లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నాగిరెడ్డిపేట తహశీల్దార్

by Ratna Kumari |

వారసత్వంగా వచ్చిన భూమిని వ్యక్తి పేరు పైకి మార్చేందుకు రూ. 50 వేలు లంచం డిమాండ్ చేసిన త‌హ‌శీల్దార్, ఆయన అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నాగిరెడ్డిపేట తహశీల్దార్
X

దిశ, నాగిరెడ్డిపేట్ : వారసత్వంగా వచ్చిన భూమిని వ్యక్తి పేరు పైకి మార్చేందుకు రూ. 50 వేలు లంచం డిమాండ్ చేసిన త‌హ‌శీల్దార్, ఆయన అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ జి.శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల తహశీల్దార్‌ యార్లగడ్డ శ్రీనివాసరావు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి సంబంధించిన వారసత్వంగా వచ్చిన ఎకరన్నర భూమిని తన పేరు పైకి మార్చాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ వారసత్వంగా వచ్చిన భూమిని బాధిత వ్యక్తి పేరు పైకి బదిలీ చేసేందుకు తహ‌శీల్దార్ శ్రీనివాస్ రావు రూ.50వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. రూ. 50 వేలు తహశీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ గా పనిచేస్తున్న తన అసిస్టెంట్ చీనూర్ అజయ్ అనే వ్యక్తి ద్వారా కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం లంచం డబ్బులను తీసుకుంటుండగా.. వలపన్ని వీరిద్దరిని పట్టుకున్నామ‌ని తెలిపారు.

తహశీల్ధార్ కార్యాలయంలో విచారణ చేపట్టామని, అలాగే హైదరాబాద్ లోని కూకట్ పల్లి లో ఉన్న తహశీల్ధార్ శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు జరుపుతున్నట్లు తెలిపారు. అవినీతికి పాల్పడిన తహాశీల్దార్ శ్రీనివాసరావు, ఆయన ప్రైవేట్ అసిస్టెంట్ అజయ్ లను అరెస్టు చేసి హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే, అధికారులు వేదింపులకు పాల్పడిన, లంచాలు డిమాండ్ చేసిన ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలని, ఏసీబీ అధికారుల టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే, వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐ లు వేణు కుమార్, నగేష్, సిబ్బంది ఉన్నారు.

Next Story