- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతే లక్ష్యంగా దందా.. గంజాయి అమ్మకాల్లో నయా ట్రెండ్
కామారెడ్డి జిల్లా కేంద్రంగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి వాడకం పట్టణాల నుంచి పల్లెలకు కూడా పాకింది.

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి వాడకం పట్టణాల నుంచి పల్లెలకు కూడా పాకింది. యువతనే లక్ష్యంగా చేసుకున్న విక్రయదారులు సిగరెట్లలో నింపి విక్రయించడం అనే నయా ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. రైల్వే మార్గం, జాతీయ రహదారి 44 వంటి మార్గాలు ఉండడం వల్ల కామారెడ్డి గంజాయి విక్రయాలకు కేంద్ర బిందువుగా మారిందని తెలుస్తోంది. పాన్ షాపులు, ఇతర కిరాణా షాపుల ద్వారా ఈ దందా గుట్టుగా సాగుతోంది. ముఖ్యంగా రెగ్యులర్ కస్టమర్లకే విక్రయిస్తున్నారు. గంజాయికి అలవాటు పడుతున్న యువత తమ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటుండగా, తల్లిదండ్రుల అజమాయిషీ లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చుతోంది. గంజాయి దందా జోరుగా సాగుతున్నా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు నిఘా పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి, ఈ అక్రమ వ్యాపారంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గతంలో పట్టణాలకే పరిమితమైన గంజాయి వాసన నేడు పల్లెలకు పాకింది. యువతనే టార్గెట్‌గా చేసుకున్న గంజాయి విక్రయదారులు నయా ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. గతంలో గంజాయి ప్యాకెట్లుగా చేసి విక్రయించే వ్యాపారులు ప్రస్తుతం సిగరెట్లలోని పొగాకును తీసివేసి అందులో గంజాయిని నింపి యథేచ్చగా విక్రయిస్తున్నారు. ఇతర మార్గాల్లో గంజాయిని విక్రయిస్తే దొరికిపోతున్నామనే భావనతో విక్రయదారులు నయా ట్రెండ్‌ను సెట్ చేసి ఫాలో అవుతున్నారు. దీంతో వారి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. పట్టణాల్లోని పాన్ షాపులే వీరి అడ్డాలుగా మారినట్లుగా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
పల్లెలకు పాకిన గంజాయి వాసన
నిన్న మొన్నటి వరకు పట్టణాలకే పరిమితమైన గంజాయి వాసన నేడు పల్లెలకు విస్తరించింది. పల్లెల్లో కూడా వీరి వీరిగా గంజాయి లభ్యమవుతున్నట్లుగా సమాచారం. పట్టణాల్లో గంజాయికి అలవాటు పడిన కొంతమంది యువత దానిని పట్టణాల నుంచి పల్లెలకు తీసుకొచ్చి తోటి మిత్రులకు పరిచయం చేస్తూ ఈ ఊబిలోకి లాగుతున్నట్లు తెలుస్తోంది. పల్లెల్లో యువత చెడుదారుల్లోకి వెళ్లకముందే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు వాపోతున్నారు.
వ్యాపార కేంద్రంగా కామారెడ్డి
మునుపెన్నడూ లేని విధంగా కామారెడ్డి జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత గంజాయి విక్రయాలు వివిధ రకాలుగా జోరుగా సాగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. కామారెడ్డి మీదుగా రైల్వే మార్గంతోపాటు 44వ నెంబర్ జాతీయ రహదారి కూడా ఉండడం, కరీంనగర్-ఎల్లారెడ్డిని కలుపుతూ రోడ్డు ఉండడం, ఇక్కడి నుంచి మహారాష్ట్ర, బీదర్‌తోపాటు తదితర జిల్లాలకు వెళ్లే వీలు ఉంది. దీంతో కామారెడ్డి జిల్లా కేంద్రం గంజాయి విక్రయాలకు కేంద్ర బిందువుగా మారినట్లుగా తెలుస్తోంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు గంజాయి విక్రయదారులు తమ వ్యాపారాన్ని యథేచ్చగా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.
నయా ట్రెండ్‌ను సెట్ చేసిన వ్యాపారులు
అదేదో సినిమాలో అన్నట్లుగా ట్రెండును ఫాలో కాము కానీ సెట్ చేస్తాం.. అన్నట్లుగా గంజాయి విక్రయదారులు నయా ట్రెండ్ సెట్ చేశారు. గతంలో గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారుచేసి విక్రయించే వారు. కానీ ప్రస్తుతం సులువు మార్గాలను ఎంచుకున్నారు. సిగరెట్లలోని పొగాకును తొలగించి అందులో గంజాయిని నింపి విక్రయిస్తున్నారు. ఈ పద్ధతిపై ఎవరికి అనుమానం రాకపోవడంతో తమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. పాన్ షాపులు, ఇతర కిరాణా షాపులలో ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
రెగ్యులర్ కస్టమర్లకే
గంజాయి విక్రయదారులు ఒక నిబంధన పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గాను ఈ నిబంధన ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. రెగ్యులర్‌గా తమ వద్ద గంజాయి కొనుగోలు చేసే వారికి మాత్రమే ప్రత్యేకంగా తయారు చేసిన సిగరెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం. కొత్తవారు వస్తే వారికి అలాంటివేమి తమ వద్ద దొరకవని దాటవేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతిరోజు తమ షాపునకు వచ్చి ఎవరెవరు కొనుగోలు చేస్తారో వారికి మాత్రమే విక్రయిస్తూ తమ వ్యాపారాన్ని గుట్టుగా సాగిస్తున్నారు.
బానిసలుగా మారుతున్న యువత
ఇప్పటికే పలు రకాల మత్తు పానీయాలకు అలవాటు పడిన యువత మరో చెడు మార్గాన్ని కూడా ఎంచుకొని తమ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. గంజాయి నింపిన సిగిరెట్లను తాగుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దని ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా యువత పట్టించుకోవడం లేదు. వీరిపై తల్లిదండ్రుల ఆజమాయిషి కూడా లేకపోవడంతో మరింత చెడు మార్గాల్లో పయనిస్తున్నట్లుగా తెలుస్తోంది.
నిఘా వైఫల్యమేనా..?
గంజాయి దందా ఇటు పోలీసులకు, అటు ఎక్సైజ్ శాఖ అధికారులకు కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అనుమానాలు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ఈ దందాకు కళ్లెం వేయాల్సిన అధికారుల నిఘా వైఫల్యంతోనే ఈ వ్యాపారం జోరుగా సాగుతుందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ దందాపై నిఘావేసి కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.






