కన్నుల పండువగా నల్ల పోచమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభం

by Naveena |

ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ నల్ల పోచమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

కన్నుల పండువగా నల్ల పోచమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభం
X

దిశ : నాగిరెడ్డిపేట్ : ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ నల్ల పోచమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన శ్రీ నల్ల పోచమ్మ ఆలయం వద్ద మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు, భక్తి శ్రద్ధలతో, కన్నులపండువగా జరుగుతాయి. మొదటి రోజు ఆలయం చుట్టూ ఎడ్ల బండ్ల ప్రదర్శన, రెండవ రోజు బోనాల ఊరేగింపు, మూడవ రోజు రథోత్సవం కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి.

ఈ జాతర ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం నల్ల పోచమ్మ ఆలయం చుట్టూ నాగిరెడ్డిపేట, చీనూర్, వాడి, గోలిలింగాల్, మాల్తుమ్మెద, బంజారా తాండా, లింగంపల్లి, తదితర గ్రామాలకు చెందిన సుమారు 35 ఎడ్ల బండ్లను సుందరంగా అలంకరించి భాజా భజంత్రీలు, డప్పు చప్పుల మధ్య ఎడ్ల బండ్ల ప్రదర్శనను కన్నుల పండుగగా నిర్వహించారు. ఎడ్లబండ్ల ప్రదర్శనను తిలకించేందుకు మండల కేంద్ర ప్రజలతో పాటు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, మెదక్, హైదరాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. నల్ల పోచమ్మ ఆలయంలో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఎడ్లబండ్ల ప్రదర్శనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు తలెత్తకుండా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్, సిఐ రవీందర్, నాగిరెడ్డిపేట ఎస్ఐ మల్లారెడ్డి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల పోలీసు సిబ్బంది భారీ బందోబస్త్ నిర్వహించారు.

Next Story