పలు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. రైతుల ఆందోళన

by velandi.Saikiran |

భిక్కనూరు మండలంలో డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది, దీంతో పలు బంకులు మూతపడ్డాయి.

పలు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. రైతుల ఆందోళన
X

డీజిల్ షార్టేజ్..

అన్నదాతల గోస!

పలు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. రైతుల ఆందోళన

అడ్వాన్స్ చెల్లించినా సప్లై చేయని ఆయిల్ కంపెనీలు

ధరల పెంపు కోసమే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా?

పంట కోతల సమయంలో డీజిల్ దొరక్క వాహనదారుల ఇక్కట్లు

భిక్కనూరు మండలంలో డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది, దీంతో పలు బంకులు మూతపడ్డాయి. జాతీయ రహదారిపై ఉన్న బంకులు స్టాక్ లేక ‘నో స్టాక్’ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరి కోత యంత్రాలకు డీజిల్ అందక రైతులు పొలాల్లోనే నిరీక్షించాల్సి వస్తోంది. అడ్వాన్స్ డబ్బులు కట్టినా ఆయిల్ లోడ్లు పంపకుండా కంపెనీలు ఇబ్బంది పెడుతున్నాయి. ధరలు పెంచే కుట్రలో భాగంగానే కృత్రిమ కొరత సృష్టించారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ కోసం ప్రయాణికులు పొరుగు ప్రాంతాల బంకులకు పరుగులు తీస్తున్నారు. చర్లపల్లి, మల్లాపూర్ డిపోల నుంచి సరఫరా నిలిచిపోవడంతో అనిశ్చితి నెలకొన్నది. రవాణా వ్యవస్థ స్తంభించక ముందే ప్రభుత్వం ఆయిల్ కంపెనీలపై నిఘా పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

దిశ, భిక్కనూరు : అంతర్జాతీయ పరిణామాలు రాష్ట్రంలోని పెట్రోల్ బంకులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా, ఇరాన్, ఇరాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం గ్యాస్, డీజిల్, పెట్రోల్ రవాణాపై పడడంతో భిక్కనూరు మండలంలో డీజిల్ కొరత తీవ్రమైంది. వారం రోజుల కింద ప్రభుత్వం జోక్యంతో సర్దుమణిగిందని భావించిన ఈ సమస్య, గత నాలుగైదు రోజులుగా మళ్లీ మొదటికి రావడంతో వాహనదారులు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న పలు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమివ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

పంట కోతల సమయంలో తిప్పలు..

ప్రస్తుతం వరి పంట కోతల సమయం కావడంతో రైతన్నలకు డీజిల్ అవసరం ఎంతో ఉంది. కోత యంత్రాలు (హార్వెస్టర్లు), ట్రాక్టర్ల దున్నకాలకు డీజిల్ తప్పనిసరి కావడంతో, బంకుల్లో స్టాక్ లేకపోవడం వారిని కుంగదీస్తోంది. కొన్ని బంకుల్లో బోర్డులు తొలగించినప్పటికీ, లోపలికి వెళ్లిన వాహనదారులకు సిబ్బంది స్టాక్ లేదని చెబుతూ వెనక్కి పంపుతున్నారు. ఈ అనిశ్చితి వల్ల డీజిల్ కోసం మెదక్ జిల్లా రామాయంపేట లేదా కామారెడ్డి పట్టణం వరకు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సి వస్తోంది. పొలాల్లో యంత్రాలు ఆగిపోవడంతో ఎక్కడ వర్షాలు పడి పంట నష్టపోతామోనని రైతులు ప్రాణసంకటంలో ఉన్నారు. బంకు నిర్వాహకులు కూడా స్టాక్ విషయంలో గోప్యత పాటిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అడ్వాన్స్ కట్టినా అందని వైనం..

గతంలో ఆయిల్ కంపెనీలు ‘క్యాష్ అండ్ క్యారీ’ (నగదు చెల్లిస్తేనే స్టాక్) పద్ధతిని ప్రవేశపెట్టాయి. దీంతో బంకు నిర్వాహకులు ఐదు రోజుల కింద అడ్వాన్స్‌గా లక్షలాది రూపాయల నిధులు చెల్లించినా, ఇప్పటివరకు డీజిల్ లోడ్లు రాకపోవడం గమనార్హం. చర్లపల్లి, మల్లాపూర్ డిపోల వద్ద ఉన్న ఆయిల్ కంపెనీ అధికారులు కూడా సరఫరాపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. వాహనాలు వస్తాయా లేదా అన్న కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంతో బంకులను మూసివేయాల్సిన దుస్థితి నెలకొందని నిర్వాహకులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కొరత సాకుతో ఉద్దెర (క్రెడిట్) ఇవ్వడం కూడా ఆయిల్ కంపెనీలు నిలిపివేయడంతో చిన్న బంకులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.

ధరల పెంపు కోసమే డ్రామా?

కేంద్ర ప్రభుత్వం ధరల పెంపు ఉండదని ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆయిల్ కంపెనీలు కావాలనే స్టాక్‌ను నిలిపివేసి, ధరలు పెంచేందుకు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయా? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ధరలు పెరిగినప్పుడు లాభం పొందవచ్చనే ఉద్దేశంతో కంపెనీలు నిల్వలను బయటకు తీయడం లేదని ప్రచారం జరుగుతోంది. ఆయిల్ కంపెనీల డ్రామా వల్ల సామాన్య వాహనదారులు, రైతులు బలైపోతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రవాణా, వ్యవసాయ రంగం కుదేలు కాకముందే డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Next Story