అభివృద్ధిని అడ్డుకోవడమే బీజేపీ నైజం...

by Taduka Kalyani |

కామారెడ్డి పట్టణాభివృద్ధిని పక్కనపెట్టి సర్వసభ్య సమావేశంలో దౌర్జన్యానికి దిగడమే లక్ష్యంగా బీజేపీ కౌన్సిలర్లు వ్యవహరిస్తున్నారని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి తీవ్రంగా మండిపడ్డారు.

అభివృద్ధిని అడ్డుకోవడమే బీజేపీ నైజం...
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణాభివృద్ధిని పక్కనపెట్టి సర్వసభ్య సమావేశంలో దౌర్జన్యానికి దిగడమే లక్ష్యంగా బీజేపీ కౌన్సిలర్లు వ్యవహరిస్తున్నారని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి తీవ్రంగా మండిపడ్డారు. గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లతో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఏకాభిప్రాయంతో రూపొందించిన ఎజెండా

పట్టణ ప్రగతియే ధ్యేయంగా, పార్టీలకు అతీతంగా కామారెడ్డిలోని 49 వార్డులకు నిధులు కేటాయిస్తూ 35 అంశాలతో ప్రజానుకూల ఎజెండాను రూపొందించినట్లు చైర్‌పర్సన్ తెలిపారు. అన్ని పార్టీలతో చర్చించి సమన్యాయంతో ఎజెండా తయారు చేసినప్పటికీ, బీజేపీ కౌన్సిలర్లు దాన్ని అంగీకరించకుండా గందరగోళం సృష్టించారని ఆరోపించారు.

భౌతిక దాడులు, రసాబస సృష్టి

సమావేశం ప్రారంభం కాకముందే బీజేపీ కౌన్సిలర్లు హంగామా సృష్టించారని ఆమె విమర్శించారు. ఎజెండా ప్రతులను చించివేయడం, మైకులను విసిరేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని చెప్పారు. "ఒక మహిళా చైర్‌పర్సన్ అని కూడా చూడకుండా పోడియం మీదికి వచ్చి దౌర్జన్యం చేయడం వారి అహంకారానికి, మూర్ఖత్వానికి నిదర్శనం" అని మండిపడ్డారు.

అభివృద్ధికి మోకాలడ్డుతున్న బీజేపీ

"ప్రజల కోసం పనిచేస్తాం" అని ప్రగల్భాలు పలికే బీజేపీ నాయకులు ప్రతి సమావేశాన్ని కావాలనే రసాబస చేస్తూ అభివృద్ధికి మోకాలడ్డుతున్నారని చైర్‌పర్సన్ ఆరోపించారు. సమావేశం జరగకుండా గొడవలు చేయాలనే ఏకైక ఎజెండాతో బీజేపీ సభ్యులు వచ్చారని విచారం వ్యక్తం చేశారు. కామారెడ్డి ప్రజల సంక్షేమం కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా కాంగ్రెస్ పాలకవర్గం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా బీజేపీ సభ్యులు తమ మూర్ఖత్వపు మనస్తత్వాన్ని విడనాడి, రాబోయే సమావేశాల్లోనైనా పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు షేరు, మహేష్, మోతీలాల్, బబ్లూ, జావేద్, తహసీనున్నిసా, గంగాధర్, వనిత, లలిత, సావిత్రి, లావణ్య, సుల్తానా, సుల్తానా బేగం, అంజాద్, ఫాతిమా, అఖిల, నాగమణి, వాజీద్, రాజమణి, సుల్తానా అన్వర్, సునీత, అలీ బిన్ అబ్దుల్లా, అస్మా తదితరులు పాల్గొన్నారు.

Next Story