ఈ దూకుడుకు.. సాటెవ్వరూ.. పోలీస్ బాస్ దూకుడుతో ఖాకీల్లో కలవరం

by Bhanu |   (  Updated:2025-04-27 12:05:42  IST  )

పోలీస్ బాస్‌గా రాజేష్ చంద్ర బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

ఈ దూకుడుకు.. సాటెవ్వరూ.. పోలీస్ బాస్ దూకుడుతో ఖాకీల్లో కలవరం
X

దిశ, కామారెడ్డి :పోలీస్ బాస్ గా రాజేష్ చంద్ర బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నిత్యం ఎక్కడో ఓ చోట ఆకస్మిక తనిఖీలు చేస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న హోం గార్డు నుంచి ఎస్సైల వరకు సస్పెన్షన్లు చేస్తూ విధుల్లో అలసత్వం వహిస్తున్న వారి గుండెల్లో హడలెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు తాడ్వాయి, రామారెడ్డి ఎస్సైలతో పాటు కానిస్టేబుల్, హోం గార్డులను సస్పెండ్ చేసి తన మార్కును చాటుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సూటిగానే మెసేజ్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ కు వివిధ కారణాలతో వచ్చే ఫిర్యాదు దారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఫిర్యాదులను స్వీకరించడంతో అలక్ష్యం చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెప్పినట్లుగానే చేస్తూ పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. విధి నిర్వహణలో ఎంతటి వారైనా సహించేది లేదంటూ అంటూ హెచ్చరికలు చేస్తూ దూసుకుపోతున్నారు.

శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆయన చేపడుతున్న చర్యలు సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థలో జరుగుతున్న తప్పిదాలు, అవినీతి, అక్రమాల విషయంలో మాత్రం ఎస్పీ రాజేష్ చంద్ర పోలీసు అధికారులను కూడా ఉపేక్షించడం లేదు. ఆయన బాధ్యతలు స్వీకరించిన పదిహేను రోజుల్లో ఇద్దరు ఎసైలతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడంతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను జిల్లా కార్యాలయానికి అటాచ్ చేశారు. తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లును రామారెడ్డి ఎస్సై నరేష్ లను సస్పెన్షన్ చేశారు. పదవ తరగతి పరీక్షల ప్రశ్నలు బయటకు లీక్ కాగా వాటిని ఎస్పీ సమర్థవంతంగా కట్టడి చేశారు. దారి తప్పిన పోలీసులను సక్రమ మార్గంలో నడిపేందుకు దేనికీ వెనుకాడడం లేదు. అలాగే సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని ప్రోత్సహిస్తూ వారికి రివార్డులు అందజేస్తూ తన మార్కును చాటుకుంటున్నారు.

Next Story