- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫార్మా కంపెనీ పబ్లిక్ హియరింగ్.. వేడెక్కిన రాజకీయం
పార్టీలకు అతీతంగా కలసి మెలసి తిరిగిన ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.

దిశ, భిక్కనూరు : పార్టీలకు అతీతంగా కలసి మెలసి తిరిగిన ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలతో మొదలైన రాజకీయ విభేదాలు.. మొన్న జరిగిన ఫార్మా కంపెనీ పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంతో అంతర్గతంగా నెలకొన్న కక్షలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. అవి చిలికి చిలికి గాలి వానలా మారి పరస్పర విమర్శలు చేసుకుంటూ ఒక పార్టీపై మరొక పార్టీ నేతలు పోలీస్ స్టేషన్ల కు వెళ్లి ఫిర్యాదులు చేసుకునేదాకా వెళ్లాయి. దీంతో రాజకీయాలు మరింత కాకా పుట్టించాయి. సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నేత బోండ్ల సునీల్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని పేర్కొంటూ.. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి మొదలైన ఫిర్యాదుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకుంటూ, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.
ఒకరిపై మరొకరు బురద..
అంతేకాకుండా పాతవన్ని తవ్వుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం భిక్కనూరు పట్టణ శివారులో ఫ్యూజన్ హెల్త్ కేర్ ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వాయిస్ వినిపిస్తున్న సమయంలో ఒకరిపై మరొకరు బురద జల్లుకున్నారు. కొందరు నాయకులు అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని అధికార పార్టీ నేతలు కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అధికార పార్టీకి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, మాజీ సర్పంచ్ తునికి వేణు, మాజీ ఉపసర్పంచ్ బోడ నరేష్, బిజెపి పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఉప్పరి రమేష్ లతోపాటు కనబడిన బిజెపి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను పరుష పదజాలంతో దూషిస్తూ గొడవకు దిగాడు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు తారస్థాయిలో గొడవకు దిగిన నేతలను అడ్డుకొని ఎక్కడివారిని అక్కడ పక్కకు తోసేసి అప్పటి మట్టుకు అక్కడ గొడవ చల్లారేలా చేశారు. మరుసటి రోజు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ని దూషించిన కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు భీమ్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని మండల పార్టీ బిజెపి అధ్యక్షులు ఉప్పరి రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి డిమాండ్ చేశారు.
వికలాంగుడని కూడా చూడకుండా..
అంతటితో ఊరుకోకుండా వికలాంగుడైన అరిగె నర్సింహులు ను వికలాంగుడని కూడా చూడకుండా దూషించాడని ఆరోపిస్తూ అదే రోజు బిజెపి నాయకులు పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ చేశారు. ఇది జరిగిన మరుసటి రోజు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి నేను ఎవరిని దూషించలేదని ప్రకటించారు. ఫార్మా కంపెనీ కి బీజం పడింది మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పీరియడ్ లోనే అంటూ వ్యాఖ్యలు చేశాడు. పబ్లిక్ హియరింగ్ రోజున చేసిన వ్యాఖ్యలను, నిన్నటి చేసిన ఆరోపణలను పరిగణలోనికి తీసుకొని బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గంపపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ తాజాగా శనివారం భిక్కనూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి పై పార్టీ సీనియర్ నాయకులు అందె మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ తునికి వేణు, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అత్తెలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ని నేతలు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ విధంగా ఒకరిపై మరొకరు పరస్పర ఫిర్యాదులు చేసుకుంటూ పట్టణంలో రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు. ఫార్మా కంపెనీ ఇష్యూ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రధాన రాజకీయ పక్షాల నేతలు, డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్త మవుతున్నాయి.






