టీనేజీలో వ్యసనాలను జయిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేదిస్తారు : డాక్ట‌ర్ ర‌మ‌ణ

by Nallavelli.Anjaneyulu |

దిశ, కామారెడ్డి : టీనేజీ వయసులో విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనవుతారని, ఈ వయసులో వచ్చే అవరోధాలను జయిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేదించగలుగుతారని జిల్లా మానసిక వైద్యాధికారి డాక్టర్ రమణ అన్నారు.

టీనేజీలో వ్యసనాలను జయిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేదిస్తారు :  డాక్ట‌ర్ ర‌మ‌ణ
X

దిశ, కామారెడ్డి : టీనేజీ వయసులో విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనవుతారని, ఈ వయసులో వచ్చే అవరోధాలను జయిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేదించగలుగుతారని జిల్లా మానసిక వైద్యాధికారి డాక్టర్ రమణ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఆరోగ్య శాఖ, ఎక్సైజ్, పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిరోధకం, మానసిక సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఏర్పర‌చుకొని పట్టుదలతో, ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాలు తీసుకోవడం ద్వారా మానసిక సమస్యలకు గురవుతారన్నారు. సమాజంలో మత్తుపదార్థాలకు బానిసైన, మానసిక సమస్యలకు గురైనా తప్పకుండా తమను సంప్రదించాలని తెలిపారు.


అనంతరం ఎక్సైజ్ సీఐ సంపత్ మాట్లాడుతూ... మత్తుపదార్థాలు వినియోగించే విద్యార్థులు, యువతపై చట్టపరంగా తీసుకునే కఠిన చర్యలపై వివరించారు. ఎవరైనా మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తులు తారసపడితే తమను తప్పనిసరిగా సంప్రదించాలని సూచించారు. సిడబ్ల్యుసి మెంబర్ స్వర్ణలత 18 సంవత్సరాల లోబడి ఉన్న విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై ఏ క్షణంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారో తమ దృష్టికి వస్తున్నాయని, చట్టం ఎవరిని ఉపేక్షించదని తెలిపారు. మత్తులో టీనేజీ పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ఫోక్సో కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. సైకియాట్రిక్ సోషల్ వర్కర్ డా.రాహుల్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు వారికి గానీ, వారి చుట్టుపక్కల వారికి కానీ ఎటువంటి మానసిక సమస్యలేదురైనా ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ టెలి మానస్ 14416 ను, మత్తుపదార్థాల వినియోగం పై సమాచారం తెలిస్తే 14446 ని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఇర్ఫానా తో పాటు అధ్యాపక, ఆరోగ్య, పోలీసు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. అంతకు ముందు కళాజాత బృందం సభ్యులు రామంచ తిరుపతి పాటల రూపంలో మత్తుపదార్థాల వినియోగం వల్ల ఏ విధంగా నష్టపోతారో విద్యార్థులకు వివరించారు.

Next Story