విద్యార్థుల‌కు ఇబ్బందులు లేకుండా వ‌స‌తులుండాలి : క‌లెక్ట‌ర్ ఇలా త్రిపాఠి

by Ratna Kumari |

డొంకేశ్వర్ మండలం నూత్ పల్లి గ్రామంలోని మహాత్మాజ్యోతిబాఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు.

విద్యార్థుల‌కు ఇబ్బందులు లేకుండా వ‌స‌తులుండాలి : క‌లెక్ట‌ర్ ఇలా త్రిపాఠి
X

దిశ, డొంకేశ్వర్ : డొంకేశ్వర్ మండలం నూత్ పల్లి గ్రామంలోని మహాత్మాజ్యోతిబాఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కలెక్టర్ పాఠశాలను సందర్శించి స్టోర్ రూం, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ, తరగతి గదులు తదితర వాటిని పరిశీలించారు. మెను ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు. పాఠశాలలో మౌలిక వసతులు, అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి ఆరా తీశారు. స్థానికంగా విద్యార్థులకు పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ పాఠశాలను ఆర్మూర్ పట్టణానికి తరలించే ప్రతిపాదనకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా ఆమోదం ఉందని నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో కలెక్టర్ ఆర్మూర్ పట్టణంలోని ప్రతిపాదిత భవనాన్ని సైతం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలన చేశారు. ప్రస్తుతం నూత్ పల్లిలో ఉన్న భవనం కంటే ఇది సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలుపగా, అవసరమైన మరమ్మతులు జరిపించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఆర్మూర్ లోని నూతన భవనంలో పాఠశాలను మారుస్తున్న విషయం గురించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేస్తూ, వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తి స్థాయిలో ప్రవేశాలు జరిగేలా చొరవ చూపాలని అన్నారు. అంతకుముందు కలెక్టర్ 5వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో భేటీ అయ్యారు. ఆంగ్లం, గణితం, తెలుగు సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి, విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేశారు. చక్కగా సమాధానాలు చెప్పిన విద్యార్థులకు బహుమతులు, చాక్లెట్లు అందించారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటోందా? అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. చక్కగా చదువుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ఆర్.సీ.ఓ సత్యనాథ్ రెడ్డి, ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Next Story