- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైప్ క్రియేట్ చేస్తున్న నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సాధారణంగా నిన్న మొన్నటి వరకు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు హోరెత్తించాయి. మూడు విడతలుగా కొ

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సాధారణంగా నిన్న మొన్నటి వరకు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు హోరెత్తించాయి. మూడు విడతలుగా కొనసాగిన పంచాయతీ ఎన్నికలు ఈనెల 17న పూర్తైన విషయం తెలిసిందే. దీంతో నిజామాబాద్ జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ ఎన్నికలపై దృష్టి సారించారు. ప్రస్తుతం రామకృష్ణ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ కాలపరిమితి పూర్తవడవంతో ప్రెస్ క్లబ్ కు కొత్త కమిటీని ఎన్నుకోవడంపై దృష్టి సారించింది. ప్రస్తుత ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఈనెల 18 న సమావేశమై ప్రెస్ క్లబ్ సభ్యత్వం, జనరల్ బాడీ మీటింగ్, ఎలక్షన్స్ తదితర అంశాలపై కమిటీ చర్చించింది. ఇది వరకే ప్రెస్ క్లబ్ లో సభ్యులుగా ఉన్న కొందరి సభ్యత్వాలను రెన్యూవల్ చేయకుండా వివిధ కారణాలతో ప్రెస్ క్లబ్ కమిటీ రెన్యూవల్ చేయలేదు. 209 మంది సభ్యులను రెన్యూవల్ చేసిన లిస్టును కమిటీ ఫైనల్ చేసింది. ప్రెస్ క్లబ్ కమిటీ చేత రెన్యూవల్ కు అభ్యంతరాల సాకుతో నిరాకరించబడిన ఆయా జర్నలిస్టుల వివరాల లిస్టును ప్రెస్ క్లబ్ భవనం గోడ పై అతికించింది. అభ్యంతరాల లిస్టులో ఉన్న జర్నలిస్టులతో పాటు జమాల్ పూర్ గణేష్, నర్సింహాచారి వంటి పలువురు సీనియర్ జర్నలిస్టులు స్పందించి ప్రెస్ క్లబ్ కమిటీ బాధ్యులతో చర్చించి అభ్యంతరాల్లో ఉన్న జర్నలిస్టులందరి సభ్యత్వాలను రెన్యూవల్ చేయాలని కోరారు. దీనిపై చర్చించిన కమిటీ మెజారిటీ కార్యవర్గ సభ్యుల ఆమోదంతో అభ్యంతరాల లిస్టులో ఉన్న కొందరు సీనియర్లు, జర్నలిజం ఫీల్డులో ఉన్న వారి సభ్యత్వాలను తిరిగి రెన్యూవల్ చేయాలని కార్యవర్గం నిర్ణయించింది. మరో 50 మందికి పైగా సభ్యులను తిరిగి రెన్యూవల్ చేయడంతో ప్రెస్ క్లబ్ సభ్యత్వం 260 వరకు చేరకుంది.
జర్నలిస్టుల ప్రధాన సమస్య ఇళ్ల స్థలాలే
నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రస్తుతం 250 కి పైగా జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారు. జర్నలిస్టుల సంక్షేమం విషయంలో ప్రతి సారీ ఎన్నికైన కమిటీ ఎంతో కొంత చేస్తున్నప్పటికీ జర్నలిస్టుల ప్రధాన సమస్య, ప్రధాన డిమాండ్ ఇళ్ల స్థలాలను మాత్రం సాధించలేకపోతోంది. ప్రతి సారి కొత్తగా ఎన్నుకునే కమిటీపై జర్నలిస్టులంతా ఆశలు పెట్టుకోవడం, కమిటీ కాల పరిమితి పూర్తయినా ఇళ్ల స్థలాల పట్టాలు చేతికందకపోవడం రోటీన్ గా కొనసాగే తంతుగానే మిగిలిపోతోంది. ఒక రకంగా ఇళ్ల స్థలాల సమస్య ప్రతిసారి ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో హామీ గా ఉపయోగపడుతోందనే టాక్ కూడా ఉంది.
జర్నలిస్టులతో ఆడుకుంటున్న ప్రజాప్రతినిధులు..
ప్రజాప్రతినిధుల పర్యటనలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు రాస్తూ , మీడియాలో చూపిస్తూ వారిని ప్రజలకు దగ్గర చేసే జర్నలిస్టులను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే విషయంలో ప్రజాప్రతినిధులు జర్నలిస్టులతో ఆడుకుంటున్నారనే అభిప్రాయాలు మెజారిటీ జర్నలిస్టలు అభిప్రాయ పడుతున్నారు. జర్నలిస్టుల్లో ఉన్న అనైక్యతను సాకుగా తీసుకుని జర్నిలిస్టులను వర్గాలుగా చీల్చి దాటవేసే ధోరణితో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. నగరంలో అనుకూలమైన ప్రదేశంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చే అవకాశం, అందుబాటులో భూమి ఉన్నప్పటికీ అంతగా పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. స్థలాన్ని మీరే చూసి చెప్పండి.. అక్కడ స్థలాలిప్పిస్తామని ప్రజాప్రతినిధులు జర్నలిస్టు నాయకులతో చెప్పేకన్నా స్థలసేకరణ కోసం కలెక్టర్ ను ఆదేశిస్తే రోజుల వ్యవధిలో ఇళ్ల స్థలాలు జర్నలిస్టులకు అందే అవకాశం ఉన్నప్పటికీ, ఆ మేరకు ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదు. జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రెస్ క్లబ్ కమిటీ బాధ్యులకు కూడా ఈ విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నికల్లో వినిపిస్తున్న పేర్లు ఇవే..
ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఈ సారి పోటీ ఎక్కువగానే ఉండబోతోంది. అభ్యర్థులంతా దూకుడుగా వెళుతున్నారు. ఈనెల 30 న జరగబోయే ప్రెస్ క్లబ్ ఎన్నికల బరిలో ప్రస్తుత అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి బైర శేకర్ లు మళ్లీ అధ్యక్ష స్థానానికి గట్టిగా పోటీ పడనున్నారు. వీరిద్దరూ కూడా ఐజేయూ కు చెందిన వారు. వీరితో పాటు ఐజేయూ వర్గానికే చెందిన ధనుంజయ్ కూడా అధ్యక్ష స్థానానికి సీరియస్ గా ప్రిపేరయ్యారు. ఆయన ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని ఐజేయూ మద్ధతు కూడా పొందానని ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పోటీ చేసి సీనియర్, జూనియర్ స్టాఫర్, బీట్ రిపోర్టర్లనే తేడా లేకుండా జర్నలిస్టులందరితో కలివిడిగా ఉండే బిగ్ టీవీ స్టాఫ్ రిపోర్టర్ కత్తుల రాజేశ్ కూడా అధ్యక్ష బరిలో ఉన్నారు. ఈ పాటికే సైలెంట్ గా ఆయన తన ప్రచారాన్ని చేసుకుంటున్నారు. ఐజేయూ కే చెందిన మల్లెపూల నర్సయ్య కూడా అధ్యక్షుడిగా పోటీలో ఉన్నట్లు, ఐజేయూ మద్ధతు ఇవ్వకపోయినా రెబెల్ గా నైనా పోటీ చేస్తానని చెపుతున్నారు. 143 సంఘానికి చెందిన పంచరెడ్డి శ్రీకాంత్ పోటీలో ఉన్నారు. అదే సంఘానికి చెందిన ఇంజాపురం మధు కూడా పోటీ పడుతున్నారనే చర్చ జరుగుతోంది. వీరిలో పంచరెడ్డి శ్రీకాంత్ ఇండిపెండెంట్ గానే పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓటర్ల మద్ధుతు కూడగట్టుకునే ప్రయత్నాలు మొదలెట్టినట్లు జర్నలిస్టు వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. కార్యదర్శి స్‌థానానికి సుభాష్ వాఘ్మారే, ఐజేయూ కు చెందిన ప్రమోద్ గౌడ్ లు, క్యాషియర్ స్థానానికి ప్రస్తుత క్యాషియర్ సందీప్ తో పాటు సాక్షి ఫోటోగ్రాఫర్ రాజ్ కుమార్ లు పోటీ పడుతున్‌నారు. ఈ సారి జరిగే ఎన్నికల్లో చాలా మంది పోటీ పడుతున్నప్పటికీ కొందరి పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈసారి అధ్యక్ష, కార్యదర్శుల స్థానాలకు పోటీ పడే కొందరు రూ. లక్షల్లో ఖర్చు చేసేందకు మానసికంగా సిద్ధమైనట్లు సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఓటుకు నోటు కూడా భాగస్వామ్యం కాబోతున్నట్లు ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.






