- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సహకార పదవులకు.. ‘నామినేటెడ్’ జోష్!
గత రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఏసీఎస్ సహకార పదవుల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సహకార రంగ చరిత్రలోనే ప్రప్రథమంగా ఎన్నికలు లేకుండా ‘నామినేటెడ్’ పద్ధతిలోనే పాలకవర్గాలను భర్తీ చేయాలని నిర్ణయించింది.

గత రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఏసీఎస్ సహకార పదవుల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సహకార రంగ చరిత్రలోనే ప్రప్రథమంగా ఎన్నికలు లేకుండా ‘నామినేటెడ్’ పద్ధతిలోనే పాలకవర్గాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 144 సంఘాల్లో ఒకేసారి 1,872 డైరెక్టర్ పదవులు భర్తీ కానుండడంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది. పదవుల కోసం ఆశావహులు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ, హైదరాబాద్ స్థాయిలోనే పైరవీలు చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినా పదవులు దక్కలేదన్న క్యాడర్ అసంతృప్తిని చల్లార్చేందుకే అధిష్టానం ఈ వ్యూహాత్మక అడుగు వేసింది. రైతులతో ప్రత్యక్ష సంబంధాలుండే ఈ కీలక పదవుల ద్వారా రానున్న ఎన్నికల్లో గ్రామస్థాయిలో పార్టీ పట్టు పెంచాలని కాంగ్రెస్ భావిస్తోంది.
- దిశ, కామారెడ్డి
దిశ, కామారెడ్డి : రాష్ట్రంలో గత రెండున్నర ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సహకార పదవుల భర్తీకి ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్నాళ్లూ ఎన్నికలు జరుగుతాయా? లేక నామినేషన్ పద్ధతి ఉంటుందా? అనే సందిగ్ధతకు తెరదించుతూ తొలిసారిగా నామినేటెడ్ విధానంలోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాలను నియమించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక్కసారిగా కోలాహలం మొదలైంది. ప్రభుత్వ నిర్ణయంతో పీఏసీఎస్ పరిధిలో పదవుల వేట ఊపందుకోగా, గ్రామ స్థాయి నుంచి ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు.
భారీగా పదవులు.. శ్రేణుల్లో ఉత్సాహం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో తమకు తగిన గుర్తింపు, పదవులు దక్కలేదన్న అసంతృప్తి కార్యకర్తల్లో బలంగా ఉండేది. ఇప్పుడు భారీ సంఖ్యలో సహకార పదవులను ఒకేసారి భర్తీ చేయనుండడంతో ఆ అసంతృప్తులు తొలగిపోనున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 144 పీఏసీఎస్ సంఘాలు ఉండగా, వాటి పరిధిలో ఏకంగా 1872 డైరెక్టర్ పదవులు ఉన్నాయి. ఇందులో నిజామాబాద్ జిల్లాలో 89, కామారెడ్డి జిల్లాలో 55 సంఘాలు ఉన్నాయి. ఒక్కో పీఏసీఎస్‌కు చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు 11మంది డైరెక్టర్లతో కలిపి మొత్తం 13మందితో కూడిన పాలకవర్గం కొలువుదీరనుంది. ఇంత పెద్దఎత్తున పదవులు అందుబాటులోకి రావడంతో ఆశావహులు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండేలా హైదరాబాద్ స్థాయిలోనే పైరవీలు సాగిస్తున్నారు.
న్యాయపోరాటం - కేబినెట్ కీలక నిర్ణయం...
గత ఏడాది డిసెంబర్ 19న ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలోని డీసీసీ బ్యాంక్, పీఏసీఎస్ పాలకవర్గాలను రద్దు చేస్తూ అధికారులను పర్సన్ ఇన్చార్జిలుగా నియమించింది. అయితే దీనిపై పాత పాలకవర్గాలు కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం నుంచి సానుకూల తీర్పు రావడంతో వారు మళ్లీ పదవుల్లో కొనసాగారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మార్చిలో జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రత్యేక జీవో ద్వారా నామినేటెడ్ పద్ధతిలోనే కొత్త కమిటీలను భర్తీ చేయాలని వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఇప్పుడు నియామకాల ప్రక్రియ శరవేగంగా కొలిక్కి వస్తోంది.
ఎన్నికల వ్యూహం.. విధేయులకే పీఠం...
రైతులకు రుణాలు, ఎరువుల పంపిణీ, రైతు మేళాలు వంటి కీలక వ్యవసాయాధారిత అంశాలన్నీ పీఏసీఎస్‌ల ద్వారానే సాగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పదవులు పొందితే పట్టుతోపాటు రాజకీయ పలుకుబడి పెరుగుతుందనేది నేతల నమ్మకం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో గ్రామస్థాయిలో పార్టీ క్యాడర్‌ను యాక్టివ్ చేసేందుకు అధిష్టానం ఈ పదవులను అస్త్రంగా వాడుతోంది. రైతులతో నిరంతరం ప్రత్యక్ష సంబంధాలు ఉండే ఈ పోస్టుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. పీఏసీఎస్‌లతోపాటు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీబీ) చైర్మన్ పదవిని కూడా నామినేటెడ్ పద్ధతిలోనే భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. కాగా, అధికారులు మాత్రం అధికారిక ఆదేశాల కోసం వేచి చూస్తున్నారు.






