నిజామాబాద్‌లో మున్సిపల్ హీట్.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-12 03:40:56  IST  )

నిజామాబాద్ అర్బన్ లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. మున్సిపల్ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలో అలర్ట్ అయ్యాయి.

నిజామాబాద్‌లో మున్సిపల్ హీట్.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. మున్సిపల్ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలో అలర్ట్ అయ్యాయి. ఎవరికి వారు ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేసే పనిలో పడ్డారు. పార్టీ తరఫున ఏయే వార్డులు ఎవరికి రిజర్వ్ కానున్నాయో, రిజర్వేషన్ల ప్రకారం ముందుగానే ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇందూరు బల్దియాపై ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ జెండాను ఎగరేయాలనే పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి ఐదు కార్పొరేషన్ల చైర్మన్ పదవులను కట్టబెట్టారు. మానాల మోహన్ రెడ్డి, అనిల్ ఈరవత్రి, అన్వేష్ రెడ్డి, తాహెర్ బిన్ హందాన్ వంటి వారికి పదవులు కట్టబెట్టారు. దీనికి తోడు నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న షబ్బీర్ అలీ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు ప్రభుత్వ సలహాదారులుగా పదవులు కట్టబెట్టారు. ఇందూరు బల్దియాను గెలిపించే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి వీరందరి భుజస్కంధాలపై పెట్టే అవకాశాలున్నాయి. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ జిల్లాకే చెందిన వాడు కావడంతో ఇందూరు బల్దియాను గెలుచుకోవడం కాంగ్రెస్ పార్టీకే కాదు వ్యక్తిగతంగా, రాజకీయంగా మహేశ్ కుమార్, సుదర్శన్ రెడ్డిలకు చావో, రేవో లాంటిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిజామాబాద్ లోనే ఎక్కువ పర్యటనలు

ఈ మధ్య నిజామాబాద్ నగరంలో టీపీసీసీ చీఫ్‍ మహేశ్ కుమార్ గౌడ్ ఎక్కువగా పర్యటిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు జరుపుతూ మున్సిపల్ ఎన్నికల కోసం సమాయత్తం చేస్తున్నారు. వార్డుల వారీగా ఆశావహుల లిస్టును తయారు చేయించి వారి బలాలు, బలహీనతలపై సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో వార్డుకనీసం ముగ్గరు బలమైన అభ్యర్థులను గుర్తించి లిస్టు తయారు చేసినట్లు పార్టీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. నగరంలో బలంగా ఉన్న బీజేపీని ఎలా ధీటుగా ఎదుర్కోవాలనే అంశంపై తీవ్రంగా రాజకీయ వ్యూహాలనకు పదును పెడుతున్న కాంగ్రెస్ నేతలు, బీజేపీలోని కోవర్టులపై, ఆ పార్టీలోని అసంతృప్తులపై ఫోకస్ చేసినట్లు సమాచారం.

అర్వింద్ కేంద్రంగానే ఇందూరు బీజేపీ

కిందటిసారి తృటిలో చేజారిన ఇందూరు బల్దియా కుర్చీని ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో అందిపుచ్చుకోవాలని, కార్పొరేషన్ పై కాషాయ జెండాను ఎగరేయాలనే కసితో నిజామాబాద్ ఎంపీ తీవ్రంగా అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ఎవరెవరిని పార్టీలో ఎవరెవరు ఎలా ఉన్నారు. తమవారెవరు, కోవర్టు లెవరనే అంశాలపై కూడా రహస్య సర్వే చేయిస్తున్న అర్వింద్ అన్ని విషయాలను, అందరి చిట్టాను తనకాడికి తెప్పించుకున్నట్లు సమాచారం. కిందటి సారి బీజేపీ టికెట్ పై గెలిచి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ప్రలోభాలకు గురై బీఆర్ఎస్ లో చేరిన వారిలో కొందరిని ఎట్టి పరిస్థితుల్లో కాషాయం జెండా నీడను కూడా తాకనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్టీలోకి కొందరిని తిరిగి తీసుకుంటున్నప్పటికీ వారికే మళ్లీ టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది మాత్రం ఎక్కడా గ్యారంటీ ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరో పక్క అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తతో కూడా ఎంపీ అర్వింద్ సఖ్యతతో ముందుకెళుతున్నారు. పార్టీలోని అందరినీ కలుపుకుని వెళుతున్నారు. ఎవరైనా ఏదైనా సలహాలు ఇచ్చినా వింటున్నారని పార్టీ నాయకులంటున్నారు.

బీఆర్ఎస్ లో కదలికలు కనిపించడం లేదు

ఓ పక్క కాంగ్రెస్ , బీజేపీలు కార్పొరేషన్ ఎన్నికల కోసం అన్ని విధాలుగా సమాయత్తం అవుతుంటే బీఆర్ఎస్ మాత్రం కదలిక లేకుండా కదలకుండా ఉండిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీలో ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. రాష్‌ట్రంలో పార్టీ అధికారంలో లేదనే నిస్పహాయతో, లేదంటే అర్బన్ లో ప్రస్తుతం బలంగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం ల మధ్య తామెక్కడ నిలబడతామనే అభద్రతా భావమో తెలియదు కానీ, ఇప్పటి వరకైతే ఆ పార్టీలో ఎలాంటి కదలికలు కనిపంచడం లేదు. అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి వంటి వారు సైలెంట్ అయ్యారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి పార్టీకి జవసత్వాలు నింపే ప్రయత్నంలో ముందున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ లు ఖరారయ్యాక బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులను ఎంపిక చేసి రంగంలో దిగేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి తప్పకుండా కాంగ్రెస్, బీజేపీలకు గట్టి పోటీనే ఇస్తామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.

సైలెంట్ గా సత్తా చూపించనున్న ఎంఐఎం

నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఎంఐఎం పార్టీ బలంగా ఉంది. మిగతా పార్టీలతో ధీటుగా పోటీ ఇచ్చే స్థాయిలో ఉండటంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ , బీఆర్ఎస్ లు కూడా ఆ పార్టీ బలాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యూహరచనలు చేయాల్సిన అవసరముంది. కిందటి సారి జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ కన్నా రెండు సీట్లు ఎక్కువగా గెలుచుకుని అత్యధిక సీట్లు సాధించిన రెండో పార్టీగా నిలిచింది. కార్‌పొరేషన్ పరిధిలో 60 వార్డులుండగా, బీజేపీ 27 సీట్లు గెలుచుకుని అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా సగర్వంగా నిలిచింది. ఎంఐఎం 16 సీట్లు గెలుచుకుని, 14 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీని మూడో స్థానంలోకి నెట్టేసింది. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకోగా, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు గెలిచారు. బీజేపీ ఇందూరు బల్దియాపై జెండా ఎగరేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎంఐఎం ను కలుపుకోవడంతో వాటి అలయెన్స్ బలం 30 కి పెరిగింది. దాంతో బీఆర్ఎస్ కు చైర్ పర్సన్ పదవి, ఎంఐఎం కు వైస్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఈసారి కూడా ఎంఐఎం అదే దూకుడును కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రదర్శించి అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు సైలెంట్ గా పని చేస్తోంది. కచ్చితంగా ఈసారి కూడా తమ సత్తా చూపిస్తామని ఎంఐఎం నేతలు చెపుతున్నారు.

మహాయుద్ధాన్ని తలిపించనున్న ఇందూరు బల్దియా ఎన్నికలు

ఈసారి జరిగే ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే రీతిలో జరుగనున్నాయి. ఓ రకంగా మహాయుద్ధాన్ని తలపించే విధంగా నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గెలుపు కోసం అన్ని పార్టీలు చెమటోడుస్తాయని, ఏ ఒక్క అవకాశాన్ని కూడా విడిచి పెట్టకుండా పోరాడతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story