- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాబోయే మున్సిపల్ ఎన్నికలపై వ్యూహ రచనలో పార్టీలు
ముచ్చటగా మూడు విడతల్లో జరిగిన స్థానిక సమరం ముగిసింది. ఇకపై మిగిలినవి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ముచ్చటగా మూడు విడతల్లో జరిగిన స్థానిక సమరం ముగిసింది. ఇకపై మిగిలినవి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు. అన్ని రాజకీయ పార్టీలు ఇకపై ఆ ఎన్నికలపై దృష్టి సారించాయి. స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో సాధించిన ఫలితాలను బట్టి రాజకీయ పార్టీలు తమ బలాబలాలను గుర్తించాయి. ఎక్కడ బలంగా ఉన్నామో, ఎక్కడ బలహీనంగా ఉన్నామో తెలుసుకున్నాయి. బలపడటానికి ఏం చేయాలో స్థానిక ఎన్నికలు దిశానిర్దేశాన్ని చేశాయి.
పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో జరగకపోయినా, పార్టీలు బలపరిచిన అభ్యర్థులతో జరిగాయి. పార్టీ గుర్తులు లేకపోయినా పార్టీల పేరు చెప్పుకునే ఎన్నికల బరిలో ప్రచారం చేసుకున్నారు. ప్రజామోదంతో గెలిచారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు, మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు లోపాలు సరిదిద్దుకునే అంశంపై దృష్టి సారించారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు, తమ పార్టీలను బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్‌నికలకు ముందే మున్సిపల్ ఎలక్షన్స్ జరిపించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అధికార పార్టీ నుండి పార్టీ నేతలకు సమాచారం కూడా వచ్చిందని, పార్టీలో లోపాలను సరిదిద్దుకుని ఎన్నికలకు సంసిద్ధం కావాలని సూచనలు అందాయని సమాచారం. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే లోపు పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసే దిశగా అధికార పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఇందూరు బల్దియాపై బీజేపీ ఫోకస్..
మున్సిపల్ కార్పొరేషన్ పై ఈ సారి కచ్చితంగా కాషాయం జెండా ఎగరేయాలనే పట్టుదలతో కమల దళం కంకణం కట్టుకుంది. ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎట్టిపరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడం ఒక్కటే లక్ష్యంగా పని చేస్తున్నారు. తన అనుచరులను ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం సైనికుల్లా తయారు చేశారు. స్థానిక సంస్థలపై అంతగా దృష్టి సారించకపోయినా, ఇందూరు బల్దియాపైనే తన ఫోకస్ అంతా నిలిపారు. గత ఎన్నికల్లో మిగతా పార్టీల కన్నా అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా బీజేపీ రికార్డు సాధించినప్పటికీ మేయర్ పీఠాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్‌ని బీఆర్ఎస్ హైజాక్ చేసింది.
హిందుత్వ బలంతో బలపడిన బీజేపీ..
నిజామాబాద్ నగరంలో మోదీ మేనియాతో పాటు హిందుత్వ నినాదం జనాల హృదయాల్లోకి చొచ్చుకుపోయింది బీజేపీ నగరంలో బాగా బలపడింది. బీజేపీ ఎంపీ అర్వింద్ ఛరిష్మా కూడా నగరంలోని బీజేపీ బలం పుంజుకోవడానికి తోడైంది. అర్బన్ ఎమ్మెల్యే సీటు ను కూడా బీజేపీ గెలుచుకునేంతగా పార్టీ బలపడటంతో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠం తమదేననే బీజేపీ భావిస్తోంది. బీజేపీని ఆరాధించే యువత, జనం రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇది బీజేపీ కి ఈసారి కూడా అనుకూలించే అంశమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఎన్నికల్లో బీజేపీకి 27 సీట్లు..
గత ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 60 వార్డులకు గాను బీజేపీ 27 స్థానాలు, ఎంఐఎం 16 స్థానాలు, బీఆర్ఎస్ 14 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థి ఒక్క స్థానాన్ని 1 గెలుచుకున్నారు. ఎంపీ అర్వింద్ ధర్మపురి ఛరిష్మాతో పాటు బీజేపీ హిందుత్వ నినాదం బలపడిన ఇందూరు ప్రజలు బీజేపీని ఆదరించి అత్యధిక సీట్లను కట్టబెట్టారు. అప్పటి ఎన్నికల్లో 27 స్థానాలు గెలిచి బీజేపీ ప్రథమ స్థానంలో నిలవగా, అధికార బీఆర్ఎస్ పార్టీ 14 స్థానాలతో మూడో స్థానంలో నిలిచి పరువు పోగొట్టుకుంది. ఎంఐఎం పార్టీ 16 స్థానాలతో రెండో స్థానంలో నిలిచి బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి కూడా గట్టి షాక్ ఇచ్చింది.
ఇందూరులో తన పట్టు పై సగర్వంగా చాటింది. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచి తన దీన స్థితిని చాటుకుంది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలకు బీఆర్ఎస్ ఎంఐఎంతో జత కలిసి గండి కొట్టింది. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే కాకుండా డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎంకు కట్టబెట్టింది. కొందరు బీజేపీ కార్పొరేటర్లకు గాలం వేసి బీఆర్ఎస్‌లో కలుపుకుంది.
గతం రిపీట్ కాకుండా పకడ్బందీగా వ్యూహాలకు పదును..
త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్‌నికల్లో గతంలో ఎదురైన పరిస్థితులు ఎదురవకుండా, మేయర్ పీఠాన్ని దక్కించుకునే భారీ మెజారిటీ సీట్లు దక్కించుకునేలా ఎంపీ అర్వింద్ ధర్మపురి వ్యూహ రచన చేస్తున్నారు. ప్రతిసారీ ఆయన ఈ సారి ఇందూరు బల్దియాపై కాషాయ జెండా ఎగరేస్తామని ధీమాగా చెబుతున్నారు. ఈ సారి బీజేపీ ఎవరికీ అవకాశం ఇవ్వదని, బీజేపీనే ఇందూరు బల్దియాను భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటుందని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఆ మేరకు అర్వింద్ గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఒంటి చేత్తో మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకునే దిశలో ప్రయత్నాలు మొదలెట్టారు.
ఎన్నికలెప్పుడు వచ్చినా గెలిచేది తామే..
మున్సిపోల్స్ ఎప్పుడొచ్చినా గెలిచేది తామేనని, మేయర్ పీఠాన్ని దక్కించుకునేది తామేనని బీజేపీ తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లు కూడా ఘంటాపథంగా చెపుతున్నాయి. మున్పిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు వేటికవే తమ తమ సత్తా చాటుకోవడానికి సమాయత్తం అవుతున్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడగానే పార్టీలు అభ్యర్‌థుల ఎంపికకు ఖరారు చేస్తాయి. పార్టీ అభ్యర్‌థులను గెలిపించేందుకు ఇంచార్జిలు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు.
బీజేపీకి ఎంఐఎం ప్రధాన శత్రువు
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే బీజేపీ బలంగా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ అర్బన్ లో గతం కన్నా పుంజుకుంది. బీఆర్ఎస్ మాత్రం రాష్ట్రంలో పార్‌టీ అధికారాన్ని కోల్పోవడంతో గతం కన్నా బాగా బలహీన పడింది. పైకి బలంగా ఉన్నట్లు కనిపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ లోపల మాత్రం బలహీనంగానే ఉన్నట్లు పార్టీ నేతలే చెపుతున్నారు. బీజేపీ కి ఈ సారి ఎంఐఎం తో పాటు బలపడిన కాంగ్రెస్ తో కూడా పోటీ తప్పని పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇందూరు బల్దియాపై బీజేపీ కాషాయ జెండా ఎగరేయాలంటే గతం కన్నా ఎక్కువగా చెమటోడ్చాల్సిందే.
ప్రతి అంశం కీలకమే కాబోతుంది. అభ్‌యర్థుల ఎంపిక నుండి, పార్టీలో అంతర్గత విభేధాల సమస్యను పరిష్కరించుకోవడం, వర్గాల సమస్యకు చెక్ పెట్టడంతో పాటు సీనియర్, జూనియర్ నేతలు పరస్పరం సహకరించుకోవడం, ఆపరేషన్ ఇందూరు మేయర్ కోసం సమన్వయంతో పని చేసే కల్చర్ ను ఇప్పటి నుండే అలవాటు చేసుకోవడం ప్రధానంగా చేయాల్సిన పని అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






