్తాయా అనే చర్చ సాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ ముగ్గురు నేతల వ్యూహాలు, ప్రజల నాడి ఎటువైపు ఉంటుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది.

Next Story