- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలక పాత్ర పోషించాలి : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పల్లెల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు,

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పల్లెల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. బోధన్ పట్టణంలోని లయన్స్ భవన్ లో బుధవారం బోధన్ నియోజకవర్గ స్థాయి పంచాయతీ కార్యదర్శుల పనితీరు, విధులు, బాధ్యతల నిర్వహణపై సమీక్షా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా.. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సబ్ కలెక్టర్ వికాస్ మహతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పల్లెల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పల్లెల ప్రగతి కోసం పంచాయతీ కార్యదర్శులు అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, గ్రామ పంచాయతీకి సరిపడా నిధులు సమకూర్చుకున్నప్పుడే ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. సుదీర్ఘ కాలం నుంచి పన్నులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేసి, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్చి నెలాఖరు నాటికి అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో నూటికి నూరు శాతం పన్ను వసూళ్లు జరగాలని అన్నారు. పన్ను వసూళ్లలో వెనుకబడి ఉన్న గ్రామ పంచాయతీల కార్యదర్శులకు నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని డీ.పీ.ఓ ను ఆదేశించారు. సుదీర్ఘ కాలం నుంచి ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న వారికి స్థాన చలనాలు కల్పిస్తూ, పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని సూచించారు. పనితీరు సక్రమంగా లేని వారిని ఎంతమాత్రం ఉపేక్షించకూడదని అన్నారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్ధవంతంగా, బాధ్యతాయుతంగా సేవలు అందించాలని సూచించారు.
ప్రతి పల్లెలో స్పష్టమైన మార్పు కనిపించేలా కార్యదర్శులు పని చేయాలన్నారు. ప్రజలకు కనీస మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. ముఖ్యంగా వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, మురుగు కాల్వలు క్రమం తప్పకుండా శుభ్రం చేయించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రతతో కూడిన ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా పచ్చదనాన్ని పెంపొందించాలని, ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు పాటుపడాలని హితవు పలికారు. క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ, అందరితో సమన్వయాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చొరవ చూపాలని, పల్లెల సమగ్ర అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుని తదనుగుణంగా కార్యాచరణతో ముందుకెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. సకాలంలో అనుమతులు మంజూరు చేస్తూ, ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, సమీక్షా సమావేశానికి గైర్హాజరైన కార్యదర్శుల గురించి వాకబు చేశారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా సమీక్షకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని డీపీఓ ను ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు వంద శాతం పన్ను వసూళ్లు జరగాలని స్పష్టం చేశారు. పన్ను వసూళ్ల వివరాలను వెంటనే ఆన్ లైన్ లో పొందుపర్చాలని అన్నారు. పన్ను వసూళ్ల ప్రగతిని తాను స్వయంగా సమీక్షిస్తానని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, బోధన్ డీఎల్పీఓ నాగరాజు, ఆయా మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.






